ఒంటరి తల్లినని వేధిస్తున్నాడు!

ఒంటరి తల్లిని. జీవనోపాధికి ఓ ప్రైవేట్‌ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నా. ఈ మధ్య మా బాస్‌ ప్రవర్తన నన్ను ఇబ్బంది పెడుతోంది. తరచూ క్యాబిన్‌కి పిలవడం, అవసరం లేని పనుల్లోనూ నన్ను చేర్చడం, ఏదో వంకతో కానుకలు ఇవ్వడం వంటివి చేస్తున్నాడు.

Published : 25 Jul 2023 12:51 IST

ఒంటరి తల్లిని. జీవనోపాధికి ఓ ప్రైవేట్‌ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నా. ఈ మధ్య మా బాస్‌ ప్రవర్తన నన్ను ఇబ్బంది పెడుతోంది. తరచూ క్యాబిన్‌కి పిలవడం, అవసరం లేని పనుల్లోనూ నన్ను చేర్చడం, ఏదో వంకతో కానుకలు ఇవ్వడం వంటివి చేస్తున్నాడు. ఫొటోలు తీసి నాకు చూపిస్తున్నాడు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తే.. సాక్ష్యం చెప్పడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. అప్పటి నుంచి అతడు నన్నే తప్పుడు మనిషిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. పోలీసులకి ఫిర్యాదు ఇస్తే... గొడవ పెద్దది అవుతుందేమో అని భయం. అతడు నా జోలికి రాకుండా  చట్టం నాకెలా సాయం చేస్తుంది?

- ఓ సోదరి

పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపుల చట్టం-2013 మీకు సాయపడుతుంది. విశాఖ వర్సెస్‌ రాజస్థాన్‌(1997) కేసులో సుప్రీంకోర్టు పనిచేసే చోట లైంగిక వేధింపుల రక్షణ కోసం కొన్ని సూత్రాలు రూపొందించింది. వాటిననుసరించి ఈ చట్టాన్ని తీర్చిదిద్దారు. ఇందులో బాధిత మహిళ ఉద్యోగి అయితే చాలు... ప్రభుత్వ, ప్రైవేటు, కర్మాగారాలు, సంఘాలు, సహాయ సంస్థలు, ఆసుపత్రులు, వాణిజ్య సంస్థలు, ఇళ్లు... ఇలా తాను పనిచేసే చోట ఎక్కడైనా సరే వేధింపులకు గురైతే ఈ చట్టం కింద రక్షణ కోరవచ్చు. తాత్కాలిక ఉద్యోగులకూ ఇది వర్తిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోరిక తీర్చమని సైగలు, మాటలు, చేతలు, ఫొటోలు, సామాజిక మాధ్యమాలు వంటివాటి ద్వారా వారిని బలవంతపెట్టడం, బతిమాలడం లాంటివన్నీ లైంగిక వేధింపుల కిందే లెక్క. అంతేకాదు ప్రతి యజమానీ, లేదా కార్యాలయంలో నియమితులైన అధికారి ఆడవారి సౌకర్యం కోసం తగిన నియమ నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని విచారించడానికి వీలుగా ఓ ఇంటర్నల్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. అందరికీ దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా వారిదే. ఇందులో ఒక మహిళాధికారి తప్పనిసరి. బాధితురాలు ఫిర్యాదును మౌఖికంగా కాకుండా లేఖ రూపంలో ఇచ్చాక బాధ్యులను పిలిపించి కమిటీ ద్వారా విచారణ జరిపించాలి. అంతేకాదు, ఆమె పనికి ఆటంకం కలగకుండా వేరే విభాగానికి బదిలీ చేయవచ్చు. ఇంటర్నల్‌ కమిటీ లేని పక్షంలో డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్‌కి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. వారి ద్వారా స్థానిక కమిటీకి బదిలీ జరుగుతుంది. ఇళ్లల్లో పనిచేసేవారు కూడా లోకల్‌ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. సంఘటన జరిగిన మూడు నెలలలోపు ఈ పని చేయాల్సి ఉంటుంది. అప్పుడు వారు పిలిపించి మాట్లాడతారు. సెక్షన్‌ 10 ప్రకారం సయోధ్యకి ప్రయత్నిస్తారు. లేకపోతే 7 రోజుల్లోపు పోలీసు వారికి కేసుని బదిలి చేస్తారు. ఒక వేళ సంఘటనలు నిజమేనని నిరూపణ అయితే, అందుకు బాధ్యులైన వారిమీద చర్య తీసుకోమని యజమాన్యాన్ని ఆదేశిస్తుంది. మీ సమస్యకి పరిష్కారం మీరు స్థానిక కమిటీకి ఫిర్యాదు చేయడం. వారు అతన్ని పిలిపించి మాట్లాడి...నిరూపణ అయితే చర్యకు సిఫారసు చేస్తారు. మీరు భయపడాల్సిన పనిలేదు. మీ ఫిర్యాదు కాపీని మహిళా కమిషన్‌ లేదా మానవహక్కుల కమిషన్‌కి సమర్పించండి. న్యాయం జరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని