బాబు కస్టడీ అత్తావాళ్లకి ఇవ్వాలా?

అయిదేళ్ల కిందట, బాబు పుట్టిన ఏడాదికి మావారు చనిపోయారు. అత్తమామలకు ఆయన ఒక్కడే కొడుకు. అది జరిగిన ఏడాది వరకూ మా అత్తింటివారు నాతో బాగానే ఉన్నారు. తర్వాత నుంచి దురదృష్టవంతురాలివంటూ వేధించడం మొదలుపెట్టారు.

Published : 06 Sep 2022 01:08 IST

అయిదేళ్ల కిందట, బాబు పుట్టిన ఏడాదికి మావారు చనిపోయారు. అత్తమామలకు ఆయన ఒక్కడే కొడుకు. అది జరిగిన ఏడాది వరకూ మా అత్తింటివారు నాతో బాగానే ఉన్నారు. తర్వాత నుంచి దురదృష్టవంతురాలివంటూ వేధించడం మొదలుపెట్టారు. భరించలేక బాబుని తీసుకుని ఇంట్లోంచి వచ్చేశా. అయిదేళ్ల తర్వాత పిల్లవాడి కస్టడీ కావాలని కోర్టులో అత్తమామలు కేసు వేశారు. బాబుని నేను దక్కించుకునే మార్గం లేదా?

- ఓ సోదరి

పిల్లల కస్టడీ విషయంలో తల్లిదండ్రుల్ని సహజమైన సంరక్షకులుగా పరిగణిస్తారు. సాధారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకున్న సందర్భాల్లో ఎవరు పిల్లల బాగోగులు బాగా చూసుకోగలరో, ఎవరి దగ్గర పిల్లల సంక్షేమం బాగుంటుందో నిర్ణయించేటప్పుడు ప్రతి కేసులోనూ ఆయా పరిస్థితులనుబట్టి కోర్టు ఒక నిర్ధణకు వస్తుంది. మీ విషయానికి వస్తే మీ భర్త చనిపోయిన తర్వాత మీరు ఏకైక గార్డియన్‌ అవుతారు. కానీ వాళ్లకు ఒక్కడే కొడుకు కావడం, తనూ చనిపోవడంతో.. వాళ్లూ వారసుడి కస్టడీ కోసం కేసు వేసి ఉండొచ్చు. ఈ అంశం హిందూ మైనారిటీ, గార్డియన్‌షిప్‌ యాక్ట్‌- 1956 పరిధిలోకి వస్తుంది. దీన్లో సెక్షన్‌-6 ప్రకారం తండ్రి తరువాత తల్లిని సహజ సంరక్షకురాలిగా పరిగణిస్తారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో తల్లిని కాకుండా వేరేవాళ్లని గార్డియన్‌గా కోర్టు గుర్తిస్తుంది. తల్లి వేరే వివాహం చేసుకుని పిల్లాడిని సరిగ్గా చూడకపోవడం లాంటివి. కానీ అది నిరూపితం కావాలి. లేదంటే ఏవైనా ఇతర కారణాలతో పిల్లవాడిని తల్లి శారీరకంగా బాధిస్తోందని నిరూపించగలగాలి. అలాంటప్పుడు పిల్లాడిని కోర్టు వేరే వాళ్లకి అప్పగిస్తుంది. మీ విషయంలో అలాంటివేవీ లేవు కాబట్టి మీ అత్తావాళ్లకి కేవలం విజిటింగ్‌ హక్కులు ఇవ్వొచ్చు. దీనికి మీ అభ్యంతరం ఉండకపోవచ్చనుకుంటున్నా. మీకు వారి ప్రవర్తన విషయంలో, పిల్లవాడి చదువు మీద లేదా వాడి వ్యక్తిత్వం మీద ఏదైనా దుష్ప్రభావం పడుతుందనే భయం ఉంటే అది ఎలాంటి ప్రభావమో, దాని ఫలితాలు మీరు కోర్టుకి వివరంగా చెప్పి విజిటింగ్‌ హక్కులు రెగ్యులర్‌గా కాకుండా నెలకోసారి ఉండేట్లు లేదా ఆ ఉత్తర్వును మార్చమని అడగొచ్చు. ‘నేను అవసరం లేదనుకున్న వాళ్లకి నా బిడ్డమీద ఎందుకు హక్కు’ అంటే సమాధానం దొరక్కపోవచ్చు. పిల్లల సంక్షేమానికే తప్ప సెంటిమెంట్లకు కోర్టు ప్రాధాన్యం ఇవ్వదు. మీరు బాబు భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. పూర్తి కస్టడీ వాళ్లకి ఇవ్వడం సాధారణంగా జరగదు. కాబట్టి బాబు దూరమవుతాడని భయపడక్కర్లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని