వాళ్లలో నాన్నను చూస్తున్నా!

తన చివరి రక్తపు బొట్టుని కూడా దేశానికే ధారపోయాలనుకుంటాడు ఏ సైనికుడైనా! ఆయనా అలానే ఆశపడ్డాడు. కానీ క్యాన్సర్‌ ఆ వీరసైనికుని కలని తుంచేయాలని చూసింది.. అతను మాత్రం తన బాధ్యతని... కూతురికి అప్పగించి మృత్యువునే వెక్కిరించాడు.

Published : 25 May 2021 00:26 IST

తన చివరి రక్తపు బొట్టుని కూడా దేశానికే ధారపోయాలనుకుంటాడు ఏ సైనికుడైనా! ఆయనా అలానే ఆశపడ్డాడు. కానీ క్యాన్సర్‌ ఆ వీరసైనికుని కలని తుంచేయాలని చూసింది.. అతను మాత్రం తన బాధ్యతని... కూతురికి అప్పగించి మృత్యువునే వెక్కిరించాడు. ఇప్పుడామె లెఫ్టినెంట్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టింది. ఆమే హైదరాబాద్‌కి చెందిన 23 ఏళ్ల నందిపాటి అనూష...
మిలటరీ నర్సింగ్‌ ఆఫీసర్‌ కోర్సును పూర్తి చేసుకుని ఈ మధ్యే బాధ్యతల్లో చేరింది అనూష. సైన్యానికి సేవ చేయాలనేది తన తండ్రి కోరిక. ఆయనిప్పుడు లేరు. కానీ ఆయన కలని నెరవేర్చడం కోసం కఠినమైన ఆర్మీ శిక్షణను సైతం ఎంతో పట్టుదలతో పూర్తిచేసింది అనూష. ‘నాన్న శివప్రసాద్‌ ఆర్మీలో పనిచేసేవారు. అమ్మ లలితాకుమార్‌ గృహిణి. ఇంటర్‌ వరకు నాకు మైక్రోబయాలజీ అంటే ఇష్టం. అది చదవడానికి సైనిక్‌పురి కాలేజీలో చేరా. ఇంతలో నాన్నకి కాలేయ క్యాన్సరని తెలిసింది. ఇంకెన్నో రోజులు బతకరని వైద్యులు చెప్పారు. అప్పట్నుంచి నాతో ఎక్కువ సమయం గడిపేవారు. ఆయన నాలుగు మాటలు మాట్లాడితే ఆ నాలుగూ సైనికుల గురించే ఉండేవి. తన అనుభవాలు.. తోటి సైనికుల విరోచిత గాథలు. ఇవే చెప్పేవారు. మాటల మధ్యలో ‘నీకు దేశమాత రుణం తీర్చుకోవాలని లేదా అమ్మా’ అని అడిగారు. అప్పటివరకూ లేకపోయినా ఆయన కలని నిజం చేయడానికి ఆర్మీ నర్సింగ్‌ ఆఫీసర్‌ కోర్సులో చేరాలనుకున్నా. ప్రవేశపరీక్ష రాసి ఇంటర్వ్యూ వరకూ వెళ్లా. అప్పటికే నాన్న అనారోగ్యం ఎక్కువైంది. 2016లో లఖనవూ నర్సింగ్‌ కాలేజీలో నాలుగేళ్ల కోర్సులో అడ్మిషన్‌ దొరికింది. అప్పుడు నాన్న ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంతా కాదు. కానీ నేను కాలేజీలో చేరేలోపే ఆయన హార్ట్‌ఎటాక్‌తో మరణించారు. అన్నయ్య వేరే చోట ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మను ఒంటరిగా వదిలి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. గుండె దిటవు చేసుకుని శిక్షణ కోసం బయలుదేరాను’ అంటూ సైన్యంలో చేరడానికి  కారణాలని వివరించింది అనూష.  

