తల్లయ్యాక మునుపటి సోనమ్‌లా మారడానికి 16 నెలలు పట్టింది!

గర్భం ధరించాక, ప్రసవానంతరం మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. బరువు పెరిగిపోవడం, చర్మంపై స్ట్రెచ్‌మార్క్స్‌, పిగ్మెంటేషన్‌, జుట్టు రాలిపోవడం.. ఇలాంటి మార్పులతో శారీరకంగా, మానసికంగా ఎంతగానో సతమతమవుతాం.

Published : 06 Jan 2024 12:10 IST

(Photos: Instagram)

గర్భం ధరించాక, ప్రసవానంతరం మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. బరువు పెరిగిపోవడం, చర్మంపై స్ట్రెచ్‌మార్క్స్‌, పిగ్మెంటేషన్‌, జుట్టు రాలిపోవడం.. ఇలాంటి మార్పులతో శారీరకంగా, మానసికంగా ఎంతగానో సతమతమవుతాం. ఒక్కమాటలో చెప్పాలంటే.. మనల్ని మనం గుర్తుపట్టలేనంతగా మారిపోతాం. కొత్తగా తల్లైన మహిళలకు ఇలాంటి స్థితి నుంచి పూర్వపు స్థితికి చేరుకోవడానికి చాలానే సమయం పడుతుంది. తనకైతే ఏకంగా 16 నెలల సమయం పట్టిందంటోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్. 2022, ఆగస్టు 20న వాయు అనే కొడుక్కి జన్మనిచ్చిన ఈ అందాల తార.. తన పూర్తి సమయాన్ని కొడుకు ఆలనా పాలనకే కేటాయిస్తూ అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. అయితే ప్రసవానంతర మార్పుల్ని సానుకూలంగా స్వీకరించిన సోనమ్‌.. శరీరంపై ఒత్తిడి పెట్టకుండా సహజసిద్ధంగానే పూర్వపు స్థితికి చేరుకున్నానంటూ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. మరి, ప్రసవానంతరం తిరిగి పూర్వపు స్థితికి చేరుకోవడానికి ఈ బాలీవుడ్‌ మామ్‌ ఏం చేసిందో తెలుసుకుందాం రండి..

తన నటనతో బాలీవుడ్‌ స్టార్‌గా ఎదిగిన సోనమ్‌.. విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తుల ఎంపికతో ఫ్యాషనిస్టాగానూ పేరు తెచ్చుకుంది. 2018, మేలో వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాను వివాహమాడిన ఈ సొగసరి.. 2022, ఆగస్టు 20న వాయు అనే కొడుక్కి జన్మనిచ్చింది. ‘గర్భిణిగా ఉన్నప్పుడు నా శరీర ఉష్ణోగ్రత పెరిగిపోయేది.. ఎప్పుడూ నా ఒళ్లు వేడిగా, చెమటలు కక్కుతూ కనిపించేది. దీంతో అందం తగ్గిపోయింది.. నిద్రలేమితోనూ ఇబ్బంది పడ్డా. ఇక మూడో త్రైమాసికంలో పలు ఆరోగ్య సమస్యలూ ఎదురయ్యాయి..’ అంటూ తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి పలు సందర్భాల్లో పంచుకుంది సోనమ్.

నేనలా చేయలేదు!

అమ్మయ్యాక సినిమాలకు విరామమిచ్చిన ఈ అందాల తార.. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని తన కొడుకు ఆలనాపాలనకే కేటాయిస్తోంది. ఇక ప్రసవానంతరం తిరిగి పూర్వపు స్థితికి చేరుకునేందుకూ తన శరీరాన్ని, మనసును ఇబ్బంది పెట్టలేదంటోన్న ఈ బ్యూటిఫుల్‌ మామ్‌.. సహజసిద్ధంగా, ఆరోగ్యంగానే మునుపటి సోనమ్‌లా మారానంటోంది. ఈ క్రమంలోనే ఓ అందమైన లెహెంగాలో దిగిన ఫొటోల్ని పోస్ట్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇందులో నాజూగ్గా, అందంగా కనిపిస్తోంది.

