ట్విటర్‌ మెచ్చినశాస్త్రవేత్త

డాక్టర్‌గా చూడాలనేది అమ్మానాన్నల కోరిక.. తనకేమో రసాయన శాస్త్రంలో  పరిశోధనలు చేయాలని కల...ఇంతలోనే పెళ్లి.. భర్తతో చండీగఢ్‌కు పయనం... అక్కడ పీహెచ్‌డీలో చేరినా తర్వాత వదిలేయాల్సిన పరిస్థితి... శాస్త్రవేత్తగా సొంతగా చేపట్టిన తొలి ప్రయోగమే విఫలం.

Published : 28 May 2021 00:57 IST

డాక్టర్‌గా చూడాలనేది అమ్మానాన్నల కోరిక.. తనకేమో రసాయన శాస్త్రంలో  పరిశోధనలు చేయాలని కల...ఇంతలోనే పెళ్లి.. భర్తతో చండీగఢ్‌కు పయనం... అక్కడ పీహెచ్‌డీలో చేరినా తర్వాత వదిలేయాల్సిన పరిస్థితి... శాస్త్రవేత్తగా సొంతగా చేపట్టిన తొలి ప్రయోగమే విఫలం... ఆ దశ నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా బ్యాక్టీరియా కణ గోడల పెరుగుదలను గుర్తించడం ద్వారా ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌మనీ అందుకున్నారు సీసీఎంబీ శాస్త్రవేత్త మంజులారెడ్డి. తాజాగా ‘నేను శాస్త్రవేత్త’ సిరీస్‌లో భాగంగా ఆమె గురించి ట్విటర్‌ ప్రచురించడం విశేషం...తన ప్రస్థానాన్ని మంజుల వసుంధరతో పంచుకున్నారు...
గ్రామాల్లో పెరిగిన నాకు ప్రకృతిలో విషయాలు కొన్ని సంతోషంగా.. మరికొన్ని ఆశ్చర్యంగా అన్పించేవి. ఈ సంగతులన్నీ పెద్దయ్యాక సైన్స్‌ మార్గంలోకి నడిపిస్తాయని అప్పుడు తెలియదు. మా అమ్మానాన్నలిద్దరూ న్యాయవాదులు. నాతో పాటు నా తోబుట్టువులను వైద్యులుగా చూడాలనేది వారి కోరిక. నేనేమో రసాయన శాస్త్రంతో ఎక్కువ బంధం పెంచుకున్నాను. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో జీవ రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేయాలని కలల కనేదాన్ని. ఈ లోపు నాకు పెళ్లి చేసేశారు. అప్పటికి నాకు 21 కూడా నిండలేదు. మా వారు కృష్ణారెడ్డితో కలసి చండీగఢ్‌కు వెళ్లి పోయాను. అక్కడ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రోబియల్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీలో చేరాను. అంతా బానే సాగుతున్న దశలో కొత్త సవాళ్లు మొదలయ్యాయి. పీహెచ్‌డీ పర్యవేక్షకుల ఆరోగ్యం క్షీణించడంతో నాలుగేళ్ల తర్వాత కోర్సు వదిలేయాల్సి వచ్చింది. అప్పటికే నాకు రెండేళ్ల పాప. తనని చూసుకునేందుకు హైదరాబాద్‌ వచ్చేశాను.
అవకాశాలొస్తాయి..
సీసీఎంబీలో జూనియర్‌ శాస్త్రవేత్త పోస్టులు ఖాళీగా ఉండటంతో దరఖాస్తు చేయడం, ఎంపికవడం జరిగిపోయాయి. అవకాశాలు మరో రూపంలో అందుబాటులో ఉంటాయి అని చెప్పడానికి నేనే నిదర్శనం. ఇది 1990 నాటి మాట. సీసీఎంబీలో చేరిన మొదట్లో కొన్ని సంవత్సరాలు కష్టంగానే అన్పించింది. సొంతంగా పరిశోధన చేయలేకపోతున్నాననే నిరాశే ఉండేది. ఏళ్లు గడిచే కొద్దీ పరిశోధన చేయాలనే కోరిక మరింత పెరిగింది. నన్ను నేను నిరూపించుకునేందుకు సీసీఎంబీలో పీహెచ్‌డీలో చేరాను. బ్యాక్టీరియాలో ఉత్పర్తివర్తనాలు, డీఎన్‌ఏపై పీహెచ్‌డీ చేశాను. ఆ సమయంలో నా మెంటార్‌ డాక్టర్‌ గౌరీశంకర్‌ సూచనలు, సలహాలతో పరిశోధనలు చేయగలననే విశ్వాసం పెరిగింది. పిల్లలను చూసుకుంటూ పరిశోధనలు కష్టమే అయినా పట్టుదలతో కొనసాగించాను. వేసవి సెలవులొస్తే పిల్లలను వాళ్ల అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గరికి పంపించి పగలంతా ల్యాబ్‌లో, సాయంత్రం గ్రంథాలయంలో గడిపేదాన్ని. కొన్ని సంవత్సరాల తర్వాత పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలోగా సీటెల్‌లోని ఫ్రెడ్‌ హచిన్సన్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో డాక్టర్‌ గెర్రీ స్మిత్‌ దగ్గర చేరాను. జీవితం, పరిశోధనల గురించి ఎక్కువ పాఠాలు నేర్చుకుంది ఇక్కడే. అక్కడ మెంటార్ల తోడ్పాటుతో నాలో నాయకత్వ లక్షణాలు మెరుగయ్యాయి.
వెనకడుగు వేయలేదు...
అక్కడంతా కొత్త. నేను సొంతంగా చేసిన తొలి ప్రయోగమే విఫలమైంది. చాలా డీలా పడ్డాను. అక్కడి మంచు వాతావరణంలో ఇబ్బంది పడుతుంటే 40 ఏళ్ల నన్ను డాక్టర్‌ స్మిత్‌ కూతురిలా ఆదరించిన తీరును మర్చిపోలేను. ఇప్పటికీ మేం మంచి స్నేహితులం. అక్కడే పనిచేసే క్లినీషియన్‌, శాస్త్రవేత్త మార్క్‌ చూపిన శ్రద్ధ నాలో మరింత తపన పెంచింది. అప్పుడే నా పరిశోధనలో బ్యాక్టీరియా విభజన సమయంలో కణ గోడలు పెరగడం గుర్తించా. అప్పటి వరకు అది ఎవరికీ తెలియని విషయం. దీంతో మరింత లోతుగా అధ్యయనం మొదలెట్టాను. 2007లో సీసీఎంబీలో స్వతంత్ర పరిశోధన చేపట్టాను. కణ విభజనలో రహస్యాలను కనిపెటడానికి సుదీర్ఘ సమయం పడుతుందని అర్థమైంది. కెరీర్‌ ప్రారంభంలో నా ఆలోచనలు మరోలా ఉండేవి. పరిశోధన పత్రాలను జర్నల్స్‌లో వేగంగా ప్రచురితం అయ్యేలా చూసుకుంటే వృత్తిలో నిలదొక్కుకోగలం అనే ఆలోచనతో ఉండేదాన్ని. ఫండమెంటల్‌ సైన్స్‌ను లోతుగా అధ్యయనం చేయడంలోనే ఉత్సాహం ఉంటుందని కొద్ది సంవత్సరాల్లోనే అర్థం చేసుకోగలిగాను. ఈ క్రమంలోనే బ్యాక్టీరియా కణ గోడల పెరుగుదలకు దోహదం చేస్తున్న వేర్వేరు ఎంజైమ్‌లను కనుగొన్నాం. బ్యాక్టీరియాను యాంటిబయాటిక్స్‌ చంపేయడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షించుకుంటున్నాం. కానీ కాలక్రమేణా బ్యాక్టీరియా సైతం యాంటీబయాటిక్స్‌ నిరోధకతను సంతరించుకుని సూపర్‌బగ్స్‌ అయ్యాయి. దీంతో కొత్త యాంటీబయాటిక్స్‌ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం బ్యాక్టీరియాలోని కొత్త టార్గెట్లపై దృష్టి పెట్టాలి. మేం ఇదివరకు కనుగొన్న ఎంజైమ్‌ల ద్వారా ఈ పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాం.

 



జీవితంలో వచ్చిన తుఫాను ఎప్పుడు వెలిసిపోతుందా అని ఎదురుచూడటం కాదు... ఆ చినుకుల తుంపరలో తడిసి ముద్దయ్యి ఆనందం పొందడం కూడా మనకి తెలియాలి.

- వివియన్‌ గ్రీన్‌, రచయిత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్