మనమెందుకు నీరసించిపోతున్నాం?!

‘మా రోజుల్లో ఇన్ని అనారోగ్యాలు లేవమ్మా’ అంటూ మన అమ్మమ్మలూ నాన్నమ్మలూ నిట్టూర్చడం తెలిసిందే. వాళ్లు జబ్బుల బారిన పడకపోవడమే కాదు, కట్టెల పొయ్యి మీద వండటం, పిండి రోట్లో రుబ్బడం లాంటి కష్టమైన పనులను కూడా అలసట, ఆందోళన లేకుండా చేసేవారు.

Published : 18 Apr 2022 00:47 IST

‘మా రోజుల్లో ఇన్ని అనారోగ్యాలు లేవమ్మా’ అంటూ మన అమ్మమ్మలూ నాన్నమ్మలూ నిట్టూర్చడం తెలిసిందే. వాళ్లు జబ్బుల బారిన పడకపోవడమే కాదు, కట్టెల పొయ్యి మీద వండటం, పిండి రోట్లో రుబ్బడం లాంటి కష్టమైన పనులను కూడా అలసట, ఆందోళన లేకుండా చేసేవారు. మరి గ్యాస్టవ్వులూ గ్రైండర్లూ లాంటి సౌలభ్యాలెన్నో ఉన్నా మనమెందుకు నీరసించిపోతున్నాం? ఒక్కసారి సమీక్షించుకుందామా!

* తినే ఆహారం మీదే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనలో చాలామందికి కారం కారంగా (స్పైసీ ఫుడ్‌) ఉంటే మహా ఇష్టం. షడ్రుచులూ తినాల్సిందే! కానీ పులుపు, ఉప్పు, కారం, తీపి- ఈ నాలుగూ అతిగా లేకుండా చూసుకోవాలి. లేదంటే అల్సర్లు, బీపీల్లాంటి నానా రోగాలూ దాడి చేస్తాయి.
* నూనె వల్ల కూరకి రుచి వచ్చే మాట నిజమే. కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక నూనె వీలైనంత తగ్గిద్దాం. అల్లం, మిరియాలు, జీలకర్ర లాంటి ఆరోగ్యకరమైన దినుసులను చేర్చి మరింత రుచికరంగా వండుకుందాం.
* పోషకాహారం తీసుకోవడం ఒక్కటే కాదు, అది వేళకు తినడం కూడా చాలా ముఖ్యం. శరీరంలో సమయానుసారం ఎంజైములు ఉత్పత్తి అవుతాయి. అందుకు తగ్గట్టుగా ఆహారం అందాలి. తినడానికి ఉన్నట్టే అరుగుదలకూ ఓ పద్ధతి ఉంటుంది. మనం వేళలు అతిక్రమించి అర్ధరాత్రి వరకూ మెలకువగా ఉంటే అవయవాల పనితీరు దెబ్బతిని అరగకపోవడం, పొట్ట రావడం, గ్యాస్ట్రిక్‌ సమస్య లాంటి సమస్యలు ఇబ్బందిపెడతాయి.
* ఆహారం, నిద్ర తర్వాత వ్యాయామం చాలా అవసరం. రోజువారీ పనులు చేసుకుంటున్నాం కదా.. అదే వర్కవుట్లని సరిపెట్టుకుంటే శరీరం కూడా అత్తెసరుగా చేస్తున్నాను కదా అని మొరాయిస్తుంది. కనుక వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. దాని వల్ల శారీరకంగానే కాదు మానసికంగానూ ఉల్లాసం కలుగుతుంది.
* చివరగా మరో ముఖ్యమైన సంగతి.. బయట దొరికే జంక్‌ ఫుడ్‌లోనే కాదు, పండ్లు, ధాన్యాలూ.. అన్నీ రసాయనాలతో పెరిగినవే. వాటికి బదులుగా సేంద్రియ (ఆర్గానిక్‌) ఉత్పత్తులు కొనాలంటే ఆర్థిక భారమే. మరి పరిష్కారం ఏమిటంటే... వరి, గోధుమల్లాంటివి పండించలేకపోయినా కూరగాయల వరకూ ఇళ్లలోనే పెంచుకోగలిగితే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టూ అవుతుంది, సంతృప్తీ, సంతోషమూ సొంతమవుతాయి.
ఇవేమంత ఆచరించలేని, అనుసరించలేని విషయాలు కాదు కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్