ఆ బాధను మర్చిపోలేకపోతున్నా..

నేను కొన్ని పరిస్థితుల వల్ల చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరంగా పెరగాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. అంతా బాగానే ఉంది. కానీ ఒక్కోసారి నేను కోల్పోయిన బాల్యం, తల్లిదండ్రుల ప్రేమ అన్నీ గుర్తొచ్చి చాలా బాధేస్తుంది.

Published : 11 Dec 2023 01:20 IST

నేను కొన్ని పరిస్థితుల వల్ల చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరంగా పెరగాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. అంతా బాగానే ఉంది. కానీ ఒక్కోసారి నేను కోల్పోయిన బాల్యం, తల్లిదండ్రుల ప్రేమ అన్నీ గుర్తొచ్చి చాలా బాధేస్తుంది. ఏదో కోల్పోయిన భావన కలుగుతోంది. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. ఆ బాధను మర్చిపోవడమెలా?

ఓ సోదరి

తల్లిదండ్రులను కోల్పోవటం లేదా విడిపోవటం వల్ల గానీ, వాళ్లు విదేశాల్లో ఉండటం లేదా చదువుల కోసమో కొంతమంది పిల్లలు బంధువుల దగ్గర పెరగాల్సి రావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో అయినవాళ్లు మంచివాళ్లైతే ప్రేమ, ఆదరణల మధ్య పెరుగుతారు. దీంతో అమ్మానాన్నలకు దూరంగా ఉన్నారన్న వెలితి ఉండదు. దురదృష్టవశాత్తూ ఆ బాధ్యత వాళ్లకి ఒత్తిడిగా అనిపిస్తే, వాళ్లు కఠినంగా వ్యవహరించొచ్చు. అప్పుడు ప్రేమ, ఆదరణ కరవై, వాళ్ల మధ్య ఇమడలేక.. వాళ్ల పరిస్థితులకు అనుగుణంగా మెలగలేక మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. మీ విషయంలో అలాగే జరిగి     ఉండొచ్చు. అందుకే వెనక్కి చూసినప్పుడు ఇలా వెలితిగా అనిపించడం, దుఃఖం వగైరా! ఈ పరిస్థితిని ‘చైల్డ్‌హుడ్‌ అడ్వర్సిటీస్‌’ అంటారు. చిన్న వయసులో మనసుకి కష్టం కలిగించేవి ఏమైనా జరిగితే అవి మనసులో నాటుకుపోతాయి. పెద్దయినా పోవు. పైగా గుర్తొచ్చినప్పుడల్లా మనసుకు బాధ కలుగుతుంది. మీకు పెళ్లై ఇప్పుడంతా బావుంది అంటున్నారు. వాటి గురించి ఆలోచించకండి. మీరు బంధువుల దగ్గరైనా పెరగగలిగారు. కొంతమందికి ఆ అవకాశం కూడా ఉండదు. అనాథాశ్రమాల్లో పెరగాల్సి వస్తుంది. కొంత అసంతృప్తి, అసౌకర్యం ఉన్నప్పటికీ ఇప్పుడు ఆనందంగానే ఉన్నారు. కాబట్టి.. జరిగిపోయిన దాన్ని పదే పదే గుర్తు చేసుకోవద్దు. బదులుగా ప్రస్తుత మీ అదృష్టం గురించి ఆలోచించుకోండి. మనసు మళ్లడం లేదనిపిస్తే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వీలైన సాయం చేయండి. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మీరు కోల్పోయిన ప్రేమ, ఆదరణను మీ పిల్లలకు అందివ్వండి. అప్పుడీ బాధకు చోటుండదు. కాబట్టి జీవితంలో పోయిన వాటి గురించి కాదు.. వర్తమానంపై దృష్టిపెట్టండి. భవిష్యత్తును అందంగా మలుచుకోండి. ఒంటరితనంగా అనిపిస్తే నచ్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఏదో ఒక వ్యాపకాన్ని అలవరచుకోండి. క్రమంగా సాంత్వన కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్