రిలీవ్ కావాలంటే.. ఏం చేయాలి?
ఓ చిన్న వ్యాపార సంస్థలో పనిచేస్తున్నా. పెరుగుతోన్న ఒత్తిడి, పిల్లల ఆన్‌లైన్ తరగతులకు తోడు అధిక పని గంటలు నావల్ల కాలేదు. నాకు తగ్గ ఉద్యోగం వెతుక్కుంటానని మా మేనేజర్‌కి ముందే సూచించా. నాలుగు నెలల క్రితం సరేనన్నారు. ఇప్పుడు నాకు వేరే ఉద్యోగమొచ్చింది.
ఓ చిన్న వ్యాపార సంస్థలో పనిచేస్తున్నా. పెరుగుతోన్న ఒత్తిడి, పిల్లల ఆన్‌లైన్ తరగతులకు తోడు అధిక పని గంటలు నావల్ల కాలేదు. నాకు తగ్గ ఉద్యోగం వెతుక్కుంటానని మా మేనేజర్‌కి ముందే సూచించా. నాలుగు నెలల క్రితం సరేనన్నారు. ఇప్పుడు నాకు వేరే ఉద్యోగమొచ్చింది. 45 రోజుల నోటీస్ పిరియడ్ ఇచ్చారు. తీరా ఈ విషయం చెబితే ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. నా స్థానంలో వేరొకరు దొరకలేదు కాబట్టి, 3 నెలలు కొనసాగమంటున్నారు. ఇక్కడ మూడున్నరేళ్లకుపైగా పనిచేశా. ఎక్స్‌పీరియన్స్ లెటర్ అత్యవసరం. ఇప్పుడేం చేయాలి?
- శ్వేత, హైదరాబాద్
ముందు మీ పాత అపాయింట్‌మెంట్ లెటర్‌ను పరిశీలించి, ముందస్తు నోటీస్ ఇవ్వకపోతే పరిహారం చెల్లించాలన్న నిబంధన ఉందేమో చూడండి. అలాగే మీ మేనేజర్‌ని నోటి మాటగా అడిగారా, రాజీనామా లేఖలో ఆ సంస్థలో మీరు ఎప్పటి వరకూ పని చేస్తారన్నది స్పష్టంగా పేర్కొన్నారా అనేదీ చూసుకోండి. ఒకవేళ చెప్పకపోతే మనుపటి రాజీనామా పత్రం ఈమెయిల్ తేదీని ప్రస్తావిస్తూ అనుబంధంగా మరో రాజీనామాను సమర్పించండి. దానిలో చివరి పనిదినాన్ని స్పష్టంగా తెలియజేయండి. మీ పనికి సంబంధించి కంపెనీ పత్రాలు, ఈమెయిల్స్ మొదలైన వాటన్నింటి గురించీ ఒక ఓవర్ నోట్ తయారు చేసి, మీ పై అధికారికి అందించండి. సంతకం చేసిన ఓ కాపీని మాత్రం దగ్గరుంచుకోండి. గమనించాల్సిందేంటంటే.. మీ అపాయింట్‌మెంట్ లెటర్‌లో నోటీస్ పిరియడ్‌ను ఇరుపక్షాల్లో ఎవరైనా పాటించకపోతే పరిహారం చెల్లించే నిబంధనను అంగీకరిస్తూ మీరు సంతకం చేసుంటే.. ఆ కాల వ్యవధి పూర్తవకుండానే దాన్ని చెల్లించి మీరు సంస్థను వీడొచ్చు. మిమ్మల్ని ఆపే అధికారం వాళ్లకుండదు.
అలా లేకపోతే కాలవ్యవధి, ఎంత ముందుగా సమాచారమివ్వాలో చూసుకోండి. అది పూర్తవనిదే రిలీవింగ్ లెటర్ పొందడానికి మీరు అర్హులు కారు. దావా వేసే అవకాశమున్నా ఉద్యోగులకది అంత ఆచరణాత్మకం కాదు. మేనేజర్‌కి మీ పరిస్థితిని వివరిస్తూ రిలీవ్ చేయమని కోరవచ్చు. కాస్త చిరాకు కలిగించే విషయం అయినా వ్యూహాత్మకంగా ప్రవర్తించాలి. కాబట్టి, ఓపికతో ఉండండి. కొత్త సంస్థతో నిజాయతీగా జరుగుతున్న పరిణామాలను వివరించవచ్చు. వాళ్లూ అర్థం చేసుకుంటారు. కొంచెం చిక్కు పరిస్థితే! కానీ జాగ్రత్తగా మీ కెరియర్‌కు ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.