Super Apps: ఏంటీ సూపర్ యాప్స్..? వీటితో కస్టమర్లకు ఎంతమేర ఉపయోగం!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేవలను అందించే సూపర్ యాప్‌లు లేవు. ఇప్పటి వరకు సూపర్ యాప్‌ల సేవలు ఆయా దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. భవిష్యత్తులో ఎక్స్ వంటి యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను విస్తరించే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ (Twitter)ను సూపర్ యాప్ (Super App)గా మార్చాలనే ఉద్దేశంతోనే ఎక్స్(X)గా పేరు మార్చినట్లు ఎలాన్ మస్క్ (Elon Musk) ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సూపర్ యాప్ అంశం చర్చనీయాంశమైంది. ఇంతకీ సూపర్ యాప్ అంటే ఏంటి? మొదటగా దీన్ని ఎవరు ప్రారంభించారు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సూపర్ యాప్‌లు ఉన్నాయి? ఎక్స్ (ట్విటర్)తోపాటు ఇంకా ఏయే కంపెనీలు సూపర్ యాప్‌లను తీసురానున్నాయి? ఈ సూపర్ యాప్‌లతో యూజర్లకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చూద్దాం.
సూపర్ యాప్ అంటే?
తొలిసారిగా 2010 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో బ్లాక్‌బెర్రీ(BlackBerry) వ్వవస్థాపకుడు మైక్ లజారిడిస్ (Mike Lazaridis) సూపర్ యాప్ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. వివిధ రకాల సర్వీస్‌ల కలయికగా ఈ యాప్ ఉండాలని మైక్ అప్పట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మొబైల్ యూజర్లు ప్రతి అవసరానికి ప్రత్యేకంగా ఒక యాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాటికి భిన్నంగా.. సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, బ్యాకింగ్, నగదు వ్యాలెట్‌లు, క్యాబ్ బుకింగ్, టికెట్ బుకింగ్ వంటి సేవలను ఒకే యాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేదే.. సూపర్ యాప్.
ప్రస్తుతం చైనాలో వీచాట్ (WeChat), సింగపూర్‌లో గ్రాబ్ (Grab), ఇండోనేషియాలో గోజెక్ (Gojek), జపాన్‌లో లైన్ (LINE), దక్షిణ కొరియాలో కకావోటాక్ (KakaoTalk)లు సూపర్ యాప్‌లుగా యూజర్లకు సర్వీస్‌లను అందిస్తున్నాయి. ప్రతి సర్వీస్ కోసం ప్రత్యేకంగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడం, ఒకే చోట అన్ని రకాల సేవలు లభిస్తుండటంతో సూపర్ యాప్‌లకు ఆయా దేశాల్లో ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో రాబోయే సూపర్ యాప్‌లలో విద్య, వైద్యం, వ్యాపార రంగాలకు సంబంధించిన సేవలు సైతం అందుబాటులోకి వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొబైల్ మార్కెటింగ్‌పై ప్రభావమెంత?
యూజర్‌కు ఏం కావాలో తెలుసుకోవచ్చు: భవిష్యత్తు అంతా డేటాదే. యూజర్లను కస్టమర్లుగా మార్చుకోవడంలో ప్రతి సంస్థకు డేటా ఎంతో ముఖ్యం. యూజర్ల గురించి ఎవరి వద్ద ఎక్కువ సమాచారం ఉంటుందో.. మార్కెట్‌లో ఆ కంపెనీ హవానే సాగుతుంది. ఇదే ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ వ్యాపార సూత్రం. సూపర్ యాప్‌ల ద్వారా కంపెనీలకు యూజర్ల గురించి ఎక్కువ సమాచారం లభిస్తుంది. అంటే, యూజర్ల ఇష్టాయిష్టాలతోపాటు, ఏ సేవల కోసం యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారో తెలుస్తుంది. దీంతో, ఆయా సేవలను మెరుగుపరచడంతోపాటు, యూజర్‌ను ఆకర్షించేందుకు ప్రకటనలు యాప్‌లో చూపించే అవకాశం ఉంటుంది.
భాగస్వామ్యం/ ప్రమోషన్: సూపర్ యాప్‌ల ద్వారా కంపెనీలు స్థానికంగా ఉండే వ్యాపారులతో భాగస్వామ్యం నెలకొల్పవచ్చు. దీని వల్ల ఆయా సంస్థల మార్కెటింగ్ పరిధి విస్తరించడంతోపాటు.. బ్రాండ్ విలువ పెరిగి, చిరు వ్యాపారులకు సైతం లాభం చేకూరుతుంది. అంతేకాకుండా, యూజర్‌కు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అవుతుంది. వ్యాపార విస్తరణలో తమ సర్వీస్‌లను మొబైల్ యాప్‌లోకి తీసుకురావాలనుకుంటున్న చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు సూపర్ యాప్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. దీనివల్ల అప్పటికే.. మార్కెట్‌లో ఉన్న యాప్‌లతో పోటీ లేకుండా వ్యాపార విస్తరణ కోసం అధిక మొత్తం పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం ఉండదు.
ఈ యాప్‌ల ద్వారా కస్టమర్లకు ఓ వైపు సర్వీస్‌లను అందిస్తూనే.. మరోవైపు కంపెనీలో ఇతర సర్వీస్‌లను ప్రమోట్ చేయొచ్చు. అంటే, సూపర్ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసిన యూజర్‌కు, అదే యాప్ ద్వారా క్యాబ్ సర్వీస్‌ను బుక్ చేసుకోమని సూచించవచ్చు. అలా చేయడం వల్ల .. కొంత రాయితీ లభిస్తుందని సర్వీస్‌ను ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో యాప్ ఆదాయం పెరగడమే కాకుండా..ఒకే చోట వేర్వేరు సర్వీస్‌లు అందిస్తున్నామని యూజర్‌కు తెలియజేవచ్చు.
భవిష్యత్తు సూపర్ యాప్‌లదే
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేవలను అందించే సూపర్ యాప్‌లు లేవు. ఇప్పటి వరకు సూపర్ యాప్‌ల సేవలు ఆయా దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. భవిష్యత్తులో ఎక్స్ (ట్విటర్) వంటి యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను విస్తరించే అవకాశం ఉంది. ఎక్స్‌తోపాటు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఓ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ యాప్ ద్వారా షాపింగ్, మెసేజింగ్, వెబ్ సెర్చ్, న్యూస్ ఫీడ్, ఈ-కామర్స్.. ఇలా అన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలని యోచిస్తోందట.
భారత్‌లో రిలయన్స్ జియో, టాటా న్యూ వంటి యాప్‌లు సూపర్ యాప్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అదానీ గ్రూప్ సైతం ఒక సూపర్ యాప్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థికపరమైన సేవలను అందిస్తున్న పేమెంట్ యాప్‌లు వివిధ రకాల సేవలను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి కూడా సూపర్ యాప్‌లుగా మారే అవకాశం ఉంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సూపర్ యాప్‌ల మార్కెట్ పరిధి 426 బిలియన్ల డాలర్లకు చేరుతుందని విశ్లేషకులు అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్