మాకిప్పుడే పిల్లలు వద్దు.. ఎలాంటి గర్భనిరోధకాలు వాడాలి?

సంతానం వద్దనుకున్న వాళ్లకు చాలా రకాల గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఏ రకమైన మందులు, సాధనాలు వాడకుండా పాటించే సేఫ్‌ పీరియడ్స్‌ దగ్గర నుంచి అండం, వీర్య కణాల కలయికను నిరోధించే బారియర్‌ పద్ధతుల వరకు చాలా ఉన్నాయి. ఇంకా హార్మోనల్‌ కాంట్రాసెప్టివ్స్‌ను తీసుకుంటే, వెజైనల్‌ రింగ్స్‌, ప్రొజెస్టిరాన్‌ ఐయూసీడీస్‌, ఇంజెక్షన్లు, ఇంప్లాట్స్‌... లాంటి పద్ధతులున్నాయి....

Updated : 19 Aug 2021 07:34 IST

ఈ మధ్యే పెళ్లైంది. కొన్నాళ్లు పిల్లలు వద్దనుకున్నాం. ఒక్కొక్కరూ ఒక్కో సలహా ఇస్తున్నారు. అంతా గందరగోళంగా అనిపిస్తోంది. ఏ పద్ధతులు పాటించమంటారు?

- ఓ సోదరి, నిజామాబాదు


సంతానం వద్దనుకున్న వాళ్లకు చాలా రకాల గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఏ రకమైన మందులు, సాధనాలు వాడకుండా పాటించే సేఫ్‌ పీరియడ్స్‌ దగ్గర నుంచి అండం, వీర్య కణాల కలయికను నిరోధించే బారియర్‌ పద్ధతుల వరకు చాలా ఉన్నాయి. ఇంకా హార్మోనల్‌ కాంట్రాసెప్టివ్స్‌ను తీసుకుంటే, వెజైనల్‌ రింగ్స్‌, ప్రొజెస్టిరాన్‌ ఐయూసీడీస్‌, ఇంజెక్షన్లు, ఇంప్లాట్స్‌... లాంటి పద్ధతులున్నాయి. గర్భాశయంలో లోపల అమర్చే కాపర్‌టీ సాధనాలు కూడా ఉన్నాయి. మీ విషయానికి వస్తే మీకు ఏది సరిపోతుందనేది నిర్ధారించడానికి వైద్యులు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. మీ ఆరోగ్యం, ఎత్తు, బరువు, అలవాట్లు, జీవనశైలి... ఇవన్నీ చాలా ముఖ్యం. ఎందుకంటే బరువు ఎక్కువగా ఉన్నా, పొగ తాగే అలవాటున్నా, హార్మోన్స్‌ వాడటం ప్రమాదానికి దారి తీస్తుంది. అలాగే మీ ఆరోగ్య వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఎప్పిలెప్సీ, డీవీటీ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఈస్ట్రోజెన్‌ ఉండే మాత్రలు వాడకూడదు. ఈ మాత్రలే కాదు ఈ హార్మోన్‌ ఉండే గర్భనిరోధక సాధనాలూ వాడకూడదు. గర్భాశయం, అండాశయం, రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకుంటున్న వారు లేదా క్యాన్సర్‌ రోగులు హర్మోనల్‌ కాంట్రాసెప్షన్‌ వాడకూడదు. భార్యాభర్తల్లో ఎవరికైనా లైంగికపరంగా సంక్రమించిన వ్యాధులుంటే ఇతర పద్ధతులు ఏమి వాడినా కూడా తప్పనిసరిగా బారియర్‌ కాంట్రాసెప్టివ్‌, కండోమ్‌ వంటివి వాడాలి. గర్భాశయ, వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారిలో ఐయూసీడీ/ కాపర్‌ టీ వాడకం మంచిది కాదు. అందుకని ఇవన్నీ చూసి మీకు ఏది సరిగ్గా సురక్షితంగా పనిచేస్తుందో అది ఎంచుకోవాలి. స్పష్టంగా చెప్పాలంటే కొత్తగా పెళ్లయ్యి ఆరోగ్యంగా ఉన్న అమ్మాయిలకు ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ అన్నింటికంటే ఉత్తమం. గర్భనిరోధకానికి మాత్రమే కాకుండా దీంతో ఇతర లాభాలూ ఉంటాయి. రక్తస్రావం, నెలసరిలో కడుపు నొప్పి, మొటిమలు, అవాంఛిత రోమాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. రక్తహీనత తగ్గుతుంది. అండాశయాల్లో కణతులు, గర్భనాళాల్లో గర్భం రాకుండా నిరోధిస్తాయి. అవాంఛిత గర్భం, అబార్షన్‌ చేయించుకోవడం వల్ల వచ్చే సమస్యల కంటే గర్భనిరోధక సాధనాలు వాడటం వల్ల వచ్చే ఇబ్బందులు ఎన్నో రెట్లు తక్కువ. ఏదేమైనా మీ దంపతులు ఒక సారి వైద్యులను కూడా కలిసి మీ ఆరోగ్య వివరాలు వారితో పంచుకోండి. వారు మీకు తగిన మార్గాల్ని సూచిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని