Rupee Value: 1 డాలర్‌ = రూ.80.. రికార్డు కనిష్ఠానికి రూపాయి పతనం!

Rupee value against dollar declines: డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ గురువారం రికార్డు గరిష్ఠమైన రూ.80 మార్క్‌ను తాకింది.

Updated : 19 Jul 2022 10:51 IST

Rupee Value: డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ (Rupee Value) మంగళవారం రూ.80 మార్క్‌ను తాకింది. గతకొన్ని రోజులుగా 79.90పైన ట్రేడవుతూ 80తో దోబూచులాడిన రూపాయి ఎట్టకేలకు ఈరోజు విశ్లేషకుల అంచనాలను నిజం చేసింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు రూపాయి (Rupee Value) 7 శాతం వరకు క్షీణించింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో డాలర్‌ (Dollar) మారకపు విలువ రూ.82కు చేరొచ్చని కొన్ని బ్రోకరేజీ సంస్థలు, రూ.79కి పరిమితం కావచ్చని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమి తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రూపాయి విలువ (Rupee Value) 25 శాతం మేర క్షీణించింది. 2014 డిసెంబర్‌ 31 నాటికి రూపాయి విలువ 63.33గా ఉండగా.. 2022 జులై 11 నాటికి అది 79.41కి చేరింది. ఆర్‌బీఐ గణాంకాలను ఉదహరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా ఈ వివరాలను సోమవారం పార్లమెంట్‌కు నివేదించారు.

(ఇదీ చదవండి: రూపాయి క్షీణత ప్రభావం ఏ రంగంపై ఎలా ఉంటుంది?)

జనవరి నుంచి ఇండియా రూపాయి డాలర్‌తో పోలిస్తే దాదాపు ఏడు శాతం పతనమైంది. అధిక ద్రవ్యోల్బణం, ధరల విపరీత పెరుగుదలతో ప్రస్తుతం దేశంలో సామాన్యుల జీవనం భారంగా మారింది. 2029 నాటికి ఒక్కో యూఎస్‌ డాలరు రూ.94 నుంచి రూ.95 పలుకుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. అదే జరిగితే ఇండియా ఆర్థిక వ్యవస్థ బలహీనత మరింతగా బహిర్గతమవుతుంది.

(ఇదీ చదవండి: ధరలు మండుతున్నా... డాలరుదే హవా.. అదెలా?)

కారణాలివే..

  • మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్‌ అధికం. భారత ‘కరెంట్‌ ఖాతా లోటు (CAD)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.
  • ముడిచమురు ధర 100 డాలర్ల పైకి చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ పైపైకి ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది. ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యధికం.
  • ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై నమ్మకం లేనందువల్ల విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి.
  • అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించుకొని అమెరికా, ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
  • ఉక్రెయిన్‌ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడిచమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటేనే, రూపాయి పతనం ఆగుతుంది.

(ఇదీ చదవండి: రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలివే)

వివిధ పరిశ్రమలపై రూపాయి పతన ప్రభావం..

* దిగుమతి వస్తువులు లేదా, దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలు (ముఖ్యంగా మొబైల్‌) ఖరీదు కావొచ్చు. రూపాయి 1 శాతం క్షీణిస్తే మొబైల్‌ విడిభాగాలపై 0.6 శాతం ప్రభావం పడుతుంది. రూపాయి విలువ 5% తగ్గితే మొత్తం లాభదాయకతకు 3 శాతం నష్టం వాటిల్లుతుంది. దీంతో మొబైల్‌ ధరలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

* ఐటీ పరిశ్రమ ఆదాయాల్లో ఎక్కువ భాగం డాలర్ల రూపంలోనే వస్తాయి కాబట్టి డాలరు బలోపేతం అయ్యే కొద్దీ ఈ పరిశ్రమ ఆదాయ వృద్ధి, మార్జిన్లపై సానుకూల ప్రభావం కనిపించొచ్చు.

* డాలరుతో పోలిస్తే రూపాయి క్షీణించడం వల్ల దేశీయ ఉక్కు పరిశ్రమలో ముడి పదార్థాల వ్యయాలను పెంచుతాయి. ముడి ఇనుము కాకుండా.. కోకింగ్‌ కోల్‌ కూడా ఉక్కు తయారీకి ప్రధానముడి సరుకు.. బొగ్గు దిగుమతులు ప్రియం కానున్నాయి.

* వైద్య పరికరాల పరిశ్రమకు ఇప్పటికే పలు ద్రవ్యోల్బణ సవాళ్లు ఎదురయ్యాయి.. రవాణా ఛార్జీల రూపంలో తీవ్ర వ్యయభారం పడింది. ముడి పదార్థాల సరఫరా కూడా పరిమితంగా మారింది.

ఏం చేయాలి?

దిగుమతులపై పరిమితి: దేశీయంగా పోటీతత్వాన్ని, ఎగుమతులను పెంచడానికి సరఫరా విధానాలను మెరుగుపరచాలి. మన చమురు అవసరాల్లో 80శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దాన్ని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించాలి. బంగారం కొనుగోలును నిరుత్సాహపరచడానికి దిగుమతి సుంకాన్ని పెంచినా- సీఏడీని తగ్గించడానికి దిగుమతుల పరిమాణంపై పరిమితిని విధించాల్సిన అవసరం ఉంది.

షరతులు సడలిస్తే: అనవసరమైన వస్తువుల దిగుమతులను నివారిస్తే డాలర్లకు డిమాండ్‌ తగ్గుతుంది. ఎగుమతులను పెంచితే డాలర్ల ప్రవాహం పెరుగుతుంది. అది రూపాయి క్షీణతను నియంత్రిస్తుంది. బాహ్య వాణిజ్య రుణాల (ఈసీబీ) షరతులను సడలిస్తే విదేశీ కరెన్సీల్లో ఎక్కువ రుణాలను పొందవచ్చు. అది విదేశ ద్రవ్య నిల్వలను పెంచడంతో పాటు రూపాయి విలువ పెరగడానికి ఉపకరిస్తుంది.

ప్రపంచ విపణిలో పాగా: స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలపై భారత్‌ సంతకాలు చేయడంతోపాటు అధిక ఆదాయ దేశాల్లోకి మన మార్కెట్‌ చొచ్చుకుపోయేలా చర్యలు తీసుకోవాలి. భూమి, విద్యుత్తు, మూలధనానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. చైనా మాదిరిగా ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేయాలి. వాటికితోడు ఎగుమతి ప్రయోజనాలు, తక్కువ వడ్డీ రేట్లు, కార్మిక సంస్కరణల అమలు ద్వారా దేశీయంగా పరిశ్రమల ఏర్పాటుకు విదేశీ సంస్థలను ఆకర్షించవచ్చు.

రూపాయల్లో అంతర్జాతీయ చెల్లింపులు: అంతర్జాతీయ వాణిజ్యంలో ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలు మన రూపాయల్లో జరిగేందుకు వీలుగా వాణిజ్య బ్యాంకులు వోస్ట్రో ఖాతాలను తెరవాలని ఇటీవల ఆర్‌బీఐ ఆదేశించింది. దానివల్ల డాలర్ల అవసరం తగ్గి, రూపాయి బలపడే అవకాశం ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని