పది నెలలైనా బిడ్డను చూడలేదు!

అమ్మనాన్నలకు మేము ముగ్గురం. అక్కకు మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. తను ప్రసవానికి మా ఇంటకొచ్చేవరకూ అత్తింట్లోనే ఉంది. బావ మాత్రం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు.

Published : 05 Dec 2023 01:16 IST

అమ్మనాన్నలకు మేము ముగ్గురం. అక్కకు మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. తను ప్రసవానికి మా ఇంటకొచ్చేవరకూ అత్తింట్లోనే ఉంది. బావ మాత్రం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. భార్యని తనతో తీసుకెళ్లి కాపురం పెట్టడం లేదు. బాబు పుట్టి పదినెలలైనా చూడటానికీ రాలేదు. ఈ మధ్య వడిబియ్యం పోస్తున్నామని వారిని పిలవడానికి వెళ్లాం. అప్పుడు అత్తింటివారు మా అక్క తిరిగి వచ్చాక ఉద్యోగం చేయాలనీ, బాబుని చూసుకోవడానికి ఆయాను ఏర్పాటు చేసుకోవాలనీ కండిషన్లు పెట్టారు. ఏడాదిపాటు భార్యాభర్తలు కలిసిలేకపోతే విడాకులు తీసుకోవచ్చట కదా! ఆ ఉద్దేశంతోనే ఉన్నారనిపిస్తోంది. ఇప్పుడీ విషయం బయటకు తెలిస్తే నాకు సంబంధాలు రావని నాన్న భయపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరు?

 ఓ సోదరి

మీ ఉత్తరం ద్వారా మీ అక్క పడుతున్న వేదన అర్థమవుతోంది. ఈ మధ్య ఇలాంటి గృహహింస వివాదాలే ఎక్కువగా కోర్టులకు వస్తున్నాయి. మీ బావ ఏం ఉద్యోగం చేస్తున్నాడు? అతడి సంపాదన సరిపోకపోవడమే భార్యను తన వెంట తీసుకెళ్లకపోవడానికి కారణమా? లేక ఇంకేమైనా ఉందా? పెళ్లికి ముందు కొడుకు వెంట కోడల్ని పంపిస్తామని చెప్పిన అతడి తల్లిదండ్రులు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు. ఒకవేళ అతడు ఇంకా స్థిరపడకపోతే, కొన్నాళ్లు ఆగి కాపురం పెడతామని ముందే చెప్పాల్సింది. మీ అక్క ప్రసవానికి వచ్చే ముందు అత్తింట్లో ఏమైనా గొడవలు జరిగాయా? బిడ్డ పుట్టినా తండ్రి చూడటానికి ఎందుకు రాలేదు? ఈ విషయమై మీరు వారిని సంప్రదించలేదా? మనవడితో తమ ఇంటికి రాబోయే కోడలికి అత్తింటివారు ఇలాంటి కండిషన్లు పెట్టడానికి కారణం వారి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడమేనా.. వంటి వాటన్నింటికీ సమాధానాలు తెలియాలి. మీ అక్క ఏడాదిగా పుట్టింట్లో ఉన్నంత మాత్రాన విడాకులు తీసుకోవచ్చని అనడానికి లేదు. ముందు సమస్యను పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లండి. ఆమెను తనతో తీసుకెళ్లి కాపురం పెట్టడానికి అతడికున్న ఇబ్బందులేంటో తెలుసుకోండి. ఆర్థిక ఇబ్బందుల వల్లే అయితే, ఆదాయం పెంచుకోవడానికి మీ అక్క ఉద్యోగం చేసినా తప్పులేదు. ఇలాంటప్పుడు బాబుని చూసుకునేవాళ్లు కావాలి. ఇవన్నీ పంచాయతీలో పరిష్కరించుకుంటే మేలు. ఇందుకోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌లూ సాయం చేస్తాయి. అత్తమామలకూ కౌన్సెలింగ్‌ ఇస్తాయి. అలాకాకుండా మీరు కేసు పెడితే సమస్యలు మరింత పెద్దవయ్యే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్