Maruti Suzuki: మారుతీ సుజుకీ కార్లు మరింత ఖరీదు.. ఏప్రిల్‌ నుంచి కొత్త ధరలు

Maruti Suzuki: ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 రెండో దశ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహన సంస్థలు తయారీలో మార్పులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో మారుతీ సుజుకీ చేరింది.

Updated : 23 Mar 2023 15:06 IST

దిల్లీ: మారుతీ సుజుకీ (Maruti Suzuki) తమ కార్ల ధరల్ని పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని గురువారం తెలిపింది. నియంత్రణాపరమైన చర్యలు, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలోనే ధరల్ని సవరించాల్సి వస్తోందని పేర్కొంది. అయితే, ధరలు ఎంత మేర పెంచనున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

తయారీ వ్యయాల్ని నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నించామని మారుతీ సుజుకీ (Maruti Suzuki) తెలిపింది. అయినప్పటికీ.. కొంత భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయక తప్పడం లేదని పేర్కొంది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు మారుతుందని తెలిపింది. ఇప్పటికే హోండా కార్స్‌, టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌ సైతం వచ్చే నెల నుంచి ధరల్ని పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
(ఇదీ చదవండి: ఏప్రిల్‌ నుంచి అమల్లోకి బీఎస్‌ 6 కొత్త నిబంధనలు.. ఏం మారతాయ్‌!)

ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 రెండో దశ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహన సంస్థలు తయారీలో మార్పులు చేయాల్సి ఉంది. బీఎస్‌6- 2.0గా పిలుస్తున్న ఈ దశలో ఆటోమొబైల్‌ తయారీ కంపెనీలు ‘రియల్‌ డ్రైవింగ్ ఎమిషన్‌ (RDE)’ ప్రమాణాలను తప్పక పాటించాలి. ఈ నేపథ్యంలోనే చాలా సంస్థలు ధరల్ని పెంచుతున్నాయి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని