కష్టాలకు ‘పంచ్‌’ విసురుతోంది!

అమ్మాయిగా పుట్టడమే శాపమైంది. కన్నతండ్రి ఈసడింపులు.. ఇంట్లోవాళ్ల నుంచే ఎన్నో అవమానాలు. వాటి నుంచే రాటుదేలి.. పోరాట విద్యలో నైపుణ్యం సాధించింది. కెటెల్‌బెల్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతైంది. ఆ స్ఫూర్తికెరటమే ఇంద్రాణి తపతి. కష్టాల కొలిమి నుంచి

Updated : 03 Feb 2022 05:04 IST

అమ్మాయిగా పుట్టడమే శాపమైంది. కన్నతండ్రి ఈసడింపులు.. ఇంట్లోవాళ్ల నుంచే ఎన్నో అవమానాలు. వాటి నుంచే రాటుదేలి.. పోరాట విద్యలో నైపుణ్యం సాధించింది. కెటెల్‌బెల్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతైంది. ఆ స్ఫూర్తికెరటమే ఇంద్రాణి తపతి. కష్టాల కొలిమి నుంచి విజయతీరాలకు చేరిన వైనం ఆమె మాటల్లోనే..

మాది అస్సాం. రాచరిక మూలాలున్న పురుషాధిక్య కుటుంబం. అబ్బాయి పుడతాడన్న ఆశతో ఉన్న అమ్మానాన్నలకు మూడో అమ్మాయినయ్యా. నాన్నకు నా పుట్టుకే శాపమనిపించింది. దీంతో నన్ను, అమ్మని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. రెండువారాలకు తాతయ్య చనిపోవడంతో ‘నష్టజాతకురాలు’ అనడం మొదలుపెట్టారు. రెండేళ్లకి అమ్మ తమ్ముడికి జన్మనివ్వడం మాకో ఊరట. అయినా నానమ్మ చిన్నచూపు చూడటం మానలేదు. ఆడపిల్లలకు తిండీ దండగేనని ఆహారం దాచిపెట్టేది. కారణం లేకుండా కొట్టేది. వీటన్నింటినీ పంటిబిగువున భరిస్తూ అమ్మ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేది. కొన్నాళ్లకు మా కుటుంబం వేరే పట్టణానికి మారింది. నాన్న దంత వైద్యుడు. పెద్ద కుటుంబం.. దీంతో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులే. ఇన్ని కష్టాలున్నా.. నా ముఖంపై ఎప్పుడూ చిరునవ్వే. అది చూసి అమ్మ మురిసిపోతూ ‘మీరు తనని నష్టజాతకురాలిగా భావిస్తున్నా.. పెద్దయ్యాక మిమ్మల్ని గర్వపడేలా చేసేది తనే’ అనేది. ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే కసి పెంచాయి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌, వ్యాపారం.. చాలా ఆలోచించా. చివరికి ఒక స్థిరాస్తి సంస్థలో ఉద్యోగమొచ్చింది. కానీ సంతృప్తి కలగలేదు. ఆ అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిర్భయ ఘటన జరిగింది. అది నాలో తీవ్ర అలజడి రేపింది. మమ్మల్ని మేం రక్షించుకునేలా అమ్మ.. నన్ను, అక్కల్ని మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకొమంది. స్నేహితురాలి సాయంతో కోర్సులో చేరా. మనసుపెట్టి నేర్చుకునేదాన్ని. నా జీవిత గమ్యం అదేననుకున్నా. కానీ అక్క, తమ్ముడి కెరియర్‌ కోసం కుటుంబం కోల్‌కతాకు మారాల్సి వచ్చింది. నా కలలన్నీ కల్లలయ్యాయనిపించింది. అక్కడ ఉండలేక తిరిగొచ్చా. పాత కోచ్‌తో కలిసి ‘దస్త్‌బీ ఎంఎంఏ’ అకాడెమీ ప్రారంభించా. మొదట్లో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. వచ్చిన కొద్దిమందికే ప్రత్యేక శ్రద్ధతో తర్ఫీదునిచ్చేవాళ్లం. దాంతో వాళ్లూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయేవారు. నోటి ప్రచారంతో మెల్లగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. రెండేళ్లకే మరో శాఖ తెరిచాం. ఐదేళ్లలోనే సంఖ్య నాలుగు వందలు దాటింది. 3 బ్రాంచ్‌లున్నాయి.

ప్రస్తుతం మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణలో దస్త్‌బీ దేశంలోనే పేరున్న బ్రాండ్‌. 2018 నుంచి సొంతంగా కొన్ని ప్రత్యేక పోరాట విన్యాసాలు రూపొందించి ‘వెర్షస్‌ ఛాంపియన్‌షిప్‌’ పేరుతో పోటీ నిర్వహిస్తున్నాం. ఇప్పుడది అంతర్జాతీయ పోటీగా మారింది. కోచ్‌గా తీరిక లేకపోయినా నేనూ బరిలోకి దిగుతా. ఈమధ్యే ‘కెటెల్‌బెల్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌’ విజేతనయ్యా. ఈసడింపుల మధ్యే ఈ స్థాయికొచ్చా. అయినా చేసింది పిసరంతే.. సాధించాల్సింది ఇంకా ఉంది. ఇప్పుడు అమ్మాయిలూ అన్ని రంగాల్లో దూసుకెళ్తూ మగాళ్లకి తీసిపోమని నిరూపిస్తూన్నా.. ఇంకా చులకనగా చూసేవాళ్లు లేకపోలేదు. అలాంటి వాళ్లకి ‘ఆడవాళ్లంటే పని మనుషులు, మీ బాధ్యతలకు కట్టుబడ్డ బందీలు కాదు. వాళ్లకి స్వేచ్ఛనిచ్చి నచ్చింది చేయనివ్వండి. అద్భుతాలు సృష్టిస్తారు’ అని చెబుతా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని