థైరాయిడ్, శ్వాస సమస్యలకు చెక్ పె ట్టేద్దాం...
ఇటీవల థైరాయిడ్, శ్వాస సమస్యలు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఈ ఆసనాలు, ముద్రలతో వాటిని తగ్గించుకోవచ్చు.
ఇటీవల థైరాయిడ్, శ్వాస సమస్యలు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఈ ఆసనాలు, ముద్రలతో వాటిని తగ్గించుకోవచ్చు.
జాలంధ్రబంధ లేదా చిన్‌లాక్
సౌఖ్యంగా కూర్చుని రెండు చేతులూ మోకాళ్ల మీద ఉంచాలి. పూర్తిగా శ్వాస తీసుకుని తల కిందికి వంచాలి. కింద మీ చుబుకాన్ని మెడకొంకుల (కాలర్‌బోన్) దగ్గర ఆనించి కొద్దిసేపు ఉండి మెల్లగా తల మధ్యలోకి తీసుకొచ్చి శ్వాసను వదిలేయాలి. ఇలా 3 నుంచి 5 సార్లు చేయాలి. ఈ బంధాలు చేసేటప్పుడు ఖాళీ కడుపుతోనే చేయాలి. ఏదైనా తింటే మూడు గంటల తర్వాత చేయాలి.
శంఖ ముద్ర
ఎడమచేతి బొటనవేలుని కుడిచేతి 4 వేళ్లతో పట్టుకోవాలి. తర్వాత ఎడమచేతి 4 వేళ్లను దగ్గరగా పెట్టి కుడిచేతి బొటనవేలుకు ఆనించాలి. ఈ ముద్ర ఛాతీకి ఎదురుగా పెట్టి చేతులు మాత్రం శరీరానికి ఆనకుండా రెండు మూడు అంగుళాల దూరంలో ఉంచాలి. కళ్లు మూసుకుని మెల్లగా కంఠం మీద ధ్యాసపెట్టి శ్వాస తీసుకుని వదలాలి. శ్వాస కంఠానికి, కంఠం నుంచి ఊపిరితిత్తులకి అందుతుంది. ఇలా 5 నిమిషాలు చేయాలి. థైరాయిడ్, శ్వాస సమస్యల తీవ్రతను బట్టి రెండుమూడుసార్లు కూడా చేయొచ్చు.
సుప్త వజ్రాసనం
రెండు కాళ్లూ వెనక్కి మడిచి కూర్చుని రెండు మోచేతులూ నడుము వెనక నేలమీద పెట్టి మెల్లగా మోచేతుల మీద బరువు వేస్తూ సాధ్యమైనంత తల వెనక్కి వంచాలి. ఒక నిమిషం అలాగే ఉండి నెమ్మదిగా యథాస్థితికి వజ్రాసనంలోకి రావాలి. ఇలా మూడుసార్లు చేయాలి. దీనితో ఊపిరితిత్తులు, హృదయకండరాలు, వెన్నెముక దృఢపడతాయి.
పూర్ణ భుజంగాసనం
పొట్టమీద బోర్ల పడుకుని రెండు చేతులూ ఛాతీకి పక్కగా ఉంచాలి. రెండు మోకాళ్లూ మడిచి ఉంచాలి. చేతులమీద బరువు వేస్తూ భుజాలు, తల వీలైనంత వెనక్కి వంచి నిమిషంపాటు అదే స్థితిలో ఉండాలి. ఇలా మూడుసార్లు చేయాలి. ఇది థైరాయిడ్, కంఠం ఊపిరితిత్తులు, ఉదరభాగం, వెన్నెముకకు మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.