పుట్టకముందే... ఛాంపియన్‌గా నిర్ణయించారు!

15 ఏళ్లకే ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ మాస్టర్‌.. 26 ఏళ్లు మహిళల ప్రపంచ నంబర్‌వన్‌.. పురుష ప్రపంచ ఛాంపియన్లనీ ఓడించారు.. అందుకే హంగేరీకి చెందిన జుడిత్‌ పోల్గర్‌ని చదరంగం చరిత్రలో అత్యుత్తమ క్రీడాకారిణిగా చెబుతారు. ఎందరో అమ్మాయిలు 64 గళ్ల ఆటలో అడుగుపెట్టడానికి స్ఫూర్తి ఆమె. క్రీడాకారిణిగా ఎత్తులు వేయడం ఆపినా... చెస్‌ విస్తృతి కోసం ఇప్పటికీ కృషిచేస్తున్నారు. చెన్నైలో జరుగుతోన్న చెస్‌ ఒలింపియాడ్‌కి వ్యాఖ్యాతగా వచ్చిన పోల్గర్‌ తన ప్రస్థానాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...

Updated : 30 Jul 2022 07:24 IST

15 ఏళ్లకే ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ మాస్టర్‌.. 26 ఏళ్లు మహిళల ప్రపంచ నంబర్‌వన్‌.. పురుష ప్రపంచ ఛాంపియన్లనీ ఓడించారు.. అందుకే హంగేరీకి చెందిన జుడిత్‌ పోల్గర్‌ని చదరంగం చరిత్రలో అత్యుత్తమ క్రీడాకారిణిగా చెబుతారు. ఎందరో అమ్మాయిలు 64 గళ్ల ఆటలో అడుగుపెట్టడానికి స్ఫూర్తి ఆమె. క్రీడాకారిణిగా ఎత్తులు వేయడం ఆపినా... చెస్‌ విస్తృతి కోసం ఇప్పటికీ కృషిచేస్తున్నారు. చెన్నైలో జరుగుతోన్న చెస్‌ ఒలింపియాడ్‌కి వ్యాఖ్యాతగా వచ్చిన పోల్గర్‌ తన ప్రస్థానాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...

నేను అమ్మ కడుపులో పడగానే మేధావి పుట్టబోతోంది, ఛాంపియన్‌ అవుతుందని నిర్ధరించుకున్నారట అమ్మానాన్న. అది వాళ్లపై వాళ్లకున్న నమ్మకం... నా గురించి వాళ్ల కల. ఇద్దరూ టీచర్లే. నాన్న చదరంగంలో ఆరితేరారు. మనస్తత్వ నిపుణులు కూడా.  నాకు ఇద్దరు అక్కలు. వాళ్లకి ఇంట్లోనే కోచ్‌తో చెస్‌లో శిక్షణ ఇప్పించారు. డిస్టర్బ్‌ చేస్తానని నన్నక్కడికి వెళ్లనిచ్చేవారు కాదు. నాకేమో చూడాలన్న ఉత్సుకత. ‘వెళ్లాలంటే చెస్‌ ఆడటం నేర్చుకో’ అనేవారు. దాంతో అయిదేళ్లకే చెస్‌ నేర్చుకున్నా. ఇంట్లోనే సాధన చేసేదాన్ని. బడిలో చేరా కానీ, పరీక్షలకి మాత్రమే వెళ్లేదాన్ని. చెస్‌లో ఆడ, మగ తేడా లేకుండా ఇద్దరికీ కలిపి పోటీలుండేలా మార్పు రావాలని పోరాడే వారు నాన్న. అందులో విజయం సాధించారు కూడా. అవన్నీ చెస్‌పైన నేను మరింత దృష్టిపెట్టేలా చేశాయి. నాన్నే నా శిక్షకుడు. ఆరేళ్లకే టోర్నీల్లో ఆడటం మొదలుపెట్టా. అప్పట్నుంచీ అదే ప్రపంచం, అదే భాష. ఏడేళ్ల వయసులో 15 మంది ప్రత్యర్థులతో ఒకేసారి ఆడి గెలవడం నాకింకా గుర్తే. తొమ్మిదేళ్లకి న్యూయార్క్‌లో అంతర్జాతీయ టోర్నీ ఆడా. పదేళ్లకే ఓ గ్రాండ్‌ మాస్టర్‌ని ఓడించా. 12 ఏళ్లప్పుడు మహిళల టీమ్‌ విభాగంలో చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచా. ప్రత్యర్థి బోర్డ్‌ చూస్తూ, నేను చూడకుండా కూడా ఆడేదాన్ని. 15 ఏళ్లకే గ్రాండ్‌ మాస్టర్‌ హోదా సాధించి పిన్న గ్రాండ్‌ మాస్టర్‌గా బాబీ ఫిషర్‌ రికార్డు తిరగరాశా.


