ఇలాగైతే.. ముందుకెళ్లేదెలా?

చిన్న స్టార్టప్‌లో మేనేజర్‌ని. ప్రస్తుతం ఆఫీస్‌లో హైబ్రిడ్‌ విధానం అమల్లో ఉంది. వారంలో నచ్చిన మూడు రోజులు ఆఫీసులో పనిచేయాలి. మిగతా రెండ్రోజులు ఇంటి నుంచి చేయొచ్చు. ఇక్కడ నాకు చిరాకు కలిగించే విషయమేంటంటే.. చాలామంది ప్రణాళికంటూ లేకుండా తమకు నచ్చిన రోజుల్లో ఆఫీసుకు వస్తున్నారు. వ్యాక్సినేషన్‌, కొవిడ్‌కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్లలో మార్పు రావట్లేదు.

Published : 11 May 2022 01:23 IST

చిన్న స్టార్టప్‌లో మేనేజర్‌ని. ప్రస్తుతం ఆఫీస్‌లో హైబ్రిడ్‌ విధానం అమల్లో ఉంది. వారంలో నచ్చిన మూడు రోజులు ఆఫీసులో పనిచేయాలి. మిగతా రెండ్రోజులు ఇంటి నుంచి చేయొచ్చు. ఇక్కడ నాకు చిరాకు కలిగించే విషయమేంటంటే.. చాలామంది ప్రణాళికంటూ లేకుండా తమకు నచ్చిన రోజుల్లో ఆఫీసుకు వస్తున్నారు. వ్యాక్సినేషన్‌, కొవిడ్‌కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్లలో మార్పు రావట్లేదు. దీంతో పనీ సమయానికి పూర్తవట్లేదు. ఆఫీసు వాతావరణం.. నెట్‌వర్కింగ్‌కీ, బృందంతోపనిచేయడానికీ దొరికే అవకాశం కదా! అది వారికి అర్థం కావడం లేదెందుకు? ఇలాగైతే కెరియర్‌లో ముందుకెళ్లేదెలా? నేనేం చేయను?

- స్వప్నిక


ఫీసుకు వచ్చి పనిచేసే సంప్రదాయం చాలా సంస్థల్లో కనుమరుగైంది. విహారాలు, ట్రెకింగ్‌ చేస్తూ కూడా పని చేసేయొచ్చన్న విషయం అందరికీ అర్థమైంది. కాబట్టి, ముందు మీరు అందరిదీ ఒకే పరిస్థితి కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. భార్యభర్తలిద్దరూ కలిసి ఇల్లు, పిల్లల పనులు పంచుకుంటున్న వారెందరో! మీకా పరిస్థితి ఇంకా లేదనిపిస్తోంది. పైగా కొవిడ్‌ పూర్తిగా తొలగిపోలేదు. వ్యాక్సినేషన్‌ వేయని పిల్లలు ఇంట్లో ఉంటే.. బయటికి వెళ్లి వాళ్లకు ఎక్కడ ముప్పు తెస్తామోనని ఆలోచించేవారూ లేకపోలేదు. అందుకే చాలామంది ఇప్పటికీ సంకోచిస్తున్నారు. గతంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉనికే లేదు. ఇప్పుడేమో పూర్తిగా ఇంటి నుంచే చేస్తామంటున్నారు. రెండూ ఆరోగ్యకరమైన పరిస్థితులు కావు. హైబ్రిడ్‌ మంచి ఆలోచనే కానీ ఈ విధానానికీ అలవాటు పడటానికి ఇంకా కొంత సమయం పడుతుంది. పైగా చాలామంది కుటుంబం, స్నేహితులతో కలిసే అవకాశమెక్కువ. కాబట్టి ఇంటి నుంచి ప్రశాంతంగా పనిచేయొచ్చన్న ఆలోచనలోనూ ఉన్నారు. కాబట్టి దీనికే మొగ్గు చూపుతున్నారు.
ఆఫీసు నుంచి చేసే పనితో బృంద పని, నెట్‌వర్కింగ్‌, పక్కా ప్రణాళిక వంటివి సాధ్యం. నిజమే.. అయితే పూర్తిగా ఇదే విధానం ఉండాలనుకోవడం కొంత స్వార్థమే అవుతుంది. మీకు తప్పనిసరి అనిపించిన వాళ్లని ఫలానా రోజు రమ్మని చెప్పండి. మిగతారోజులు వాళ్లకు అనుగుణంగా ఎంచుకోనిస్తే సరిపోతుంది. మేనేజర్‌గా ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాబట్టి, కిందివాళ్ల భావనల్నీ పరిగణనలోకి తీసుకోవాలి. కొవిడ్‌ మనకు నేర్పిందీ అదే కదా! క్లిష్ట సమయాల్లో సహానుభూతి చూపడం, ఓపికతో ఉండటం. పరిస్థితిలో మార్పు వచ్చే వరకూ కాస్త ఓపికతో ఉండండి. దీంతోపాటు ఇతరుల అభిప్రాయాలనూ తెలుసుకోండి. తోటివారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవడమూ ముందుకు సాగడానికి సోపానాలే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్