Updated : 21/10/2021 04:54 IST

ఒక సిలిండర్‌.. రెట్టింపు వంట

వంటకి దాదాపుగా ప్రతి ఇంట్లోనూ వాడేది గ్యాసే. దాని ధరేమోపెరుగుతూ పోతోంది. ఇది ఇల్లాలి బడ్జెట్‌కి ఇబ్బందికర విషయమే! మరి ఇప్పుడేంటి దారి? ఖర్చులు పెరిగాయనుకోండి ఏం చేస్తాం? ఆదాపై దృష్టి పెడతాం. అవునా! గ్యాసు విషయంలోనూ ఇదే పద్ధతి అనుసరించాలి. అదెలాగో చదివేయండి.

వంటకు ముందు

రెగ్యులేటర్‌, పైప్‌, బర్నర్‌ల దగ్గర చిన్న చిన్న లీకేజీలు సాధారణమే. నిశితంగా పరిశీలిస్తే తప్ప వీటిని గుర్తించడం కష్టం. కాబట్టి దీన్నో నిరంతర ప్రక్రియలా చేయాలి. స్టవ్‌ బర్నర్‌ను తరచూ శుభ్రం చేయాలి. రోజూ సాధ్యం కాదనుకుంటే... స్టవ్‌ ఇచ్చే సూచనలు గమనిస్తే సరి. మంట నీలం రంగులో ఉంటే.. గ్యాస్‌ సరిగా వినియోగమవుతున్నట్టు లెక్క. ఎరుపు, పసుపు, నారింజ రంగుల్లో వస్తోందంటే.. పూర్తిగా వినియోగమవ్వట్లేదు, వృథా అవుతోందని. అప్పుడు తప్పక క్లీన్‌ చేయాలి.

చాలామంది వంటకు ముందు పాత్రలను కడుగుతారు. దుమ్ము, సూక్ష్మజీవులు పోతాయనేది ఉద్దేశం. మంచిదే.. కానీ నీరు కారుతున్న దాన్ని అలాగే పొయ్యి మీద పెట్టేయకండి. కొంత ఇంధనం ఆ నీరు పోగొట్టడానికే ఖర్చవుతుంది. కాసేపటికే ఏమవుతుందనిపించినా పలు మార్లు, రోజులు ఇలాగే చేస్తే అయ్యే వృథాని కలిపి చూడండి. మీకే అర్థమవుతుంది. కాబట్టి, పాత్రను పూర్తిగా తుడిచాకే పొయ్యి మీద పెట్టండి.
బర్నర్‌ను పూర్తిగా కప్పి ఉంచే పాత్రలనే ఎంచుకోవాలి. లేదంటే పక్కల నుంచి గ్యాస్‌ వేస్ట్‌ అవుతుంది. మనకు ఉపయోగపడకపోయినా వృథా కింద లెక్కే కదా! పైగా వెడల్పాటి గిన్నెలు త్వరగా ఉడకడానికీ సాయపడతాయి.

కొన్ని పప్పులు ఉడకడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. బియ్యం, పప్పులను కొన్ని గంటల ముందే నానబెట్టేసుకుంటే త్వరగా ఉడుకుతాయి. గ్యాసూ ఆదా. కుక్కర్‌లో ఏవైనా త్వరగా ఉడుకుతాయన్నది మనందరికీ తెలిసిందే. అన్ని కూరలనూ దీనిలో ప్రయత్నించి చూడండి. కాస్త సమయంపై పట్టు సాధిస్తే చాలు. తక్కువ సమయంలో వంటా సిద్ధం, గ్యాసు వాడకమూ దీనికి తక్కువే. అలాగే రోజూ భిన్న రకాల కూరలను వండటం తగ్గించడం మంచిది. ఒక వేళ చేసినా.. రోజు మొత్తానికి రెండో, మూడో ఒకేసారి వండేయాలి. ఇదీ పొదుపు మార్గమే.

చేసేప్పుడు...

* పాత్ర వేడయ్యేంత వరకూ ఎక్కువ మంట పెట్టినా, తర్వాత సిమ్‌లోకి మార్చేయాలి. దీనివల్ల పోషకాలు పదిలంగా ఉండటంతోపాటు గ్యాసు వాడకమూ తగ్గుతుంది. అలాగే కలపడం పూర్తయిన వెంటనే మూత పెట్టేయండి. వేడి లోపలే ఉండిపోయి, పదార్థాలు త్వరగా మగ్గుతాయి.

* వాడే కూరగాయలు, తయారీ విధానాన్ని బట్టి వండే సమయాల్లో మార్పులుంటాయి. కొన్నిసార్లు సరిగా గమనించకపోవడం వల్ల మెత్తగా అయిపోవడమో, మాడిపోవడమో జరుగుతుంటుంది. వంటకం రుచి కోల్పోవడంతోపాటు గ్యాసూ వృథా. కాబట్టి, ఈ సమయాలను గమనించుకోండి. ఒకవేళ మర్చిపోతున్నామనుకుంటే అలారమైనా పెట్టుకోవాలి. అలాగే ఒక్కోసారి రెండు, మూడు నిమిషాల్లో వంటకం పూర్తవుతుందనిపించినపుడు పొయ్యి ఆర్పేయొచ్చు. పాత్ర వేడి అది పూర్తవడానికి సరిపోతుంది.

* ఇంట్లోవాళ్లకి ఎంత సరిపోతుందో సరిగ్గా కొలత వేసుకున్నాకే వంట చేయండి. మిగిలితే వేడి చేస్తుంటాం లేదా పడేస్తుంటాం. రెండూ వృథానే.

* ఫ్రిజ్‌లోని ఆకుకూరలు, పాలు వగైరా నేరుగా పొయ్యి మీదకి పంపేయకండి. గ్యాస్‌ ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా.. కూరలు, టీ వగైరా వాటికి ఎక్కువ సార్లు వేడినీరు అవసరమవుతోందనుకుంటే వాటిని ఒకేసారి కాగబెట్టి ప్లాస్క్‌లో పోసి ఉంచుకోవడం మంచి అలవాటు.

* చివరగా.. ఒక్కొక్కరికీ ఒక్కోసారిలా కాకుండా అందరూ కలిసి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. పదే పదే వేడిచేసే బాధ తప్పడంతోపాటు అందరి మధ్యా ప్రేమా పెరుగుతుంది.
మనలో చాలామందికి వంట చేస్తూ కావాల్సిన సామగ్రిని చూసుకునే అలవాటు ఉంటుంది. పొరబాటున అది సమయానికి దొరక్క కూర మాడిపోవడమో లేదా పొయ్యి కట్టేయడమో చేస్తుంటాం. రెండూ ఇంధన వృథానే. మాడితే తిరిగి మొదలు పెట్టాలి. మంట తీసేసినా.. తిరిగి వెలిగించేటపుడు ఎంతో కొంత గ్యాస్‌ వేస్ట్‌. కాబట్టి, వంట మొదలుపెట్టాక కూరగాయలు కోయడం, మిక్సీలు పట్టడం వంటివొద్దు. అన్నీ సిద్ధం చేసుకున్నాకే మొదలుపెట్టండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని