పిల్లల సంతోషానికి మనమేం చేద్దాం
close
Published : 07/12/2021 00:50 IST

పిల్లల సంతోషానికి మనమేం చేద్దాం!

చిన్నారుల్లో ఒత్తిడి! మార్కులు రాలేదనో, కోరింది దక్కలేదనో ఆత్మహత్యలు.. ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఏ తల్లికైనా భయమూ, కంగారే! వాళ్ల సంతోషం, భవిష్యత్తు కోసమే తాపత్రయపడతాం. కానీ వాటిని సరిగానే చేస్తున్నామా అన్నది ప్రశ్న. ఇటీవల యునిసెఫ్‌.. 41 దేశాల్లో పిల్లల సంతోషంపై సర్వే చేసింది. అందులో తొలి మూడు స్థానాల్లో నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌, నార్వే ఉన్నాయి. ఆ దేశాల్లో పిల్లల్ని ఎలా చూస్తున్నారో తెలిస్తే... ఒత్తిడి, భయం, ఆందోళనలు లేని కొత్త తరాల్ని మనమూ తయారు చేసుకోగలమేమో!

భావోద్వేగాల బోధన : డెన్మార్క్‌

ప్లే స్కూలు స్థాయి నుంచే దయ, భయం, కోపం, బాధ, దుఃఖం, హాస్యం వంటి భావోద్వేగాలను పిల్లలకు బోధిస్తారు. 1993 నుంచి పాఠశాలల్లో ఎంపతీ క్లాస్‌ తప్పనిసరి చేశారు. ‘క్యాట్‌ కిట్‌’లనే బొమ్మల కార్డుల ద్వారా చిన్నారులు తమ అనుభవాలు, ఆలోచనలు, అభిరుచులను పంచుకునేలా చేస్తారు. ‘మై సర్కిల్‌’లో భాగంగా పిల్లలతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, పరిచయం ఉన్నవారి బొమ్మలు వేయించి, వారి గురించి చెప్పిస్తారు. ఇలా ఇతరుల గురించి తెలుసుకోవడం, వారిని అర్థం చేసుకొని నడుచుకోవడం వంటి నైపుణ్యాలను పెంచుతున్నారు. ఎదుటివారి కోణం నుంచి ఆలోచించడం, చెప్పేది వినడం వంటి లక్షణాలు నేర్పిస్తారు. బెదిరింపు, హేళన, చులకనలపై ఎనిమిదేళ్ల వయసు నుంచే అవగాహన కలిగిస్తారు. దాంతో ప్రతి పిల్లాడూ ఇతరులను గౌరవించడం, ప్రేమగా ఉండటం అలవరుచుకుంటాడు. చిన్నప్పటి నుంచే సమస్యలను తోటివారితో పంచుకోవడం, పరిష్కరించుకోవడాన్నీ తరగతిలోనే నేర్పుతారు. క్రీడలకు ప్రాధాన్యమెక్కువ. ఫలితమే ఎక్కువ క్రీడామైదానాలు, పార్కులు. తరగతిలో పోటీతత్వం, పోటీపరీక్షలు, లింగవివక్ష ఉండవు. తెలివైన విద్యార్థులు వెనుకబడిన వారికి పాఠాలు చెబుతారు. 10 ఏళ్ల నుంచే పాఠశాలకు అందరూ బస్‌, రైలెక్కి ఒంటరిగానే ప్రయాణించి చేరుకుంటారు.

క్రీడలకు పెద్దపీట: నార్వే

చిన్నప్పటి నుంచే కుటుంబ విలువలు తెలిపే విద్యావిధానంతోపాటు సంప్రదాయాలనూ బోధిస్తారు. బాల్యం నుంచి హక్కులను పొందేలా ప్రభుత్వ విధానాలుంటాయి. పాఠశాలల్లో క్రీడలకే ప్రాధాన్యం. బయట కూడా పార్కులు, ప్లేగ్రౌండ్లు చాలా ఉంటాయి. విద్య, ఆరోగ్యం వంటివన్నీ ఉచితం. లక్ష్యాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. చిన్నారులు ఏ రకమైన హింసకు గురవుతున్నా, అభద్రతతో ఉన్నా వారి సంరక్షణను ప్రభుత్వమే తీసుకుంటుంది. పిల్లలకు జలుబు చేసినా అమ్మానాన్న సెలవు తీసుకుని మరీ సంరక్షిస్తారు. తమ సెలవుల్ని ఎక్కడ గడపాలన్న నిర్ణయాన్నీ పిల్లలకే వదిలేస్తారు.

* జపాన్‌లో ప్రాథమిక స్థాయి నుంచే ఆహారంపై అవగాహన కల్పిస్తారు. మధ్యాహ్న భోజన పథకం కింద స్కూళ్లలో దాదాపు 600 కెలోరీల పోషకాహారాన్ని అందిస్తారు. తయారీ, వడ్డన... అన్నింట్లో పిల్లలు  భాగస్వాములవుతారు. వడ్డనా తరగతి గదుల్లోనే.

ఫిన్లాండ్‌లో పిల్లలకు ‘క్యాండీ డే’ పేరిట వారానికోసారి మాత్రమే చాక్లెట్లు కొనిస్తారు. దీంతో తీపి కారణంగా చిన్నారులు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.

* స్పెయిన్‌ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి 2.30- 3 గం. విరామం ఉంటుంది. అలా ఇంటికెళ్లి కుటుంబంతో కలిసి భోజనం చేసి, వాళ్లతో గడిపి వచ్చే అవకాశమిస్తారు.

కుటుంబానికి ప్రాధాన్యం: నెదర్లాండ్స్‌

పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తారు. ఆలోచనలు పంచుకునేలా ప్రోత్సహిస్తారు. వాళ్ల సందేహాలను ఓపిగ్గా తీరుస్తారు, సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తారు. లైంగిక అంశాలపై సందేహాలొచ్చినా అమ్మానాన్నల్ని అడిగి తెలుసుకునే స్వేచ్ఛ ఉంది. దీంతో వారికి, పిల్లలకు మధ్య అపార్థాలు, సమస్యలకు తావు లేదు. చిన్నారుల అవసరాలను తెలుసుకుని, వాటిని అందిస్తుండటంతో ఇరువురి మధ్యా ప్రేమ పెరిగి శాశ్వత బంధం ఏర్పడుతోంది.

* కుటుంబానికి ప్రాధాన్యమివ్వాలని చిన్నప్పటి నుంచే నేర్పుతారు. ఇంట్లో వాళ్లంతా రోజూ ఒక్కసారైనా కలిసి భోజనం చేయడం, ఒత్తిడిలో ఉన్నా రోజూ పిల్లలకు కొంత సమయం కేటాయించడం వంటివి తప్పక పాటిస్తారు. పిల్లల పెంపకం భార్యాభర్తల సమాన బాధ్యతగా భావిస్తారు. తద్వారా చిన్నారులకు సానుకూలత, బాధ్యతలను తెలిసేలా చేస్తారు. పాఠశాలల్లో పోటీతత్వం ఉండదు. తల్లిదండ్రులూ ఇతరులతో పోల్చరు. వ్యక్తిగత విజయానికే పెద్దపీట వేస్తారు. దాంతో వీరిలో సృజనాత్మకత, ఆత్మస్థైర్యం పెరిగి నచ్చిన మార్గాన్ని స్వేచ్ఛగా ఎంచుకోగలుగుతున్నారు.


Advertisement

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి