రెండో పెళ్లి... భర్త వేధిస్తున్నాడు!

మొదటి భర్త చనిపోయాడు. బాబు ఉన్నాడు. తనకు డౌన్‌ సిండ్రోమ్‌. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నా. అతడికీ పిల్లలున్నారు. అన్నీ మాట్లాడుకునే చేసుకున్నాం. కానీ వాళ్ల అమ్మ, అక్క, పిల్లల మాటలు విని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. బాబునీ సరిగా చూడటంలేదు. ఆర్నెల్లు భరించి చివరకు ఇంట్లో నుంచి వచ్చేశా. తన ఆరోగ్యం బాగాలేనపుడు మా వాళ్లతో మాట్లాడి తీసుకువెళ్లాడు. ఇప్పుడు మళ్లీ మునుపటిలానే ప్రవర్తిస్తున్నాడు. పెళ్లై ఏడాది. ఇదివరకు ప్రైవేటు ఉద్యోగం చేసేదాన్ని. ఇప్పుడు ఏ ఆధారమూ...

Published : 10 May 2022 01:35 IST

మొదటి భర్త చనిపోయాడు. బాబు ఉన్నాడు. తనకు డౌన్‌ సిండ్రోమ్‌. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నా. అతడికీ పిల్లలున్నారు. అన్నీ మాట్లాడుకునే చేసుకున్నాం. కానీ వాళ్ల అమ్మ, అక్క, పిల్లల మాటలు విని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. బాబునీ సరిగా చూడటంలేదు. ఆర్నెల్లు భరించి చివరకు ఇంట్లో నుంచి వచ్చేశా. తన ఆరోగ్యం బాగాలేనపుడు మా వాళ్లతో మాట్లాడి తీసుకువెళ్లాడు. ఇప్పుడు మళ్లీ మునుపటిలానే ప్రవర్తిస్తున్నాడు. పెళ్లై ఏడాది. ఇదివరకు ప్రైవేటు ఉద్యోగం చేసేదాన్ని. ఇప్పుడు ఏ ఆధారమూ లేదు. పుట్టింటి వాళ్లు సాయం చేయలేరు. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి చట్టం నాకెలాంటి సాయం చేస్తుంది? 

- ఓ సోదరి.


మీ రెండో పెళ్లి న్యాయబద్ధమే అయితే, అంటే హిందూ వివాహ చట్టం ప్రకారం జరిగినట్లయితే, మీరు కచ్చితంగా న్యాయాన్ని పొందొచ్చు. మొదటిది గృహహింస చట్టం కింద... మిమ్మల్నీ, మీ బిడ్డనీ హింసిస్తున్నారనీ ఫిర్యాదు చేయొచ్చు. ఈ చట్టం ద్వారా నియమితులైన ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ మీ భర్తను పిలిపించి మాట్లాడి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తారు. కుదరని పక్షంలో కేసును కోర్టుకు పంపిస్తారు. గృహహింస చట్టం ద్వారా ఇంట్లోనే ఉండే హక్కు-సెక్షన్‌ 17, రక్షణ పొందే హక్కు- సెక్షన్‌ 18, ఇంట్లోనే వేధింపులు లేకుండా నివసించే హక్కు- సెక్షన్‌ 19, మీకూ, బాబుకీ ప్రతి నెలా భరణం పొందే హక్కు-సెక్షన్‌ 20, మానసిక క్షోభకు పరిహారం పొందే హక్కు-సెక్షన్‌ 22.. మొదలైనవి కోర్టుని కోరవచ్చు. గృహహింస చట్టంలో విడాకుల ప్రసక్తి లేదు. విడాకులు కావాలనుకుంటే హిందూ వివాహ చట్టం: సెక్షన్‌ 13 ద్వారా కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకోవాలి. అతనితో వివాహబంధం చెడిపోకూడదనుకుంటే, జ్యుడీషియల్‌ సెపరేషన్‌ (సెక్షన్‌ 10) కోసం ప్రయత్నించండి. కేవలం భరణం కావాలంటే క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సెక్షన్‌ 123) ప్రకారం కేసు వేయండి. ఏ కేసు వేసినా మీ ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సెలింగ్‌ చేస్తారు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే కోర్టు ద్వారా తేల్చుకోవాలి. మీకు కోర్టుకు వెళ్లే స్థోమత లేకుంటే, న్యాయసేవల అథారిటీని సంప్రదిస్తే మీ తరఫున వాదించేందుకు న్యాయవాదిని ఏర్పాటుచేస్తారు. అధైర్య పడకుండా ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్