సొంత బీమా ఉంటేనే మేలు..

Published : 25 Jun 2022 17:48 IST

మా అబ్బాయి వయసు 14. ఏడేళ్ల తర్వాత అమెరికాకు పంపించాలనేది ఆలోచన. ఇప్పటి నుంచి నెలకు రూ.25వేల చొప్పున ఇందుకోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

- విజయ్‌కుమార్

ముందుగా మీ అబ్బాయి భవిష్యత్‌ అవసరాలకు రక్షణ కల్పించేందుకు మీ పేరుపై తగిన మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోండి. మీ అబ్బాయి అమెరికా వెళ్లేందుకు ఇంకా ఏడేళ్ల వ్యవధి ఉంది. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వచ్చేలా చూసుకోవాలి. దీనికోసం ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. మదుపు చేయాలనుకుంటున్న రూ.25వేలలో రూ.15వేలను మంచి పనితీరున్న అమెరికాలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్‌ ఫండ్లకు కేటాయించండి. మిగతా రూ.10వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. మీకు డబ్బు అవసరమైన రెండేళ్ల ముందు నుంచే ఈ మొత్తాన్ని క్రమంగా వెనక్కి తీసుకుంటూ.. సురక్షిత పథకాల్లోకి మళ్లించండి.


ఏడేళ్ల క్రితం ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నాను. ఇప్పటి వరకూ ఒక క్లెయిం లేదు. ఇటీవలే నాకు మధుమేహం వచ్చిందని తెలిసింది. పునరుద్ధరణ సమయంలో పాలసీ విలువను పెంచుకోవచ్చా? మధుమేహానికి పాలసీ వర్తించదని అంటున్నారు. నిజమేనా?

- కరుణాకర్‌

మీరు ఆరోగ్య బీమా తీసుకొని, ఇప్పటికే ఏడేళ్లు అయ్యింది. కాబట్టి, మీకు ఎలాంటి మినహాయింపుల షరతులూ వర్తించవనే చెప్పాలి. పాలసీ పునరుద్ధరణ సమయంలో మధుమేహం గురించి బీమా సంస్థకు తెలియజేయండి. ఇప్పటి వరకూ ఉన్న పాలసీ మొత్తానికి ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చు. కానీ, కొత్తగా పెంచుకోవాలనుకున్న మొత్తానికి సంబంధించి, మినహాయింపును వర్తించే ఆస్కారం ఉంది. అవసరమైతే వైద్య పరీక్షలకూ సిద్ధంగా ఉండండి.


నా వయసు 35. ఇప్పటి వరకూ జీవిత బీమా పాలసీ తీసుకోలేదు. కంపెనీ అందిస్తున్న బృంద ఆరోగ్య బీమా ఉంది. నెలకు రూ.10వేల వరకూ పెట్టుబడి కోసం కేటాయించగలను. నేను ఏం చేయాలి?

- మధు

కంపెనీ అందిస్తున్న బృంద ఆరోగ్య బీమా ఉన్నా.. వ్యక్తిగతంగా మరో పాలసీ ఉండటం ఎప్పుడూ మంచిదే. మీరు కంపెనీ మారినప్పుడు ఈ బీమా వర్తించదు. పైగా ఏదైనా క్లెయిం చేసుకోవాల్సి వచ్చినప్పుడు బిల్లు ఎక్కువైనా ఇబ్బందే. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల జీవిత బీమా పాలసీ తీసుకోవడం మంచిది. ఇప్పటికైనా ఆలస్యం చేయొద్దు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంలో రూ.7వేలను ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా రూ.3వేలను పీపీఎఫ్‌లో జమ చేయండి.


ఇటీవలే వివాహం అయ్యింది. నా ఖర్చులు పోను రూ.15వేల వరకూ మిగులుతాయి. ఈ మొత్తాన్ని నాలుగైదేళ్ల వరకూ పొదుపు చేయాలని అనుకుంటున్నాను. మంచి రాబడి వచ్చేలా ఎక్కడ జమ చేయాలి?

- రజిత

ముందుగా మీరు మూడు నుంచి ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని సిద్ధం చేసుకోండి. పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజీ ఫండ్లలో ఎస్‌ఐపీ ద్వారా మదుపు చేయండి. ఇందులో కాస్త నష్టభయం ఉండొచ్చు. అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే.. 8-9 శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంది.


మూడేళ్ల నుంచి పీపీఎఫ్‌లో నెలకు రూ.5వేలు జమ చేస్తున్నాను. దీనికి బదులుగా అధిక వడ్డీ వచ్చేలా ఏవైనా ఇతర పథకాలను ఎంచుకోవచ్చా? మరో రూ.5,000 అదనంగా మదుపు చేస్తాను. 15 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం అయ్యేందుకు అవకాశం ఉంది?

- రాజేశ్‌

ఇప్పుడున్న సురక్షిత పథకాల్లో అధిక రాబడినిచ్చేది ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌). దీనికి చెల్లించిన మొత్తానికి సెక్షన్‌ 80సీ మినహాయింపు వర్తిస్తుంది. వచ్చిన వడ్డీకి సైతం పన్ను ఉండదు. కాబట్టి, ఈ పెట్టుబడిని కొనసాగించండి. కొత్తగా మదుపు చేయాలనుకుంటున్న రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. నెలకు రూ.5వేల చొప్పున ఫండ్లలో 15 ఏళ్లపాటు కొనసాగిస్తే.. 12 శాతం రాబడి అంచనాతో.. రూ.22,36,782 అయ్యేందుకు వీలుంది. పీపీఎఫ్‌లో 15 ఏళ్లపాటు నెలకు రూ.5వేలు జమ చేస్తే.. 7.1శాతం వడ్డీ లెక్కన రూ.15,19,405 జమ అవుతాయి.


- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని