తిండి ధ్యాస లేదేంటి?
ఈ వయసులో హార్మోన్లలో మార్పొచ్చే అవకాశముంది. విటమిన్ లోపాలు, ఐరన్ డెఫిషియెన్సీ, థైరాయిడ్ లాంటివున్నాయా, ఇన్ఫెక్షన్లు, జీర్ణకోశ సమస్యలా, లేదంటే వాటికి వాడే మందుల ప్రభావమా తెలుసుకోవాలి.
నాకిప్పుడు అరవయ్యేళ్లు. ఈమధ్య తిండి మీద ధ్యాస పూర్తిగా తగ్గిపోయింది. దేన్ని చూసినా తినాలనిపించదు. ఇంట్లోవాళ్లు ఎందుకింత విరక్తి అంటారు? ఎవరేమన్నా తినాలనే కోరిక లేదు. ఎందుకిలా మార్పు వచ్చిందో, నేనేం చేయాలో దయచేసి చెప్పండి!
- ఒక సోదరి, వరంగల్లు
ఈ వయసులో హార్మోన్లలో మార్పొచ్చే అవకాశముంది. విటమిన్ లోపాలు, ఐరన్ డెఫిషియెన్సీ, థైరాయిడ్ లాంటివున్నాయా, ఇన్ఫెక్షన్లు, జీర్ణకోశ సమస్యలా, లేదంటే వాటికి వాడే మందుల ప్రభావమా తెలుసుకోవాలి. ఒకసారి చెకప్ చేయించుకోండి. శారీరక రుగ్మతలు ఏమీ లేవు, షుగరు, బీపీ కంట్రోల్లోనే ఉన్నాయంటే మానసిక సమస్య అయ్యుంటుంది. భర్త ఆరోగ్యం బాగోకపోవడం, స్నేహితులను కలవలేకపోవడం, బంధుమిత్రులెవరైనా దూరమవడం, పిల్లల దగ్గరుంటే వాళ్లు తమ పనులతో, మనవలు చదువుల్లో ఉండి మాట్లాడే తీరిక లేకపోవడం, అక్కడ మీ వయసువారు లేకపోవడం- ఇలా ఒంటరితనంతో డిప్రెషన్ వస్తుంది. కనుక ఏదో ఒక దిగులుతో ఆకలి తగ్గిపోవడం, ఏదీ రుచించకపోవడం, నిద్ర పట్టకపోవడం, ప్రత్యేక కారణమేదీ లేకున్నా విరక్తిగా ఉండటం జరుగుతుంది. ఒకసారి సైకియాట్రిస్టును కలవండి. దీన్ని ‘మేజర్ డిప్రెషన్’ అంటారు. పెద్దవయసులో వచ్చే ఈ వ్యాధికి ‘యాంటీ డిప్రెసెంట్’ మందులున్నాయి. తగిన మోతాదులోనే ఇస్తారు. డాక్టర్ మీ మానసిక స్థితితోబాటు కుటుంబంలో అనుబంధాలు, మీ మనసులోని వ్యథ తెలుసుకుని కౌన్సిలింగ్ ఇస్తారు. ముందు రోజూ వాకింగ్‌కెళ్లండి. టీవీలో మంచి కార్యక్రమాలు చూడండి. లేదా మీ కోడళ్లకి చిన్నచిన్న సహాయాలు చేస్తూ కబుర్లు చెప్పండి. పిల్లలకు కథలు చెప్పండి. ఇలా మీ సమయాన్ని ఆయా విషయాలకు కేటాయించుకుంటే ఒంటరితనం ఉండదు. అలాగే వారానికోసారి మీకిష్టమైన బంధుమిత్రులతో కాసేపు ఫోన్లో మాట్లాడండి. ఎక్కడికైనా వెళ్తుండండి. కొవిడ్ వల్ల కుదరకుంటే వాకిట్లోనే నడవండి. పేపరు, పుస్తకాలు చదవండి, అప్పుడు డిప్రెషన్ తగ్గుతుంది. మీరు ఇంటి వాతావరణాన్ని, మనసును మార్చుకుని, అవసరమైతే మాత్రలు వేసుకుంటే నార్మల్ అయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.