మీరు వింటున్నది... స్కూల్‌ రేడియో

ఆ పిల్లలు కథలు చెబుతారు, కవితలు వినిపిస్తారు, పాటలు పాడేస్తారు. అడ్డతీగల గురుకుల పాఠశాల, తోటపల్లి హీల్‌ స్కూల్‌.. ఇలా కొన్ని వందల స్కూళ్లలో పిల్లల సంగతిది. వారంతా ఒకప్పుడు గొంతు విప్పడానికి బిడయపడిన వాళ్లంటే నమ్మగలరా! ఈ మార్పు వెనకున్నది ‘స్కూల్‌ రేడియో’, దాని వ్యవస్థాపకురాలు గాలి అరుణ. ఆ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...

Updated : 06 Aug 2022 08:03 IST

ఆ పిల్లలు కథలు చెబుతారు, కవితలు వినిపిస్తారు, పాటలు పాడేస్తారు. అడ్డతీగల గురుకుల పాఠశాల, తోటపల్లి హీల్‌ స్కూల్‌.. ఇలా కొన్ని వందల స్కూళ్లలో పిల్లల సంగతిది. వారంతా ఒకప్పుడు గొంతు విప్పడానికి బిడయపడిన వాళ్లంటే నమ్మగలరా! ఈ మార్పు వెనకున్నది ‘స్కూల్‌ రేడియో’, దాని వ్యవస్థాపకురాలు గాలి అరుణ. ఆ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...

యువతలో నైపుణ్యాల కొరత... గురించి విన్న ప్రతిసారీ దీన్ని పరిష్కరించాలని ఉండేది. అందుకు కారణం నా వృత్తి నేపథ్యమే కావొచ్చు. మాది చీరాల. నాన్న ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌,   శ్రీశైలంలో కొన్నాళ్లున్నాం. తర్వాత వైజాగ్‌లో స్థిరపడ్డాం. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎం.ఎ.ఇంగ్లిష్‌ చేశాక హైదరాబాద్‌లో జర్నలిస్టుగా చేశా. ఆపైన కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో భాగమై పర్యావరణ పరిరక్షణ, పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అవగాహన, ఉపాధి కల్పన విభాగాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేశా. సామాజిక మార్పు దిశగా ఇంకా ఏదైనా చేయాలనుకున్నా. అప్పుడే నైపుణ్యాల కొరత నన్ను ఆలోచింపజేసింది. విద్యార్థి దశ నుంచే ప్రయత్నిస్తే మార్పు సాధ్యమని కొన్ని పుస్తకాల్ని స్కూళ్లలో ఇచ్చి పిల్లలచేత చదివించమన్నా. కానీ అవి అరలకే పరిమితమయ్యేవి. అప్పుడే వాళ్లు ఉత్సాహంగా నేర్చుకునేందుకు రేడియో లాంటి వేదిక ఉండాలనిపించి.. ‘స్కూల్‌ రేడియో’ని 2015లో ప్రారంభించా. మావారు ఉదయ్‌కుమార్‌ దీనికి సహ వ్యవస్థాపకులు. దీని ద్వారా పిల్లల్లో ఊహా శక్తి, విషయ విశ్లేషణ, సృజనాత్మకత, భావవ్యక్తీకరణ.. మొదలైన నైపుణ్యాల్ని నేర్పాలనుకున్నాం. పది ప్రభుత్వ స్కూళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. విద్యార్థుల్లో వచ్చిన మార్పు చూసి ఉత్సాహంగా   ముందడుగు వేశాం.

ఆడియో ఆన్‌లైన్లో...

