అందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే సూపర్ ఫుడ్స్!

వయసు పెరగడం అనివార్యమని మనందరికీ తెలుసు. కానీ ఎప్పటికప్పుడు ఆ వయసు తెచ్చే మార్పులు కొత్తగానే అనిపిస్తాయి. టీనేజీలోకి అడుగు పెట్టగానే మొటిమలు, కాలేజీ చదువు నుంచి ఉద్యోగాలకు వెళ్లడం మొదలైనప్పటి నుంచి....

Published : 05 Jul 2023 18:23 IST

వయసు పెరగడం అనివార్యమని మనందరికీ తెలుసు. కానీ ఎప్పటికప్పుడు ఆ వయసు తెచ్చే మార్పులు కొత్తగానే అనిపిస్తాయి. టీనేజీలోకి అడుగు పెట్టగానే మొటిమలు, కాలేజీ చదువు నుంచి ఉద్యోగాలకు వెళ్లడం మొదలైనప్పటి నుంచి జుట్టు రాలటం.. ముప్ఫైలు దాటాక చర్మంలో మార్పులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం.! వయసు పెరిగే కొద్దీ అనేక అనుభవాలతో మానసికంగా బలపడతాం.. కానీ శరీరంలో శక్తి మాత్రం క్రమంగా క్షీణిస్తుంది. మునుపటి శక్తి, ఆరోగ్యం, సౌందర్యం వయసుతో పాటు మారుతూ ఉంటాయి. కానీ కొందరిని చూస్తే మాత్రం 'వీరికి వయసు పెరగదా..?' అనిపిస్తుంది. పదేళ్ల కిందట ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. అలా ఉండటానికి వారి జీవనశైలి, ఆహారపుటలవాట్లు ముఖ్యమైన కారణం. నిత్యం మనం తినే ఆహారంలో కొన్ని పదార్థాలు వార్ధక్యాన్ని నివారించే గుణాలు కలిగి ఉంటాయి. రోజువారీ ఆహారంలో వాటిని తినడం వల్ల వయసు మీద పడినా అందం, ఆరోగ్యం చెక్కు చెదరవు. మరి అలాంటి కొన్ని సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా..?

గింజలు

ఇవి శరీరాన్ని తేలిగ్గా ఉంచుతూనే ఎంతో శక్తినిస్తాయి. వేరుశనగ, బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్, వంటి గింజలు ఇ- విటమిన్, ఖనిజాలు, క్యాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం లాంటి ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి తక్కువ కొవ్వులతో ఎక్కువ శక్తినివ్వడమే కాకుండా చర్మాన్ని, జుట్టునీ ఆరోగ్యంగా ఉంచుతాయి.

నువ్వులు

పండగలకూ, నోములకూ మన ఇళ్లలో చేసే నువ్వుల లడ్డూని కొంతమంది చాలా తక్కువగా అంచనా వేస్తారు. నువ్వుల్లో ఉండే బి6 విటమిన్, సెలీనియం, కాపర్‌లు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. రక్త ప్రసరణను అదుపులో ఉంచుతాయి. అంతే కాకుండా దీనివల్ల శరీరానికి కావల్సిన రోజువారీ ఐరన్ లభిస్తుంది.

పాలు

మామూలుగా మనం తాగే ఆవు/గేదె పాలే కాకుండా సోయా, బాదం, జీడిపప్పు వంటి వాటితో తయారు చేసిన పాలు తరచూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ప్రొటీన్లతో పాటు క్యాల్షియం, విటమిన్-డి వంటి పోషకాలు వయసు పెరిగినా ఎముకల దృఢత్వాన్ని కాపాడతాయి.

పుల్లటి పండ్లు

పైనాపిల్, ఆరెంజ్, బత్తాయి వంటి పుల్లని పండ్లలో ఉండే సి- విటమిన్, ఫోలేట్, థయమిన్ వంటి పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. చర్మానికి యవ్వన కాంతినిస్తాయి.

డార్క్ చాక్లెట్

పాలు, చక్కెరలు కలపని డార్క్ చాక్లెట్ మానసిక ఉత్తేజాన్నిస్తుంది. శరీరాన్ని ఉత్సాహంగా ఉంచే అడ్రినలిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎ-విటమిన్ తో పాటు అనేక ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. అయితే చక్కెర అధికంగా ఉండే చాక్లెట్లను తినకూడదు.

దానిమ్మ

మగవారితో పోలిస్తే ఆడవారిలో రక్తహీనత సమస్య ఎక్కువ. ఈ సమస్యకు దానిమ్మ అద్భుతమైన పరిష్కారం. ఇది గుండె జబ్బులను నివారించడంలోనూ సమర్థంగా పనిచేస్తుంది. తరచూ దానిమ్మ గింజలను తిన్నా.. దానిమ్మ జ్యూస్ తాగినా చర్మం మెరుపు సంతరించుకుంటుంది.

గోరు చిక్కుళ్లు

శరీరంలో జరిగే జీవక్రియలకు మెగ్నీషియం కూడా ఎంతో అవసరం. ఆ అవసరాన్ని ఒక వందగ్రాముల గోరు చిక్కుళ్లు తీరుస్తాయి. అవును.. ఏ వయసులో అయినా శరీరం శక్తివంతంగా, చురుగ్గా ఉండాలంటే గోరుచిక్కుళ్ల వాడకం తప్పనిసరి. ఇందులో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. ఐరన్, పొటాషియం, ఫోలేట్ మొదలైన పోషకాలు కండరాల పటుత్వం తగ్గకుండా కాపాడతాయి.

పుట్టగొడుగులు

శరీరంలోని అధిక కొవ్వులను తొలగించడానికి, థైరాయిడ్ హార్మోన్ సమతౌల్యం దెబ్బతినడం వల్ల కలిగే సమస్యలను అధిగమించడానికి పుట్టగొడుగులు ఉపయోగపడతాయి. పుట్టగొడుగులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రొటీన్ లోపాలను అరికట్టవచ్చు. శరీరానికి కావల్సిన బి, డి విటమిన్లు పుట్టగొడుగులలో పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్ల కోసం కొవ్వు పదార్థాలను, మాంసాహారాన్నీ ఆహారంగా తీసుకోవడం ఇష్టపడని వారు పుట్టగొడుగులను వాడొచ్చు.

కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వును తక్కువ మోతాదులో వాడాలి. ఇందులో ఉండే మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వయసు ప్రభావాన్ని ఇమ్యూనిటీపై పడనివ్వకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇవే కాకుండా నీటి శాతం అధికంగా ఉండే కీరా, పుచ్చకాయ వంటివి; కొత్తిమీర, పుదీనా, పాలకూర వంటి ఆకుకూరలు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన అవిశ గింజలు తరచూ ఆహారంలో చేర్చడం వల్ల ఏ వయసులో అయినా అందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాగే జంక్ ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత దగ్గరవుతారు. అంతేకాదు ఆనందంగా ఉంటే ఆరోగ్యమే కాదు.. అందమూ పెరుగుతుంది!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్