అందుకే నాన్న పేరును తొలగించుకున్నా!

మల్లికా శెరావత్‌... బాలీవుడ్‌, హాలీవుడ్‌తో పాటు చైనీస్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించిన అందాల తార. హిందీ సినిమా పరిశ్రమలో బోల్డ్‌ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వ్యవహార శైలి నిజ జీవితంలోనూ అలాగే ఉంటుంది. మహిళల సమస్యలు, సామాజిక అంశాలకు సంబంధించి ఆమె పలు సందర్భాల్లో ముక్కుసూటిగా తన మనసులోని మాటల్ని పంచుకుంది.

Published : 16 Sep 2021 15:10 IST

మల్లికా శెరావత్‌... బాలీవుడ్‌, హాలీవుడ్‌తో పాటు చైనీస్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించిన అందాల తార. హిందీ సినిమా పరిశ్రమలో బోల్డ్‌ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వ్యవహార శైలి నిజ జీవితంలోనూ అలాగే ఉంటుంది. మహిళల సమస్యలు, సామాజిక అంశాలకు సంబంధించి ఆమె పలు సందర్భాల్లో ముక్కుసూటిగా తన మనసులోని మాటల్ని పంచుకుంది.

‘రీమా లంబా’ టు ‘మల్లికా శెరావత్’!

‘ఖ్వాయిష్‌’, ‘మర్డర్‌’ చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది మల్లిక. హాలీవుడ్‌లో నటించిన అతి కొద్దిమంది హీరోయిన్లలో ఆమె ఒకరు. జాకీచాన్‌ వంటి ప్రముఖ నటుడితో (‘ది మిత్‌’) తెర పంచుకున్న ఘనత ఆమె సొంతం. అయితే ఈ అందాల తారకు తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు రీమా లంబా. కానీ సినిమాల్లోకి వచ్చే ముందు తన పేరును ‘మల్లికా శెరావత్‌’గా మార్చుకున్నానంటోంది. ప్రస్తుతం ‘నకబ్‌’ అనే ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ... తన పేరు మార్చుకోవడానికి గల అసలు కారణాలను ఇటీవలే వెల్లడించింది.

అందుకే నాన్న పేరును తొలగించుకున్నా!

‘నాకు సినిమా ఇండస్ట్రీలో గొప్పగా రాణించాలని కోరిక. కానీ మా కుటుంబ సభ్యులెవరికీ అది ఇష్టం లేదు. నాన్న, సోదరుడు నా నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. నేను మాత్రం ఇంట్లో చెప్పకుండా ముంబయికి వచ్చేశాను. నా దగ్గరున్న నగలమ్మి వచ్చిన డబ్బులతో కొద్ది రోజులు జీవితం గడిపాను. సినిమాల్లోకి రాకముందు నా పేరు రీమా లంబా. కానీ సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించడానికి ముందే దాన్ని మల్లికా శెరావత్‌గా మార్చుకున్నాను. దీనికి కారణం మా నాన్న (ముఖేష్‌ కుమార్‌ లంబా). నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఒకరోజు ‘నువ్వు సినిమాల్లోకి వెళితే మన కుటుంబం పరువు, ప్రతిష్ఠలు మంట గలిసిపోతాయి. అది నేను సహించలేను’ అని అన్నాడు. అప్పుడు నేను ‘మీరు నా తండ్రి. మిమ్మల్ని ప్రేమిస్తాను, గౌరవిస్తాను. అయితే మీ పేరును మాత్రం ఉపయోగించను’ అని బదులిచ్చాను. ఆ తర్వాత నాన్న పేరును తొలగించుకొని అమ్మ పేరులో సగం (శెరావత్) నా పేరులో కలిపేసుకున్నా. ఎందుకంటే ఇంట్లో నా నిర్ణయానికి మద్దతిచ్చింది ఒక్క అమ్మ మాత్రమే!’

ఆ వ్యవస్థకు నేను వ్యతిరేకం!

‘మాది హరియాణాలోని ఓ మారుమూల గ్రామం. అక్కడ అంతా పితృస్వామ్య వ్యవస్థే రాజ్యమేలేది. మా ఇంట్లో కూడా నాన్న మాటను ఎవరూ జవదాటేవారు కాదు. కానీ ఈ పితృస్వామ్య వ్యవస్థకు నేను పూర్తి వ్యతిరేకం. ఇష్టం లేని పని చేశానని ఇప్పటికీ నా కుటుంబ సభ్యులు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అయితే కాలంతో పాటు వారూ మారతారని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చిందీ సొగసరి.

నాకు నైతిక విలువలు లేవన్నారు!

బాలీవుడ్‌లో హాట్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మల్లిక కొన్ని ప్రత్యేక గీతాల్లోనూ నటించింది. అదే సమయంలో కొన్ని విమర్శలూ మూటగట్టుకుంది. దీనిపై స్పందిస్తూ.. ‘నేను కొన్ని సినిమాల్లో బికినీల్లో కనిపించాను. ముద్దు సీన్లలో నటించాను. కానీ వీటి ఆధారంగా కొందరు నా వ్యక్తిత్వాన్ని జడ్జ్‌ చేశారు. ‘నాకు నైతిక విలువలు లేవని’ విమర్శించారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. నన్ను ట్రోల్‌ చేసిన వాళ్లలో చాలామంది మహిళలే. ఇది నన్ను మరింత బాధపెట్టింది. అందుకే ఒకానొక సమయంలో సినిమాలను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్దామనుకున్నా. కానీ ఇప్పుడు నన్ను నేను మార్చుకున్నా.. విమర్శల్ని సానుకూలంగా స్వీకరించడం నేర్చుకున్నా. నన్ను నేను ప్రేమించుకుంటూ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా..’ అంటోంది మల్లిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్