Published : 27 Jun 2021 00:08 IST

క్రికెట్‌ నుంచి నేర్చుకున్నా

సత్యా నాదెళ్ల... తాజాగా మైక్రోసాఫ్ట్‌కి ఛైర్మన్‌గా ఎంపికై... ఈ స్థాయికి చేరిన తొలి భారతీయుడిగా గుర్తింపు సాధించాడు. పక్కా ప్రణాళిక ఉంటే... జీవితంలో గెలుపు తప్పకుండా సొంతమవుతుందని చెప్పే ఈటెక్‌ అధినేత తన ఇష్టాయిష్టాలూ, జీవనవిధానం గురించి ఏం చెబుతారంటే...

క్రికెట్‌ నేర్పిన నాయకత్వం

చిన్నప్పుడు నాకు ఇష్టమైన బొమ్మ ఏంటో తెలుసా క్రికెట్‌బ్యాట్‌. ఆ ఇష్టాన్ని గమనించే మా ఇంట్లోవాళ్లు నన్ను క్రికెట్‌లో ప్రోత్సహించారు. అయితే నేను క్రికెటర్‌ని కాలేకపోయాను కానీ దాన్నుంచి  నేర్చుకున్న నాయకత్వ పాఠాలు నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఒక కెప్టెన్‌ క్రికెట్‌ టీమ్‌ని సమన్వయం చేసి మ్యాచ్‌ని గెలిపించినట్లుగా... ఒక నాయకుడు ఉద్యోగులందరినీ ఒకేతాటిమీద నడిపిస్తేనే సంస్థ విజయాల బాట పడుతుందని క్రికెట్‌ నుంచే నేర్చుకున్నా.

అను మంచి స్నేహితురాలు

నా భార్య అనుపమా, నేనూ హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌లో చదువుకుంటున్నప్పటి నుంచీ స్నేహితులమే. ఆ స్నేహమే మా పెళ్లికి దారితీసింది. మాకు ముగ్గురు పిల్లలు. నా దృష్టిలో అను చాలా అద్భుతమైన వ్యక్తి. ఎదుటివారి పట్ల సహానుభూతి చూపడం, పరిస్థితులకు తగినట్లుగా మారడం వంటివన్నీ తన నుంచే నేర్చుకున్నా. మా అబ్బాయికి సెరెబ్రల్‌ పాల్సీ ఉన్నా తనెప్పుడూ బాధపడలేదు. బాబును ఎలా పెంచాలనే కోణంలోనే ఆలోచించింది. ఆ సమయంలో తనని చూశాక... వైకల్యంతో బాధపడేవారి ఆలోచనా సరళి ఎలా ఉంటుందో వారితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోగలిగాను.

ఎక్కడున్నా పరుగెత్తాల్సిందే

నేను ఎక్కడున్నా, రాత్రి ఎంత ఆలస్యంగా నిద్రపోయినా, ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే... పొద్దున్నే అరగంటసేపు పరుగెత్తడం ఓ అలవాటుగా పెట్టుకున్నా. ఆ అరగంటసేపు చేసిన వ్యాయామం నా మిగిలిన రోజును సాఫీగా సాగిపోయేలా చేస్తుందని అనుకుంటా.

అమ్మను చూశాక...

మ్మ ప్రభావతీ యుగంధర్‌ తిరుపతి పద్మావతీ కాలేజీలో లెక్చరర్‌గా ఉండేది. ఇంటికొచ్చాక బోలెడు పనులు చేసేది. నాతో గడిపేందుకూ కొంత సమయం పెట్టుకునేది తప్ప విశ్రాంతి తీసుకునేదికాదు. ఇంట్లో నా భార్య కావచ్చు, మైక్రోసాఫ్ట్‌లో సహోద్యోగినులు కావచ్చు... మహిళలుగా ఇంటా బయటా వారు ఎదుర్కొనే ఒత్తిళ్లనూ, సమస్యల్నీ నేను సక్రమంగా అర్థంచేసుకోగలుగుతున్నానంటే ఆ క్రెడిట్‌ అమ్మదే మరి.

నచ్చే ఆహారం

హైదరాబాదీ బిర్యానీ. కేవలం తినడమే కాదు అప్పుడప్పుడూ చేస్తూంటాను కూడా. అయితే దాన్ని వండేందుకు నాకు ఒక రోజంతా పడుతుంది. అందుకే ఎప్పుడైనా ఒకసారి మాత్రమే చేస్తా. దాంతోపాటు మిఠాయిలు అన్నా ఇష్టమే. ముఖ్యంగా పేస్ట్రీలు ఎక్కువగా తింటుంటా.

అన్నీ లెక్క ప్రకారమే...

ఫీసులో నేను ఛైర్మన్‌ అయితే... ఇంట్లో మాత్రం ఐటీ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తా. అంటే... మా పిల్లలు టీవీలో చూసే కార్యక్రమాలూ, కంప్యూటరులో ఆడే వీడియోగేమ్‌లూ, వారంలో ఎన్ని సినిమాలు చూస్తున్నారూ... ఇలా అన్నింటినీ వేయికళ్లతో గమనిస్తా. వాటికి సంబంధించిన రిపోర్టులు కూడా ఎప్పటికప్పుడు తెప్పించుకుంటా. ఈ విషయం పిల్లలకూ తెలుసు. మా ఇంట్లో టీవీ, కంప్యూటరు... ఏదయినా సరే గంటల తరబడి చూడ్డానికి వీల్లేదు. ఇక, నేను ఆఫీసు నుంచి ఇంట్లోకి అడుగుపెట్టానంటే పిల్లలకు ఓ సగటు నాన్నలానే ఉంటా. వాళ్ల చదువుల్లో సాయం చేయడం, అందరం కూర్చుని భోంచేయడం... ఇలా ఎన్నో ఉంటాయి. నేను పెద్దగా మాట్లాడను కానీ పిల్లలు చెప్పేవన్నీ ఓపిగ్గా వింటా. అప్పుడే వాళ్ల ఆలోచనలు నాకు తెలుస్తాయని నా నమ్మకం.

ఖాళీ దొరికితే

పుస్తకాలు చదువుతా. ‘ద గ్రేట్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’, ‘డీప్‌ లెర్నింగ్‌’, ‘ద బాయ్స్‌ ఇన్‌ ద బోట్‌’... వంటివెన్నో చదివా. పుస్తక పఠనాన్ని నాన్న అలవాటు చేశారు. పుస్తకాలు కాకపోతే ఏదో ఒక అంశంలో ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకునేందుకు ప్రయత్నిస్తా తప్ప సమయాన్ని వృథాచేయను. జీవితాంతం నన్ను నేను నిత్య విద్యార్థిగానే ఊహించుకుంటా.


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని