యువతరంతో సాగేదెలా?

ఫార్మాస్యూటికల్‌ సంస్థలో సీనియర్‌ మేనేజర్‌ని. కొత్తగా చేరినవారికి, ఇంటర్న్‌లకి మెంటార్‌గానూ వ్యవహరిస్తుంటా. నా మెంటార్‌ వల్ల నేను లాభపడ్డా. నా ఆధ్వర్యంలోని యువతరానికీ అలాగే సాయపడాలనుకుంటా. అయితే చాలాసార్లు వారిని ఎలా అర్థం చేసుకోవాలో, వారితో ఎలా వ్యవహరించాలో తెలీడం లేదు.

Published : 04 Aug 2022 18:19 IST

ఫార్మాస్యూటికల్‌ సంస్థలో సీనియర్‌ మేనేజర్‌ని. కొత్తగా చేరినవారికి, ఇంటర్న్‌లకి మెంటార్‌గానూ వ్యవహరిస్తుంటా. నా మెంటార్‌ వల్ల నేను లాభపడ్డా. నా ఆధ్వర్యంలోని యువతరానికీ అలాగే సాయపడాలనుకుంటా. అయితే చాలాసార్లు వారిని ఎలా అర్థం చేసుకోవాలో, వారితో ఎలా వ్యవహరించాలో తెలీడం లేదు.

- నర్మద, ముంబయి

ప్రతి తరానికీ వచ్చే ఇబ్బందే ఇది. యువతతో కలిసి పనిచేయాలన్నా, వారిపై మీ ప్రభావం పడాలన్నా వాళ్లకి ఉత్సాహం కలిగించే అంశాలేంటో కనుక్కోండి. వాళ్ల తీరు, ఆలోచనలు జడ్జ్‌ చేయక.. కలిసిపోయే మార్గాలను అన్వేషించాలి. 1981-1996 మధ్య పుట్టినవారిని మిలీనియల్స్‌గా పిలుస్తున్నారు. వీరి సంఖ్య 8.3 కోట్లకు పైమాటే! నమ్మకాన్ని చూరగొనాలంటే వీళ్ల ప్రత్యేక మనస్తత్వాల్ని అంగీకరించడం, పదును పెట్టడమే మార్గం. వాళ్ల కనీస అవసరాలను అందుకోలేకపోయినా, పని వాతావరణం నచ్చకపోయినా సంస్థ మారిపోతారు. కాబట్టి..

* సాంకేతికతతో పుట్టిన తరమిది. ఫోన్లు, నేరుగా మాట్లాడటం కంటే ఈమెయిల్‌, మెసేజ్‌లకు ప్రాధాన్యమిస్తారు. కొత్త టెక్నాలజీ, యాప్‌లను ప్రయత్నించడానికి ఇష్టపడతారు. పనిచేసే సంస్థలూ వీటిని స్వాగతించాలనుకుంటారు.

* వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌కే వీరి మొగ్గు. పెద్ద మొత్తంలో జీతం కంటే నచ్చిన వేళల్లో పనిచేయడం, కుటుంబం, స్నేహితులతో గడపడానికి విలువనిస్తారు.

* ఒంటరిగా సాగుదామనే తత్వం కాదు వీరిది. ఇతరులు, వివిధ డిపార్ట్‌మెంట్లతో పనిచేయడానికి ఇష్టపడతారు. ఇంటి నుంచి పనిచేసినా బృందంతో భాగస్వాములవ్వడానికే వీరి ఓటు.

* తమ అభిప్రాయాలకీ విలువనిచ్చే కుటుంబ వాతావరణంలో పెరిగారు. ఆఫీసులోనూ హోదాతో సంబంధం లేకుండా ఇదే హక్కును కోరుకుంటారు. వాళ్ల సలహాలకీ విలువనివ్వడం, మర్యాద ఆశిస్తారు. కొత్తగా అనిపించినా సర్దుకుపోవాల్సిందే. చేయాల్సిన పని, పాటించాల్సిన నిబంధనలు చెప్పండి.. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ఎంత కష్టమైనా పడతారు.

* డిగ్రీ పట్టా చేతికొస్తే చాలనుకోరు. నిరంతరం నేర్చుకోవాలి.. కెరియర్‌లో ఎదగాలన్న కోరిక ఎక్కువ. అవకాశాలకు తగ్గట్టుగా నేర్చుకోవడం, మెంటార్ల సాయం కోరడం చేస్తారు. వీటిని అందించే సంస్థల్లో చేరడానికే మొగ్గు చూపుతారు. వాళ్లని నడిపించే క్రమంలో ఈ అంశాలపై దృష్టిపెట్టండి చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్