‘అమ్మనయ్యాక తిరిగి పూర్వపు స్థితికి రావడానికి నాకు 16 నెలల సమయం పట్టింది. ఇప్పుడు మునుపటి సోనమ్‌లా ఫీలవుతున్నా. అయితే చాలామంది ప్రసవం తర్వాత త్వరగా బరువు తగ్గాలి, తిరిగి పూర్వపు స్థితికి చేరుకోవాలని కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు.. వ్యాయామాలతో శరీరాన్ని కష్టపెడుతుంటారు. కానీ నేను అలా చేయలేదు. క్రాష్‌ డైట్లు, కఠిన వ్యాయామాలతో పనిలేకుండానే ఈ స్థితికి చేరుకున్నా.. ముఖ్యంగా నా ఆరోగ్యం పైన, నా కొడుకును మరింత జాగ్రత్తగా చూసుకోవడం పైనే దృష్టి పెట్టాను. ఇలా ఆలస్యంగానైనా నేను పెట్టుకున్న లక్ష్యానికి చేరుకోగలిగాను. మహిళగా పుట్టడం, అందులోనూ అమ్మతనాన్ని పొందడం ఓ అందమైన అనుభూతి..’ అంటోందీ సొగసరి.

ప్రతిదీ పాజిటివ్‌గానే..!

చాలామంది మహిళలు ప్రసవానంతరం తమ శరీరంలో వచ్చిన మార్పుల్ని చూసుకొని ఒత్తిడికి లోనవుతుంటారు. తమను చూసి ఇతరులు ఏమనుకుంటారోనని అసౌకర్యానికి గురవుతుంటారు. అయితే తాను మాత్రం ఈ మార్పుల్ని సానుకూలంగా స్వీకరించానంటోంది సోనమ్.

‘తల్లయ్యాక చాలామంది మహిళలు తమ శరీరాకృతిని చూసుకొని త్వరగా బరువు తగ్గేయాలనుకుంటారు. కానీ నేను మాత్రం ఇంత అత్యవసరంగా బరువు తగ్గాలనుకోలేదు. తల్లయ్యాక తీసుకున్న ఫొటోలు, వీడియోలు చూసి ‘నిజంగా నేనింతలా మారిపోయానా?’ అని అస్సలు ఫీలవ్వలేదు. బరువు పెరిగి, వయసు మీద పడినట్లుగా కనిపిస్తున్నానని భయపడలేదు. నేను ఇంతకుముందులా లేనన్న బెంగా పడలేదు. తల్లినయ్యాక కొన్ని నెలల తర్వాత పలు ఫొటోషూట్స్‌లో పాల్గొన్నా.. ఈ క్రమంలో ధరించబోయే కాస్ట్యూమ్స్‌కు సంబంధించిన కొలతలు ముందుగానే ఇచ్చి మరీ దుస్తులు కుట్టించుకుంటున్నా. అంతేకానీ.. గతంలో ధరించిన దుస్తులు ఇప్పుడు పట్టట్లేదని బాధపడలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం సర్వసాధారణం. వాటిని అంగీకరించకుండా ఎప్పుడూ ఒకేలా ఉండాలనుకునే మొండి ఆలోచన మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ప్రతిదీ సానుకూలంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ అందాల అమ్మ.

బ్రెస్ట్‌ఫీడింగ్‌ మేలు చేసింది!

కొంతమంది మహిళలు తమ చిన్నారికివ్వాల్సిన చనుబాల కంటే.. బరువు తగ్గే విషయం పైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఇలా శరీరాన్ని బలవంతం చేయడం వల్ల తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే అలా జరగకుండా ముందు జాగ్రత్తపడ్డానంటోంది సోనమ్.

‘వాయు పుట్టాక నా శరీర బరువును పక్కన పెట్టి వాడికి పాలిచ్చే విషయం పైనే ఎక్కువ దృష్టి పెట్టా. వీలైనన్ని ఎక్కువ రోజులు బ్రెస్ట్‌ఫీడింగ్‌ని కొనసాగించాలనుకున్నా. ఈ క్రమంలో శరీరానికి పోషకాహారం, కావాల్సినంత విశ్రాంతి, శక్తి అవసరం. క్రాష్‌ డైట్స్‌ పాటించడం వల్ల ఈ మూడింటినీ పొందలేం. అలాగే నా బరువు కొలుచుకుంటూ నోరూ కట్టేసుకోవట్లేదు.. ఇలా నా బిడ్డకు చనుబాలివ్వడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాను కాబట్టే కాస్త ఆలస్యంగానైనా అనుకున్న లక్ష్యాన్ని హెల్దీగా చేరుకోగలిగాను..’ అంటోందీ బాలీవుడ్‌ మామ్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్