ఆస్తి కోసం.. అమ్మనే వేధిస్తోంది!

సాధారణంగా జాయింట్‌ విల్‌ (ఉమ్మడి వీలునామా) అనేది ఇద్దరూ కలిసి ఉమ్మడి లేదా విడివిడిగా ఉన్న ఆస్తుల గురించి రాసుకుంటారు. ఉమ్మడి ఆస్తుల గురించి రాసినప్పుడు అందులో ఒకరు చనిపోయినప్పుడు అవి రెండోవారికి సంపూర్ణ హక్కులతో చెందుతాయి.

Updated : 26 Apr 2022 14:22 IST

నాకు 68 ఏళ్లు. కొడుకు, కూతురు ఉన్నారు. మావారు కిందటేడాది పోయారు. కూతురి పిల్లలిద్దరినీ మేమే చదివించాం. ఆమె ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. మనవడి వ్యాపార నష్టాల్నీ మేమే భరించాం. మరణానంతరం మా ఆస్తులు సంతానానికి చెందేలా జాయింట్‌ వీలునామా రాశాం. మావారు పోయాక.. అమ్మాయిని తన వాటా తీసుకోమన్నా. వాటిని నా డబ్బుతో రిజిస్ట్రేషన్‌ చేసిమ్మని, నా వాటా కూడా తనకిచ్చేయమని గొడవ. నాకది ఇష్టం లేదు. దాంతో మా అమ్మాయి, అల్లుడు, మనవడు నన్ను ఇబ్బందిపెడుతున్నారు. నాకు అండగా ఉన్న నా కొడుకునీ భయపెడుతున్నారు. వారిపై పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైట్‌ చేయాలా? లేదా కోర్టుకు వెళ్లాలా?

- ఓ సోదరి

సాధారణంగా జాయింట్‌ విల్‌ (ఉమ్మడి వీలునామా) అనేది ఇద్దరూ కలిసి ఉమ్మడి లేదా విడివిడిగా ఉన్న ఆస్తుల గురించి రాసుకుంటారు. ఉమ్మడి ఆస్తుల గురించి రాసినప్పుడు అందులో ఒకరు చనిపోయినప్పుడు అవి రెండోవారికి సంపూర్ణ హక్కులతో చెందుతాయి. కానీ, ఇద్దరూ వారి ఆస్తులకు సంబంధించి రెండు వీలునామాలు రాసినప్పుడు అంటే వారి తర్వాత రెండోవారికీ ఆ తర్వాత పిల్లలకు చెందాలని రాస్తే దాన్ని మ్యూచువల్‌ విల్‌ అని సంబోధిస్తారు. జాయింట్‌ విల్‌ ద్వారా వచ్చిన ఆస్తి ఒకరు చనిపోయిన తర్వాత రెండోవారికి అంటే భార్య/ భర్తకు, రెండోవారు కూడా చనిపోతే ఆ తర్వాత సంతానానికి చెందుతుంది. జాయింట్‌ విల్‌ రాసిన ఇద్దరిలో ఒకరు చనిపోయాక రెండోవారు దాన్ని మార్చడానికి వీల్లేదు. ఒకవేళ విల్‌లో ఒకరు చనిపోయిన తర్వాత రెండోవారు మార్చుకోవడానికి వీలుగా కండిషన్‌ (నిబంధన) రాసుకుంటే మార్చుకోవచ్చు. దాన్ని రెవొకేషన్‌ అంటారు. అలా లేకుండా ఉంటే రెండోవారు దాన్ని మార్చడానికి/ ఆస్తులు అమ్ముకోవడానికి/ అన్యాక్రాంతం చేయడానికి గానీ ఏ హక్కూ లేదు. మ్యూచువల్‌ విల్‌లో కొన్ని సర్దుబాట్లు ఉన్నాయి. మీరు మీ భర్త రాసిన జాయింట్‌ విల్‌లో కండిషన్స్‌ ఎలా ఉన్నాయో న్యాయవాది సలహా తీసుకోండి. మీ అమ్మాయికి, మనవడికి ఆస్తి ఇప్పుడే కావాలని అడిగే హక్కు లేదు. అలా వేధిస్తున్నందుకు మీరు వాళ్ల మీద సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ 2007 ద్వారా ఏర్పడిన ట్రైబ్యునల్‌లో లేదా దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. గృహహింస చట్టం ద్వారా కూడా ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. పోలీస్‌ స్టేషన్‌లో/ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ దగ్గర మీ అమ్మాయిని, తన బంధువులని పిలిచి కౌన్సెలింగ్‌ ద్వారా వాళ్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించండి. లేదంటే కేసు కోర్టుకి పంపుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని