రింగులు కుట్టిస్తే.. ఇలాగైంది

ముక్కు పుడక, చెవి దిద్దులకు పైన రింగులు కుట్టించుకున్నా. కొద్దిరోజులకు పక్కన కండపైకి పెరిగి గుండ్రంగా వచ్చాయి.

Published : 18 Jun 2023 00:15 IST

ముక్కు పుడక, చెవి దిద్దులకు పైన రింగులు కుట్టించుకున్నా. కొద్దిరోజులకు పక్కన కండపైకి పెరిగి గుండ్రంగా వచ్చాయి. ఏమిటివి? వాటిని పోగొట్టుకునేదెలా? సర్జరీ చేయించుకోవాలా?

- ఓ సోదరి

వీటిని కిలాయిడ్స్‌ అంటాం. ముక్కు పుడక, చెవులు కుట్టించుకున్నప్పుడు వాటి పక్కన కండలా ఏర్పడతాయి. ఆ ప్రదేశాల్లో కార్టిలేజ్‌ (మృదులాస్థి) ఎక్కువగా ఉంటుంది. ఇదొక రకమైన కణజాలం. దీనికి రక్తప్రసరణ జరగదు. కాబట్టి, చిన్న గాయమైనా త్వరగా మానదు. ఇన్ఫెక్షన్లకీ ఆస్కారమెక్కువ. అందుకే దానిమీద పడకుండా జాగ్రత్తగా కుట్టించుకోవాలి. ముందుగానే శుభ్రమైన ప్రదేశమేనా.. అనుభవముందా.. సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనేది గమనించుకోవాలి. కుట్టేవాళ్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. చీము పట్టి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కొందరు నెమ్మదిగా తగ్గుతుందిలెమ్మని వదిలేస్తారు. పోనుపోనూ అవి గట్టిపడి ఇలా కండలా తయారవుతాయి. గుర్తించగానే లోకల్‌ స్టెరాయిడ్‌ క్రీములు, ఇంజెక్షన్లు వాడితే సమస్య ఉండదు. ఆలస్యమైతే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. టాపికల్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి నొప్పి తెలియకుండా ఈ కండను తొలగిస్తారు. కుట్లు మానాక కంప్రెషన్‌ డ్రెస్సింగ్‌, తిరిగి రాకుండా కంప్రెషన్‌ ఇయర్‌ స్టడ్స్‌ను ఇస్తాం. కుట్టించుకునేప్పుడే శుభ్రత గురించి గమనించుకుంటే ఇలాంటి సమస్యలుండవు. ఇప్పటికే ముదిరాయి అంటున్నారు కాబట్టి, ఓసారి వైద్య నిపుణుల్ని కలవండి. వారు చూసి మందులతో తగ్గించుకోవచ్చా లేదా శస్త్రచికిత్స అవసరమా అన్నది నిర్ణయిస్తారు. మచ్చలు పడకుండా, తిరిగి రాకుండానూ జాగ్రత్తలు చెబుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్