Breastfeeding: బిడ్డకు ఎన్నాళ్లు చనుబాలివ్వాలి?

తల్లికి అనారోగ్య సమస్యలున్నప్పుడు పాలివ్వచ్చా? తల్లి పాల బ్యాంక్‌ నుంచి సేకరించిన పాలు బిడ్డకు పట్టచ్చా?.. ఇలా కొత్తగా తల్లైన వారిలో బోలెడన్ని సందేహాలుంటాయి. వాటన్నింటినీ నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు నిపుణులు.

Updated : 04 Aug 2023 15:23 IST

మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లిపాలే ఆధారం.. కాబట్టి ఆ సమయంలో కచ్చితంగా పాలిస్తుంటాం.. అదే ఆరు నెలలు దాటాక పాపాయికి ఘనాహారం అలవాటు చేస్తాం. ఆ సమయంలో వృత్తి ఉద్యోగాల రీత్యా కొంతమంది మహిళలకు తల్లిపాలు పట్టడం కుదరకపోవచ్చు.. మరికొంతమంది మహా అయితే ఏడాది పాటు చనుబాలు తాగిస్తారు. అతి తక్కువమంది తల్లులు తమ బుజ్జాయికి రెండుమూడేళ్లొచ్చే వరకు పాలు పట్టడం మంచిదంటుంటారు. ఇలా తల్లి పాల విషయంలో ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతుంటారు. దీంతో ‘అసలు తల్లి తన బిడ్డకు ఎన్నాళ్లు చనుబాలివ్వాలి?’ అన్న విషయంలో చాలామందికి స్పష్టత కొరవడుతుంది. ఇదొక్కటనే కాదు.. తల్లికి అనారోగ్య సమస్యలున్నప్పుడు పాలివ్వచ్చా? తల్లి పాల బ్యాంక్‌ నుంచి సేకరించిన పాలు బిడ్డకు పట్టచ్చా?.. ఇలా కొత్తగా తల్లైన వారిలో బోలెడన్ని సందేహాలుంటాయి. వాటన్నింటినీ నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు నిపుణులు.

మందులు వాడుతూ పాలు పట్టచ్చా?

నెలలు నిండి ఆరోగ్యంగా జన్మించిన పిల్లలకే కాదు.. నవజాత శిశువులకు, ఇతర అనారోగ్యాలతో జన్మించిన చిన్నారులకూ తల్లిపాలు అమృతంలా పని చేస్తాయి. అయితే కొంతమంది తల్లులు తమకున్న అనారోగ్యాల కారణంగా ఆయా మందులు వాడుతుంటారు. దాంతో పిల్లలకు ఏవైనా దుష్ప్రభావాలు ఎదురవుతాయేమోనని సందేహిస్తుంటారు. అయితే చాలావరకు మందుల ప్రభావం పాల ఉత్పత్తిపై ఉండదని, అవి పాలలో కలిసినా పిల్లలపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపవని సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్) చెబుతోంది. అయినా తల్లులు తమ సొంత వైద్యం కాకుండా నిపుణుల సూచనల మేరకే ఆయా మందులు వాడాలని, వీటి వల్ల తల్లిపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చుకున్నాకే ముందడుగు వేయడం శ్రేయస్కరమని అంటోంది.

ఎన్నేళ్ల పాటు పాలివ్వాలి?

తన చిన్నారికి ఎన్నేళ్ల పాటు పాలివ్వాలన్న విషయంలో తల్లులు తమ ఇళ్లలోని పెద్ద వాళ్ల సలహా తీసుకోవడం పరిపాటే! ఈ క్రమంలో ఒకరు ఆరు నెలలని చెప్తే, మరొకరు ఏడాదంటారు.. ఇంకొకరు రెండేళ్ల వరకూ కొనసాగించచ్చని చెబుతుంటారు. ఫలితంగా ఈ విషయంలో ఓ కచ్చితమైన సమాధానం దొరకదు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం చిన్నారికి ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలే పట్టాలని, ఆ తర్వాత ఘనాహారం ఇవ్వడం ప్రారంభించినా.. వారికి రెండేళ్ల వయసొచ్చే వరకు తల్లిపాలు పట్టడం కొనసాగించాలని చెబుతోంది. ఈ క్రమంలో ప్రతి ఫీడింగ్‌కి మధ్య రెండు గంటల గ్యాప్‌ ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇలా తల్లి ఎక్కువ కాలం పాలివ్వడం వల్ల తన చిన్నారి దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడకుండా సంరక్షించుకోవచ్చని సూచిస్తోంది. ఒకవేళ తల్లిపాలు ఉత్పత్తి కాని పక్షంలో నిపుణుల సలహా మేరకు ఫార్ములా పాలు తాగించచ్చని చెబుతోంది.