ఐరాస గౌరవం...

మా దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ స్టీఫెన్‌ ఆఫ్‌ హంగేరీ’ని 2015లో అందుకున్నా. చెస్‌లో ఆడపిల్లల ప్రవేశం కోసం నా కృషికి గానూ ఐరాస 2016లో నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడంతోపాటు ‘యూఎన్‌ విమెన్‌ ప్లానెట్‌ 50-50 ఛాంపియన్‌’ బృందంలో స్థానం కల్పించింది.


అసాధ్యమన్నారు...

ఓసారి గేమ్‌లో తలమునకలై ఎప్పుడో పక్కకు చూస్తే చెస్‌ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌.. నా ఆటను గమనిస్తున్నారు. నమ్మలేకపోయా. తర్వాత ఓ ఇంటర్వ్యూలో నా గురించి అడుగుతూ ‘జుడిత్‌ ఎప్పటికైనా మిమ్మల్ని ఓడిస్తుందా, ఓవరాల్‌ ఛాంపియన్‌ అవుతుందా’ అంటే, ‘దాదాపు అసాధ్యం’ అని బదులిచ్చారు. తర్వాత కొన్నాళ్లకు కాస్పరోవ్‌తో మ్యాచ్‌ ఆడే ఛాన్స్‌ వస్తే భయంతోనే ఓడిపోయా. ఇలా మరికొన్ని సార్లూ జరిగింది! ఈ పద్ధతిలో ఆయనపై గెలవలేనని అర్థమై వ్యూహం మార్చి దూకుడుగా ఆడా. ఊహించని ఈ పరిణామానికి కంగుతిన్నారు... ఏకాగ్రత కోసం జాకెట్‌, వాచ్‌ తీసి పక్కన పెట్టారు కాస్పరోవ్‌. కానీ కాసేపటికి ఓటమిని అంగీకరించారు. ఓవరాల్‌గా ప్రపంచ ఛాంపియన్‌ కాలేదు కానీ, ఆ ఘనత సాధించిన 11 మంది మగవాళ్లని ఓడించా. వాళ్లలో విశ్వనాథన్‌ ఆనంద్‌, మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఉన్నారు. ఆడవాళ్లు తక్కువ కాదని నిరూపించడమే నా ఉద్దేశం తప్ప వాళ్ల స్థాయిని తగ్గించడం కాదు. 2014లో రిటైర్మెంట్‌ వరకూ 26 ఏళ్లు మహిళల విభాగంలో నంబర్‌వన్‌గా ఉన్నా. ఓవరాల్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానం వరకూ వెళ్లా. మహిళల్లో ఇప్పటికీ అదే అత్యుత్తమ ర్యాంకు. పట్టుదల, సాధన, ఇష్టం... ఇవే నన్ను ముందుకు నడిపించేవి.

చెస్‌కే అంకితం..

చెస్‌లో ఆడపిల్లలకి నేనిచ్చే స్ఫూర్తి ఎప్పటికీ ఉండాలనుకున్నా. పిల్లలకు మెలకువలు చెబుతూ పుస్తకాలు రాశా. 2012లోనే ‘జుడిత్‌ పోల్గర్‌ చెస్‌ ఫౌండేషన్‌’ స్థాపించా. చెస్‌ ఆట మాత్రమే కాదు, దీంతో మల్టీ టాస్కింగ్‌, జీవన నైపుణ్యాలు, నిర్ణయ శక్తి, సమస్యని పరిష్కరించడం... నేర్చుకోవచ్చు. అందుకే చెస్‌తో ముడిపెట్టి రెండు విద్యా కోర్సుల్ని డిజైన్‌ చేశా. హంగేరీలో వీటికి మంచి ఆదరణ ఉంది. ఏటా బుడాపెస్ట్‌లో ‘గ్లోబల్‌ చెస్‌ ఫెస్టివల్‌’ నిర్వహిస్తా. ‘నాకు మీరే స్ఫూర్తి’ అని అమ్మాయిలెవరైనా చెబుతుంటే చాలా గర్వంగా ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో చెస్‌ ఆటగాడు, వెటర్నరీ సర్జన్‌ అయిన నా భర్త గుస్తవ్‌, మా ఇద్దరు పిల్లల సహకారమూ ఉంది. కొన్నాళ్లు హంగేరీ కోచ్‌గా ఉన్నా. ప్రస్తుతం ఫిడే టోర్నీలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా. భారత్‌లో చెస్‌కు ఆదరణ చాలా బాగుంది. ఈ నేల మీద నుంచి మరింత మంది మహిళా చెస్‌ ఛాంపియన్లు రావాలని కోరుకుంటున్నా.

- హిదాయ్‌తుల్లాహ్‌.బి, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్