ఈ కార్యక్రమాల్ని పాఠశాల, కాలేజీల్లో నిర్వహిస్తుంటాం. ఒక రోజునుంచి వారం వరకూ విద్యార్థులకు రేడియో నైపుణ్యాలపైన శిక్షణ ఉంటుంది. కథలు రాయడం, చెప్పడం, సామాజిక సమస్యల గుర్తింపు, పరిష్కారాలపైన అవగాహన కలిగిస్తాం. బృందాలుగా ఏర్పడి వీళ్లు సమస్య గురించి చదువుతారు, వివిధ మార్గాల్లో సమాచారం సేకరించి, చర్చించి ఆ విషయాల్ని క్లుప్తంగా రేడియోలో చెబుతారు. వారికి ఉపాధ్యాయులూ సాయపడతారు. అవసరమైతే నిపుణులతో మాట్లాడిస్తాం. దీంతో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు మెరుగవుతాయి. కొందరైతే కవితలు, పాటల ద్వారా తమలోని సృజనాత్మకతనీ బయటపెడుతున్నారు. స్కూల్‌ పేరుతోనే క్లబ్‌ని ఏర్పాటుచేస్తాం. రికార్డు చేసిన ఆడియోని ‘స్కూల్‌ రేడియో.ఇన్‌’లో ఉంచుతాం. అక్కడ ఎవరైనా వినొచ్చు. ఒక్కో స్కూల్లో ఇలా నెల నుంచి ఏడాదిపాటు కార్యక్రమాలు చేపడతాం. విద్యా సంస్థలు కొంత మొత్తం చెల్లించి ఈ సేవలు పొందొచ్చు. ఎవరైనా నిధులు అందిస్తే వాళ్లు కోరిన స్కూళ్లలో ఈ శిక్షణ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని సాంఘిక, గిరిజన పాఠశాలలు, ఎన్టీఆర్‌ జిల్లాలోని హీల్‌ స్కూల్‌, కొవ్వూరులోని సంస్కృతోన్నత పాఠశాల, తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో కొన్ని పాఠశాలలూ.. ఉన్నాయి. దివీస్‌, ఎయిర్‌టెల్‌ భారతీ ఫౌండేషన్‌ల నిధులతో కొన్ని పాఠశాలల్లో పనిచేశాం. కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్లో సేవలు అందించాం.

ఐఐఎమ్‌ మెచ్చింది..

మా దారి సరైనదేనా అన్న సందేహాం ఏమూలనో ఉండేది. కానీ గతేడాది ఐఐఎమ్‌-విశాఖపట్నం ఇంక్యుబేషన్‌ సెంటర్‌కి స్కూల్‌ రేడియో ఎంపికైంది. ‘మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కమ్యునికేషన్‌’ విభాగంలో స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేస్తామని 2020లో ఐఐఎమ్‌ బెంగళూరు పిలుపునిస్తే వెళ్లా. వందల సంస్థల్లోంచి ‘స్కూల్‌ రేడియో’ టాప్‌-40లో నిలవడమే కాదు, ఉత్తమ మహిళా స్టార్టప్‌గానూ ఎంపికైంది. మా ఆలోచనని మెచ్చుకోవడమే కాదు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విస్తరణకు అవకాశం ఉందనీ, మార్కెటింగ్‌ మీద దృష్టిపెట్టమనీ చెప్పారు. అయిదు పదుల వయసులో ఐఐఎమ్‌లో నేర్చుకునే అవకాశం దొరికినందుకు చాలా సంతోషం కలిగింది. దీంతో నెట్‌వర్క్‌ పెరిగి ఈ రంగంలో ఎవరేం చేస్తున్నారో తెలిసింది.

ఇప్పటివరకూ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో 300 పాఠశాలలకు చెందిన అయిదువేల మంది విద్యార్థులతో పనిచేశాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లలో నేరుగా పాఠశాలలకు వెళ్లి పనిచేశాం. 100 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నేర్పించాం. పిల్లలు చెప్పిన కథల్ని డిజిటల్‌, అచ్చు పుస్తకాలుగానూ తీసుకొస్తున్నాం. మా అబ్బాయి యానిమేషన్‌ నిపుణుడు. సింగపూర్‌లో ఉంటాడు. తనూ సాయపడతాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల్లో భాషా నైపుణ్యాలు మెరుగయ్యాయనీ, చదువుల్లో చురుగ్గా ఉంటున్నారనీ, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారనీ ఉపాధ్యాయులు చెబుతుంటే సంతోషంగా ఉంటోంది. అంతకుమించి భావి పౌరుల్ని తీర్చిదిద్దుతున్నామన్న సంతృప్తీ కలుగుతోంది.  

- సురేశ్‌ రావివలస, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్