విద్యా రుణం.. తెలుసుకోండి ఇవన్నీ

విదేశాల్లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భవిష్యత్‌ కోసం బాటలు వేసుకునేందుకు విదేశీ బాట పడుతున్న వారు ఎందరో.

Published : 11 Aug 2023 00:14 IST

విదేశాల్లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భవిష్యత్‌ కోసం బాటలు వేసుకునేందుకు విదేశీ బాట పడుతున్న వారు ఎందరో. 2024 నాటికి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య 18 లక్షలకు చేరుకుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా 19 శాతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కలలను నెరవేర్చడానికి విద్యా రుణాలు ఎంతో కీలకంగా మారుతున్నాయి. మరి, ఈ రుణం తీసుకునేటప్పుడు పరిశీలించాల్సిన ముఖ్యమైన అంశాలేమిటో చూద్దామా...

ఉన్నత చదువులతో తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలనుకునే విద్యార్థులు తమ గమ్యస్థానాన్ని ఎంచుకునేటప్పుడే అన్ని ఖర్చుల గురించి నిశితంగా పరిశోధన చేస్తారు. కోర్సులు, విశ్వవిద్యాలయాల ఎంపికలోనూ అప్రమత్తంగా ఉంటారు. పెరుగుతున్న విద్యా ద్రవ్యోల్బణం దృష్ట్యా విదేశాల్లో చదువుకోవడం ఖరీదైన వ్యవహారంగానే మారింది. దీన్ని తట్టుకోవాలంటే విద్యారుణం ఒక తప్పనిసరి అవసరంగా మారుతోంది. బ్యాంకులతో పాటు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ ఇప్పుడు విద్యా రుణాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా రుణం తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశాలేమిటంటే..

  • ఖర్చును విశ్లేషించండి: విద్యా రుణం తీసుకునే ముందు కోర్సు పూర్తి చేసేందుకు అయ్యే మొత్తం వ్యయాన్ని అంచనా వేయాలి. దీనికోసం అక్కడ చదివిన వారిని సంప్రదించండి. ఇతర మార్గాల్లోనూ ఖర్చును అంచనా వేసుకోండి. కొంతమంది రుణదాతలూ ఖర్చును అంచనా వేసేందుకు ఉపయోగపడే కాలిక్యులేటర్లను అందిస్తున్నారు. వీటిని ఉపయోగించుకోవచ్చు.
  • అవగాహన పెంచుకోండి: విద్యా రుణం ఎంచుకునే ముందు సొంతంగా కొంత పరిశోధన చేయాలి. ఇంతకు ముందు రుణాలు తీసుకున్న బంధువులు, స్నేహితులతో మాట్లాడాలి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ విషయంలో విద్యార్థులకు సహాయం చేస్తాయి. విద్యా రుణాల గురించి, అందులో ఉండే ప్రక్రియల గురించి అర్థం చేసుకోవడంలో ఈ సలహాలు తోడ్పడతాయి. రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి.
  • అన్ని ఖర్చులకూ: విద్యార్థులు విద్యా రుణాన్ని తీసుకునే ముందు పరిగణించాల్సిన అంశాల్లో అనుబంధ ఖర్చులకూ వర్తించేలా రుణం ఇవ్వాలి. ట్యూషన్‌ ఫీజులతోపాటు,  ప్రయాణ ఖర్చులు, ల్యాప్‌టాప్‌వంటివి, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్‌లాంటి వ్యయాలకూ రుణం అందించాలి. అలాంటి సంస్థలనే ఎంచుకోవాలి.
  • రుణదాత విషయంలో: విద్యా రుణాలు ప్రత్యేకమైనవి. వీటిని అందించేందుకు రుణదాతలు సరైన విధానాన్ని పాటించాలి. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను ఎంచుకునేటప్పుడు చేసే చిన్న పొరపాటు, దీర్ఘకాలం భారంగా మారుతుంది. కేవలం వడ్డీ రేట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోవద్దు. రుణంతో పాటు అందించే ఇతర ప్రయోజనాలూ చూసుకోండి.
  • భాగస్వామ్యం ఉంటే: కొన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో రుణ సంస్థలకు ఒప్పందం ఉంటుంది. మీరు ఎంచుకున్న కళాశాల/విశ్వ విద్యాలయంతో భాగస్వామ్యం ఉన్న ఆర్థిక సంస్థలను పరిశీలించండి. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మీ అర్హతను బట్టి, సులభంగా రుణాలు వచ్చేందుకు వీలుంటుంది.
  • తిరిగి చెల్లించేప్పుడు: విద్యా రుణాలను తీసుకునేటప్పుడు వాటిని ఎంత కాలం కొనసాగించాలనుకుంటున్నారు అన్నదీ ముఖ్యమే. విద్యార్థులు తమకు అనువైన వ్యవధిని ఎంచుకోవాలి. దీనికోసం ముందుగానే ఆర్థిక సంస్థలతో చర్చించడం ముఖ్యం. మారటోరియం వ్యవధిలో విద్యార్థులు సాధారణ/పాక్షిక వడ్డీని చెల్లిచడం మంచిది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది.
  • రుణం తీసుకునే ముందే ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా అనుకున్న కోర్సును పూర్తి చేసేందుకు వీలవుతుంది.

అమిత్‌ గైండా, ఎండీ-సీఈఓ, అవన్సే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని