పదోన్నతి గురించి అడగొచ్చు
ఏడాదిన్నరగా ఎంఎన్‌సీలో పనిచేస్తున్నా. నలుగురు మేనేజర్లు మారారు. అందరూ భవిష్యత్‌లో చాలా ముందుకు వెళతావని నన్ను ప్రశంసిస్తుంటారు కూడా. ప్రతి ఆగస్టులో ప్రతి మేనేజర్‌కీ బృందంలోని సభ్యులను ప్రమోషన్ కోసం నామినేట్ చేసే
ఏడాదిన్నరగా ఎంఎన్‌సీలో పనిచేస్తున్నా. నలుగురు మేనేజర్లు మారారు. అందరూ భవిష్యత్‌లో చాలా ముందుకు వెళతావని నన్ను ప్రశంసిస్తుంటారు కూడా. ప్రతి ఆగస్టులో ప్రతి మేనేజర్‌కీ బృందంలోని సభ్యులను ప్రమోషన్ కోసం నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అలా ఎంపికైన వారికి హెచ్‌ఆర్ ప్రక్రియ ఉంటుంది. నేను చేరినపుడు నాకున్న లక్ష్యాలు, బాధ్యతలే నా సీనియర్లకూ ఉన్నాయి. కాబట్టి పదోన్నతికీ, రివార్డులకీ అర్హురాలి నేనన్నది నా భావన. పనిలో చాలా కష్టపడతాను. ప్రమోషన్ కోసం నేనూ నామినేట్ అవ్వడానికి మేనేజర్‌ని సంప్రదించేదెలా? నాకున్న అవకాశాలేంటి?
- సృజన, వైజాగ్
తక్కువ సమయంలో ఎక్కువమంది అధికారులతో పనిచేశారు. మేనేజ్‌మెంట్‌లలో మార్పులు సహజమే. ప్రత్యేకించి పెద్ద సంస్థల్లో విలీనం, కొనుగోళ్లు ఉంటాయి కాబట్టి, సంస్థ పనితీరు, వ్యూహాల్లోనూ మార్పులు వస్తుంటాయి. కానీ మీ విషయంలో నాయకత్వ మార్పు మరీ వేగంగా ఉండటం కొంత ఇబ్బందే. అలాగని ఊరుకొని ఉండాల్సిన పనిలేదు. మీ పనితీరు, విజయాలకు తగిన గుర్తింపు పొందాల్సిందే. అయితే నామినేట్ కావడానికి మీవంతుగా కొంత పనిచేయాలి. ఇందుకు పోటీ ఎదురవొచ్చు కూడా.
మీ మేనేజర్‌తో వన్ టూ వన్ మీటింగ్ అవకాశముంటే.. నామినేట్ అవడం పట్ల మీ ఆసక్తిని తెలియజేయండి. లేకపోతే మాట్లాడటానికి సమయం అడగండి. ఎలాగైనా మాట్లాడటం మాత్రం మానద్దు. దీనికి సన్నద్ధమై వెళ్లడం మాత్రం తప్పనిసరి. మీ అర్హతలు, ఎలా మీరే తగిన వ్యక్తి, ఈ ప్రమోషన్ మీకే కాకుండా టీం, సంస్థ అభివృద్ధికీ ఎలా సాయమవుతుంది వంటి అంశాలకు సమాధానాలు సిద్ధం చేసుకుని మరీ వెళ్లండి. బుల్లెట్ పాయింట్లుగా రాసుకుని ఓకే అనుకున్నాక వివరంగా ఎలా మాట్లాడాలన్నది ప్లాన్ చేసుకోండి. అలాగే ప్రారంభ, ముగింపు వాక్యాలపైనా దృష్టిపెట్టండి. మొదటి పలకరింపు నుంచి చివరి ధన్యవాదాల వరకు అన్నింటినీ సమీక్షించుకోండి. ఎక్కడా అసంతృప్తి కానీ, ఇతర మేనేజర్లకు వ్యతిరేకమైన మాటలు కానీ ఉండకూడదు. నిజానికి అనుభవం దృష్ట్యా తక్కువే కానీ.. బాధ్యతలు సమానంగా నిర్వర్తిస్తున్నప్పుడు మొహమాటం, భయం లాంటివి అవసరమే లేదు. ఇక్కడ మీ ఆత్మవిశ్వాసాన్ని మీ బాస్ ముందుంచుతున్నారు. అంతే! దాన్ని మరింత బలంగా చూపించడానికే ఈ ముందస్తు సన్నద్ధత.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.