ఈ కోర్సులో చేరడానికి దేశవ్యాప్తంగా ఇరవై లక్షలమంది దరఖాస్తు చేసుకుంటే అనేక వడపోతల తర్వాత 180 మంది ఎంపికయ్యారు. అనూష వారిలో ఒకరు. ‘నర్సింగ్‌ కాబట్టి శిక్షణలో మాకు సడలింపులుంటాయి అనుకుంటే పొరపాటు. సైనికులకు ఇచ్చే శిక్షణే మాకూ ఉంటుంది. గన్‌ ఉపయోగించడం తప్ప మిగతా ట్రైనింగ్‌ అంతా అదే. ఆ సమయంలో మా దగ్గర ఫోన్‌ కూడా ఉండనిచ్చే వారు కాదు. దాంతో అమ్మ ఒంటరిగా ఎలా ఉందో అని దిగులుగా ఉండేది. ఆ బాధతో తోటి అమ్మాయిలతో కూడా సరిగా కలిసేదాన్ని కాదు. నిజానికి అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే నేను అక్కడకు వచ్చాను. నిరుత్సాహంలో ఉన్న నాకు, తనే ధైర్యం చెప్పి లఖనవూ పంపింది. ‘సైనికులకు సేవనందిస్తే అది దేశానికి సేవ చేసినట్లే’ అంటూ నాన్న చెప్పిన మాటలే నా చెవుల్లో మార్మోగుతూ ఉండేవి. కానీ నాన్న లేరన్న బాధ నుంచి బయటపడటానికి ఏడాది పట్టింది. ఇటీవలే నా కోర్సు ముగిసింది. లెఫ్టినెంట్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌గా విధుల్లోనూ చేరా. ప్రస్తుతం లఖనవూ మిలటరీ ఆసుపత్రిలో కొవిడ్‌ రోగుల ఐసీయూలో సేవలందిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది అనూష.  
శత్రువు ఉనికిని అంచనా వేయడంలో సైనికుడికి ఉండే చురుకుదనమే... నర్సింగ్‌లో ఉండే మాకూ అవసరం. గాయపడిన సైనికుడికి క్షణాల్లో వైద్యం అందించాలి. ఏమరపాటు పనికిరాదు. దేశం మొత్తానికి అండగా ఉండే సైనికుడి గుండెకు మేం అండగా ఉంటాం. శిక్షణలో మాకదే నేర్పిస్తారు అంటోంది అనూష. ‘ఓరోజు అర్ధరాత్రి కల్నల్‌ ఒకాయనకు హార్ట్‌ఎటాక్‌ వచ్చింది. డాక్టర్‌కూ సమాచారమిచ్చి... క్షణాల్లో అతనికి అత్యవసర చికిత్స అందించాను. కొన్ని రోజుల తర్వాత ఆ కల్నల్‌ నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు కృతజ్ఞతలు చెబుతుంటే ఎంతో తృప్తిగా అనిపించింది. ఆ సమయంలో నాన్న  గుర్తొచ్చారు. ఇదే కదా నాన్న కల అనుకున్నా. అన్నయ్య కూడా నేవీనే కెరీర్‌నే ఎంచుకున్నాడు. ఇప్పుడు మా కళ్లముందే కొందరు రోగులు కొవిడ్‌తో చనిపోతుంటే బాధగా ఉంటోంది. మా సేవలతో కోలుకుని సంతోషంగా బయటకు వెళ్లినవారిని చూస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది’ అనే అనూష ప్రతి రోగిలోనూ తండ్రినే చూసుకుంటున్నానంటోంది చెమర్చిన కళ్లతో!



ఏవో భయాలతో ఎవరినో అనుకరించకండి. ఇతరుల కంటే భిన్నంగా చేయడంలోనే మీ ప్రత్యేకత, ఉన్నతి ఉన్నాయి.
- సారా బ్లాక్‌లీ, వ్యాపారవేత్త

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్