మిల్క్‌ బ్యాంక్‌ పాలు మంచివేనా?

తల్లి పాలు సరిపోకపోవడం, అసలు ఉత్పత్తి కాకపోవడం వల్ల కొంతమంది తల్లి పాల బ్యాంకుల్ని ఆశ్రయిస్తుంటారు. అలాగే కొంతమంది తల్లుల్లో అవసరానికి మించి పాల ఉత్పత్తి ఉండడంతో వాటిని వృథా చేయడం ఇష్టం లేక.. దగ్గర్లోని మిల్క్‌ బ్యాంకులకు వాటిని అందిస్తుంటారు. అయితే ఇలాంటి పాలు పట్టడం సురక్షితమేనా అన్న సందేహం కొంతమంది తల్లుల్లో ఉంటుంది. ఏదేమైనా లైసెన్స్‌ పొందిన ఆరోగ్య సంరక్షణ కేంద్రం నుంచి తల్లి పాలు సేకరించడమే అత్యుత్తమం అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఇక్కడ.. దాతల నుంచి సేకరించిన పాలను ప్రాసెస్‌ చేసి, పరీక్షించి, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిల్వ చేసి, అవసరార్థులకు అందుబాటులో ఉంచుతారు. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల పిల్లలపై ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. అలాగే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఒక పాపాయికి తాగించగా మిగిలిన పాలను మరో పాపాయికి తాగించడం వల్ల దుష్ప్రభావాలేమైనా ఉంటాయా? అంటే.. దీనివల్ల అత్యంత అరుదుగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు సంక్రమించే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అందుకే ఈ పద్ధతికి పూర్తి దూరంగా ఉండడమే మేలంటున్నారు.

పంప్‌ చేయడం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుందా?

వృత్తి ఉద్యోగాల రీత్యా తిరిగి ఆఫీసులకు వెళ్లే తల్లులకు బ్రెస్ట్‌ పంప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఉపయోగించడం వల్ల బిడ్డ నేరుగా తాగినంత పాలు ఉత్పత్తి కావని, క్రమంగా పాల ఉత్పత్తి తగ్గిపోతుందని కొంతమంది అంటుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రోజూ ఒక నిర్దిష్ట సమయం కేటాయించుకొని ఆ సమయంలోనే పంపింగ్‌ చేయడం వల్ల పాల ఉత్పత్తి క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో తిరిగి పనిలోకి వెళ్లడానికి 2-4 వారాల ముందు నుంచే పంపింగ్‌ ప్రారంభించడం వల్ల ఈ ప్రక్రియ తల్లులకు అలవాటవుతుందంటున్నారు. ఉదయాన్నే బిడ్డకు పాలు పట్టిన 10 నిమిషాల తర్వాత పంపింగ్‌ చేయడం మంచిదంటున్నారు. దానివల్ల మొదట్లో ఎక్కువగా పాలు ఉత్పత్తి కాకపోయినా.. క్రమంగా వీటి ఉత్పత్తి పెరుగుతుంది.. రోజూ ఇదే సమయంలో పంప్‌తో పాలు తీయడం వల్ల పాల కొరత లేకుండా జాగ్రత్తపడచ్చు.

అలాగే తల్లులు అందుబాటులో లేనప్పుడు పాపాయికి ఎన్ని పాలు సరిపోతాయో.. అంతే మోతాదులో తీయడం మంచిది. ఇలా తీసిన పాలను మిల్క్‌ బ్యాగ్స్‌, ఫీడింగ్‌ బాటిల్స్‌, గాజు జార్లలో భద్రపరిచి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. పాపాయికి తాగించే నాలుగ్గంటల ముందు వీటిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మర్చిపోవద్దు.

ఇక వీటితో పాటు తల్లిపాలపై మీకు ఎలాంటి సందేహాలున్నా నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు టెన్షన్‌ పడుతూ, సందేహిస్తూ పాపాయికి పాలివ్వడం కూడా మంచిది కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని