కళ కోసం.. పాఠశాల ప్రారంభించింది!

శిల్పులు అనగానే మగవాళ్లే గుర్తొస్తారు కదా! కోల్‌కతా కుమర్‌తులికి వెళ్లండి.. మాలా పేరూ ప్రముఖంగా చెబుతారు. దశాబ్దాల క్రితమే శిల్పిగా గుర్తింపు పొందిన ఆమె సేవలు దేశీ మ్యూజియాలు దాటి

Published : 26 Sep 2022 00:23 IST

శిల్పులు అనగానే మగవాళ్లే గుర్తొస్తారు కదా! కోల్‌కతా కుమర్‌తులికి వెళ్లండి.. మాలా పేరూ ప్రముఖంగా చెబుతారు. దశాబ్దాల క్రితమే శిల్పిగా గుర్తింపు పొందిన ఆమె సేవలు దేశీ మ్యూజియాలు దాటి విదేశాలకూ విస్తరించాయి. అంతేనా.. అంతరించిపోతున్న కళకు ప్రాణం పోయడానికి పాఠశాలనీ ప్రారంభించింది. అరుదైన రంగంలోకి అడుగుపెట్టి, ఈ స్థాయికి ఆమె ఎలా చేరుకుంది?

మాలా పల్‌ నాన్నకి విగ్రహ తయారీ దుకాణం ఉండేది. ఆయన్ని చూసి ఆమె దీనిపై ఆసక్తి పెంచుకుంది. కానీ వాళ్లనాన్న ఆ కర్మాగారంలోకి తనను అడుగూ పెట్టనిచ్చేవాడు కాదు. ‘అమ్మాయిలు భర్త, పిల్లలను చూసుకోవాలి.. ఇలాంటి పనులు వాళ్లకి తగవు’ అనేది ఆయన అభిప్రాయం. మాలాకేమో చేయాలన్న ఆసక్తి. ఆయన చూడకుండా మట్టితో బొమ్మలు చేసేది. అది చూసిన తన అన్న నేర్పించడం మొదలుపెట్టాడు. వీళ్లది కోల్‌కతా. అనారోగ్య కారణాలతో వీళ్ల నాన్న చనిపోయాడు. అప్పటికి ఆమెకు 13 ఏళ్లే! కుటుంబంతోపాటు విగ్రహ తయారీ బాధ్యతా వాళ్లన్నయ్య మీద పడింది. తనకు సాయంగా ఉంటుందని మాలాకీ పూర్తిస్థాయిలో నేర్పించడం మొదలుపెట్టాడు. ఓసారి అతను ఏదో పనిమీద బయటికి వెళ్లి వాతావరణం బాగాలేక తిరిగి రాలేకపోయాడు. ఒక విగ్రహం చేసివ్వాలి.. ఆ బాధ్యత మాలా తీసుకొని పూర్తిచేసివ్వడమే కాదు.. ప్రశంసలూ అందుకుంది. పోటీల్లో పాల్గొని జిల్లా, రాష్ట్ర స్థాయి బహుమతులతోపాటు దిల్లీలోని క్రాఫ్ట్స్‌ మ్యూజియంతో పనిచేసే అవకాశాన్నీ దక్కించుకుంది. అలా ‘శిల్పి’గా గుర్తింపు దక్కింది. దీంతోపాటే ఆర్డర్లు పెరిగాయి. అయితే పెళ్లయ్యాక అత్తింటివాళ్లు ఇవన్నీ వదిలేసి ఇంటి బాధ్యతలు చూసుకోమని ఒత్తిడి చేసేవాళ్లు. కానీ భర్త ఆమెకు అండగా నిలిచారు. ఈమె విగ్రహాలు యూరప్‌, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి.

ఏళ్లు గడిచేకొద్దీ దీనిపై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య తగ్గడం మాల గమనించింది. కొన్నేళ్లకు ఈ కళే అంతరించి పోతుందన్న భయం వేసిందామెకు. దీంతో ‘పాఠశాల’ను ప్రారంభించింది. ‘నా విద్యార్థుల్లో ఏడేళ్ల వయసు వాళ్లూ ఉన్నారు. కళలపై ఆసక్తి ఉన్నవారే కాదు.. జాగ్రఫీ, వ్యవసాయ విద్యార్థులూ దీనిపై ఆసక్తి చూపుతున్నారు. నా ఉద్దేశం మాత్రం ఈ సంప్రదాయ కళ అంతరించి పోకూడదనే! విగ్రహాలే కాదు.. ఆభరణాలు, కొన్ని కళాకృతులనూ నేర్పిస్తున్నా. వీటికి విదేశాల్లో గిరాకీ. వాటి ద్వారా ఉపాధిని పొందుతారు’ అనే 52 ఏళ్ల మాలా ఆరేళ్లుగా శిక్షణిస్తోంది. బ్యాచ్‌కి 34 మంది విద్యార్థులను తీసుకుంటోంది. వీళ్లలో కొందరు విగ్రహ తయారీని వృత్తిగా తీసుకున్నా తన కల నెరవేరినట్టే అని చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్