ఆ సంస్థల్లో మన ప్రాతినిధ్యం పెరుగుతోంది!

భారత్‌లోని అత్యుత్తమ-100 సంస్థల్లో మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యం, వారి ప్రాధాన్యం పెరుగుతోందని ఓ తాజా అధ్యయనం చెబుతోంది.

Published : 21 Oct 2022 00:18 IST

సర్వే

భారత్‌లోని అత్యుత్తమ-100 సంస్థల్లో మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యం, వారి ప్రాధాన్యం పెరుగుతోందని ఓ తాజా అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా పదోన్నతుల్లో ఈ ఏడాది మహిళలు పురుషుల్ని అధిగమించారు. టాప్‌-100 కంపెనీల్లో పరిశీలిస్తే 2021లో మహిళల్లో 6.1 శాతం పదోన్నతులు పొందగా.. ఈ ఏడాది అది 9.64 శాతం. పురుషుల (9.21శాతం) కంటే ఇది స్వల్పంగా ఎక్కువ. అత్యుత్తమ 10 సంస్థల్లో 2022లో మహిళల పదోన్నతుల శాతం 10.5 కావడం గమనార్హం. గతేడాది ఇది 4.36 శాతం మాత్రమే. టాప్‌-100 కంపెనీలన్నీ భిన్నత్వం, సమానత్వం, భిన్నవర్గాల ప్రాతినిధ్యంపైన దృష్టి పెట్టాయి. అందుకోసం మహిళలకు ప్రత్యేకంగా మెంటారింగ్‌, కెరియర్‌ స్పాన్సర్‌షిప్‌ లాంటి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం 2021లో ఈ కంపెనీల్లో మహిళా ఉద్యోగుల శాతం 34.5 కాగా, ఈ ఏడాది స్వల్పంగా పెరిగి 34.8 శాతానికి చేరింది. 2016లో ఇది కేవలం 25 శాతమే. అత్యుత్తమ పది సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం 40 శాతానికి పైనే. మహిళల జీతాల్లోనూ పెరుగుదల ఉన్నట్టు చెబుతోందీ సర్వే. వీరి 2016 సర్వే ప్రకారం టాప్‌-100 కంపెనీల్లో అత్యధికంగా వేతనాలు అందుకుంటున్న 20 శాతం ఉద్యోగుల్లో పురుషుల శాతం 86గా ఉండగా, మహిళలు 14 శాతమే. 2022 సర్వేలో మహిళల శాతం 20కి దగ్గరగా ఉంది. వీటిలో 86 కంపెనీలు సమాన వేతనం దిశగా అడుగులేస్తుండటం పరిశ్రమల్లో వస్తోన్న మార్పులకు నిదర్శనం. ‘అవ్‌తార్‌ అండ్‌ సెరామౌంట్‌ బెస్ట్‌ కంపెనీస్‌ ఫర్‌ విమెన్‌ ఇన్‌ ఇండియా-2022’ పేరిట ఈ అధ్యయనాన్ని జరిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని