చేయి ఇవ్వలేకపోతున్నా..

చలికాలం వస్తే గోళ్ల పక్కన చర్మం ఊడిపోతోంది. నొప్పికి తోడు ఆ ప్రాంతం నల్లగా, బరకగా మారిపోతోంది.

Published : 10 Dec 2023 01:17 IST

చలికాలం వస్తే గోళ్ల పక్కన చర్మం ఊడిపోతోంది. నొప్పికి తోడు ఆ ప్రాంతం నల్లగా, బరకగా మారిపోతోంది. ఆఫీసులో షేక్‌హ్యాండ్‌ ఇవ్వాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ సమస్యను పోగొట్టుకునేదెలా?

- ఓ సోదరి

పొడిచర్మం ఉన్నవారిలో ఇది సహజమే. చలికాలంలో సమస్య మరీ పెరుగుతుంది. గోరు చుట్టూ చర్మం కూడా బరకగా మారి.. ఎవరికైనా తగిలినా గీరుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి, మానిక్యూర్‌, చేతుల స్క్రబింగ్‌లకు ఈ కాలం దూరంగా ఉండండి. ఇల్లు తుడవడం, దుస్తులు ఉతకడం, పాత్రలు కడగడం వంటివి చేస్తున్నప్పుడు ఆయా ఉత్పత్తుల్లోని రసాయనాలు చేతులను మరింత పొడిబారేలా చేస్తాయి. కాబట్టి, గ్లవుజులు వాడితే మేలు. కొందరికి తరచూ చేతులు కడిగే లేదా శానిటైజర్‌ రాసే అలవాటు ఉంటుంది. పార్లర్‌కి వెళ్లి క్యుటికల్స్‌ని తీయిస్తుంటారు. అతిగా నెయిల్‌పాలిష్‌లు వాడటం, గోళ్లు కొరకడం, కాస్త చర్మం లేవగానే లాగేయడం లాంటివి చేస్తారు. ఇవీ సమస్యను పెంచేవే. ఈ పగుళ్లలో బ్యాక్టీరియా చేరితే ఇన్‌ఫెక్షన్లూ ఇబ్బంది పెడతాయి. వీటికి వీలైనంతవరకూ దూరంగా ఉండండి. చలికాలమని నీళ్లు సరిగా తాగకపోతే వేళ్ల చర్మం కూడా పొడిబారుతుంది. కనీసం 2 లీటర్ల నీరు, నట్స్‌, తాజా పండ్లు, ఆకుకూరలతో కూడిన పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోండి. తరచూ షియాబటర్‌ లేదా విటమిన్‌ ఇ ఉన్న క్రీములను చేతులకు రాస్తూ ఉండాలి. చేతులు కడగాల్సి వచ్చినా సబ్బు, హ్యాండ్‌వాష్‌లకు వీలైనంత వరకూ దూరంగా ఉండండి. సమస్య అదుపులోకి వస్తుంది. వీటితోనూ లాభం లేదనిపిస్తే విటమిన్‌ లోపం ఉందేమో చెక్‌ చేయించుకొని అవసరమైతే సప్లిమెంట్లు వాడండి. రాత్రుళ్లు చేతులకు మాయిశ్చరైజర్‌ రాసుకొని కాటన్‌ గ్లవుజులు వేసుకుంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్