Liz Truss : ఆ అమ్మాయే.. నేటి బ్రిటన్ ప్రధాని!
ఏడేళ్ల వయసులో స్కూల్ మాక్ జనరల్ ఎలక్షన్స్‌లో యూకే తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ పాత్ర పోషించారామె. పెద్దయ్యాక తానూ ఆమెలా ముందుండి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఆ ఆశ, ఆశయం నెరవేరడానికి సుమారు నాలుగు దశాబ్దాలు....
ఏడేళ్ల వయసులో స్కూల్ మాక్ జనరల్ ఎలక్షన్స్‌లో యూకే తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ పాత్ర పోషించారామె. పెద్దయ్యాక తానూ ఆమెలా ముందుండి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఆ ఆశ, ఆశయం నెరవేరడానికి సుమారు నాలుగు దశాబ్దాలు పట్టిందని చెప్పాలి. ఆనాడు ఆ ఉత్తుత్తి ఎన్నికల్లో తనకు ఏ ఒక్కరూ మద్దతు పలక్కపోయినా.. ఈనాడు అసలు సిసలైన పోటీలో పార్టీ మద్దతును కూడగట్టుకున్నారు.. తాజాగా బ్రిటన్ ప్రధానిగా తిరుగులేని విజయం సాధించారు. నాటి ఆ అమ్మాయే.. నేటి బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 47 ఏళ్ల లిజ్ తాజాగా బ్రిటన్ ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత.. ఈ పదవిని అలంకరించనున్న మూడో మహిళగా నిలిచారామె. ఈ నేపథ్యంలో ట్రస్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..
అప్పుడు ‘సున్నా’ ఓట్లు!
లిజ్ ట్రస్ అసలు పేరు.. మేరీ ఎలిజబెత్ ట్రస్. 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించిన ఆమె తల్లిదండ్రులిద్దరూ ఉన్నత విద్యావంతులే! తండ్రి గణిత ప్రొఫెసర్ కాగా, తల్లి నర్సు. చిన్న వయసులో లిజ్‌ను తన తల్లి అణు నిరాయుధీకరణ కోసం జరిగిన ఉద్యమాలు, ర్యాలీలకు తీసుకెళ్లేది. ఈ క్రమంలోనే ఆమెకు రాజకీయాలపై మక్కువ పెరిగింది. ఏడేళ్ల వయసులో తాను చదువుకునే స్కూల్లో మాక్ జనరల్ ఎన్నికలు జరిగాయి. అందులో యూకే తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ పాత్ర పోషించింది ట్రస్. అయినా తన ప్రసంగంతో ఆకట్టుకోలేకపోయిందామె. ‘దీన్నే మహదవకాశంగా భావించి.. భావోద్వేగపూరిత ప్రసంగం చేశాను.. కానీ ఆఖరికి నాకు ఒక్క ఓటు కూడా దక్కలేదు.. కనీసం నాకు నేనే ఓటు వేసుకోలేకపోయా..’ అంటూ చాన్నాళ్ల తర్వాత ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారామె. ఇక కుటుంబంతో కలిసి ఎంతో సరదాగా సమయం గడిపే ట్రస్.. వాళ్లతో కలిసి ఆడే ఆటల్లో ఓడిపోవడానికి అస్సలు ఇష్టపడేవారు కాదట! రౌండే పాఠశాలలో స్కూలింగ్ పూర్తిచేసిన ఆమె.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్.. సబ్జెక్టుల్లో డిగ్రీ పట్టా అందుకున్నారు.
ఓడినా.. అలుపు లేకుండా!
విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండే ట్రస్.. తొలుత లిబరల్ డెమోక్రాట్స్‌కు తన మద్దతు పలికారు. ఇక ఆక్స్‌ఫర్డ్‌లో చేరాక కన్జర్వేటివ్ పార్టీకి మారారు. చదువు పూర్తయ్యాక ‘షెల్’ అనే సంస్థలో అకౌంటెంట్‌గా తన కెరీర్ ప్రారంభించిన ఆమె.. అందులోనే తన సహ ఉద్యోగి హ్యూ ఓ లియారీని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లున్నారు. 2001, 2005 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినా నిరాశ చెందలేదు ట్రస్. ‘ఓటమే గెలుపుకి నాంది’ అన్నట్లుగా.. ఆగ్నేయ లండన్‌లోని గ్రీన్‌విచ్ నుంచి కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఇక అప్పట్నుంచి వెనుదిరిగి చూసే అవకాశం రాలేదామెకు. 2012లో విద్యాశాఖ మంత్రిగా ఎన్నికయ్యారు. 2014లో అప్పటి ప్రధాని కేమరూన్ ట్రస్‌ను తన కేబినెట్‌లోకి తీసుకొని.. పర్యావరణ శాఖ సెక్రటరీగా నియమించారు. 2016లో థెరిసా మే ప్రభుత్వంలో ‘న్యాయ శాఖ రాష్ట్ర కార్యదర్శి’గా బాధ్యతలు చేపట్టారు. 2019లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలోనూ.. ‘ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రటరీ’గా, ‘విదేశాంగ శాఖ సెక్రటరీ’గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో బ్రిటన్ చరిత్రలో అత్యంత కీలకమైన ‘బ్రెగ్జిట్’ ఒప్పందాన్ని ముందు వ్యతిరేకించినా.. ఆమోదం పొందాక మనసు మార్చుకున్నారు ట్రస్.
ఆహార్యంలో ఆమెను తలపించేలా..!
ఏడేళ్ల వయసులో మార్గరెట్ థాచర్ పాత్ర పోషించిన తాను నిజంగానే థాచర్ అభిమానిని అంటారామె. తలకట్టు దగ్గర్నుంచి డ్రస్సింగ్ దాకా.. ఇలా చాలా అంశాల్లో ఈ మాజీ ప్రధానిని తలపిస్తుంటారు ట్రస్. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఈ ఆహార్యంతోనే ట్రస్ అందరినీ ఆకట్టుకోవడం గమనార్హం. ఇలా తన వస్త్రధారణతోనే కాదు.. తన హోరాహోరీ ప్రచారంతోనూ బ్రిటన్ ప్రజల మనసులు గెలుచుకున్నారామె. పెరుగుతున్న ధరలను ప్రజలు తట్టుకునేలా పన్ను రాయితీ కల్పిస్తానని వారికి వాగ్దానం చేసి.. అందరి దృష్టినీ ఆకర్షించారు. తద్వారా అప్పటి థాచర్ ప్రజాకర్షక హామీల్ని మరోసారి గుర్తు చేశారు. ఆమె కూడా ప్రధాని రేసులో ఉన్నప్పుడు వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గిస్తానని ప్రకటించారు. ఇలా చాలా విషయాల్లో థాచర్‌ను అనుకరించే ట్రస్‌కు ‘మార్గరెట్ థాచర్ 2.0’ అనే పేరు కూడా ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషీ సునాక్‌పై విజయం సాధించి.. ఆ దేశ మూడో మహిళా ప్రధానిగా చరిత్రకెక్కారు ట్రస్. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత.. ఈ పదవిని చేపట్టబోయే మూడో మహిళగా ఘనత సాధించారామె.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.