అరవైలోనూ తగ్గని గ్లామర్.. అందుకే ఈ అందాల కిరీటం!

వయసు పెరిగే కొద్దీ అందమే కాదు.. ఆత్మవిశ్వాసమూ తగ్గిపోతుంటుంది చాలామంది మహిళల్లో! కానీ వయసుతో పాటు ఈ రెండింటినీ పెంచుకుంటూ పోయే వారు అరుదుగా కనిపిస్తుంటారు. వారిలో అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

Updated : 27 Apr 2024 21:28 IST

(Photos: Instagram)

వయసు పెరిగే కొద్దీ అందమే కాదు.. ఆత్మవిశ్వాసమూ తగ్గిపోతుంటుంది చాలామంది మహిళల్లో! కానీ వయసుతో పాటు ఈ రెండింటినీ పెంచుకుంటూ పోయే వారు అరుదుగా కనిపిస్తుంటారు. వారిలో అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరు పదుల వయసులో తన గ్లామరస్‌ లుక్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తోన్న ఆమె.. ఇటీవలే ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌’ అనే అందాల పోటీల్లో పాల్గొంది. ఇందులో పోటీపడడమే కాదు.. నిండైన ఆత్మవిశ్వాసంతో అందాల కిరీటమూ చేజిక్కించుకుంది. తద్వారా 60 ఏళ్ల వయసులో అందాల కిరీటం గెలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఇలా తన విజయంతో అందానికి సరికొత్త నిర్వచనమిచ్చిన అలెజాండ్రా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

అందాల పోటీల తీరుతెన్నులు క్రమంగా మారుతున్నాయి. మొన్నటిదాకా 18-28 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకే ఈ పోటీల్లో పాల్గొనే అవకాశమిచ్చిన మిస్‌ యూనివర్స్‌ సంస్థ.. గతేడాది నుంచీ ఈ నియమనిబంధనలన్నీ సడలించింది. 18 ఏళ్లు పైబడిన వారెవరైనా ఈ పోటీల్లో పాల్గొనే అవకాశమిచ్చింది. అలాగే అమ్మలు, ప్లస్‌ సైజ్‌ బ్యూటీస్‌, ట్రాన్స్‌జెండర్లకూ ఈ పోటీల్లో పాల్గొనేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగానే ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌’ అందాల పోటీల్లో వయోపరిమితిని 18-73 ఏళ్లుగా నిర్ణయించారు. దీంతో 60 ఏళ్ల అలెజాండ్రాకు ఈసారి ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది.

మార్పు.. నాతో మొదలు!

కేవలం ఈ పోటీల్లో పోటీపడడమే కాదు.. తనదైన అందం, ఆత్మవిశ్వాసంతో తనకన్నా చిన్న వయసు అమ్మాయిలను సైతం వెనక్కి నెట్టి.. కిరీటమూ చేజిక్కించుకుంది అలెజాండ్రా. తద్వారా పెద్ద వయసులో అందాల కిరీటం అందుకున్న తొలి మహిళగా చరిత్రకెక్కిందామె. ఈ విజయంతో మేలో జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా’ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన ఈ ఓల్డెస్ట్‌ బ్యూటీ.. ఇందులోనూ గెలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ‘విశ్వసుందరి’ పోటీల్లో తన దేశం తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.

‘అందమంటే బయటికి కనిపించేది కాదు.. ఆత్మసౌందర్యమే అసలైన అందమని ఈసారి ఈ అందాల పోటీలు నిరూపించాయి. ఇలాంటి చరిత్రాత్మక మార్పుకి నేను ప్రత్యక్ష ఉదాహరణగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. నా ఆత్మవిశ్వాసం, నా తరం మహిళలకు ప్రాతినిథ్యం వహించాలన్న నా తపన చూసే న్యాయనిర్ణేతలు నాకీ విజయాన్ని అందించారనిపిస్తోంది. తదుపరి జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా-2024’ పోటీల్లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నా..’ అంటోన్న అలెజాండ్రా.. ప్రస్తుతం ఈ పోటీల కోసం సన్నద్ధమవుతోంది. ఈ చక్కనమ్మ అందాల కిరీటం అలంకరించుకున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ పోటీల్లో 73 ఏళ్ల డ్యాన్స్‌ టీచర్‌, మోడల్‌, నటి ఇరిస్‌ అమేలియా రన్నరప్‌గా నిలవడం మరో విశేషం!

అదే నా బ్యూటీ సీక్రెట్!

అరవయ్యేళ్లంటే ముఖంపై ముడతలు, గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. శరీరాకృతిలోనూ పలు మార్పులొస్తాయి. మరోవైపు సత్తువ క్షీణించి అలసిపోతుంటాం. కానీ అలెజాండ్రాలో ఇవేవీ కనిపించవు. ఆరు పదుల వయసులోనూ తన గ్లామరస్‌ లుక్స్‌తో, ఫిట్టెస్ట్‌ బాడీతో కుర్రకారును ఫిదా చేస్తోందీ భామ. అయితే ఈ వయసులోనూ ఇంత అందంగా, ఆరోగ్యంగా కనిపించడానికి తాను పాటించే హెల్దీ లైఫ్‌స్టైలే కారణమంటోంది అలెజాండ్రా.

‘నేను వారానికి మూడు రోజులు వ్యాయామాలు చేస్తా. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ పాటిస్తా. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడమే నా ఆరోగ్యానికి, అందానికి ముఖ్య కారణం! ఏదైనా అతిగా చేయడం, పాటించడం నాకు ఇష్టముండదు.. కాస్త అందం నా జీన్స్ లోనూ ఉందనుకోండి..’ అంటూ నవ్వేస్తోంది అలెజాండ్రా.

సోలో లైఫ్‌ సో బెటర్!

లా ప్లాటాలో పుట్టి పెరిగిన అలెజాండ్రా.. బ్యూనస్‌ ఎయిర్స్‌ పట్టణంలో చదువుకుంది. జర్నలిజం వృత్తినే తన కెరీర్‌గా ఎంచుకున్న ఆమె.. ఆపై న్యాయవిద్యను కూడా అభ్యసించింది. గత 30 ఏళ్లుగా అక్కడి ఓ ఆస్పత్రిలో లీగల్‌ అడ్వైజర్‌గా/కన్సల్టెంట్‌గా పనిచేస్తోందామె. భర్త నుంచి విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తోన్న అలెజాండ్రా.. సింగిల్‌గా ఉండడం వల్లే తనకీ విజయం సాధ్యమైందేమో అంటూ చమత్కరిస్తోంది. ఈ అందాల రాశికి ప్రయాణాలంటే భలే ఇష్టమట! ముఖ్యంగా సముద్రాలను, మంచు ప్రాంతాల్ని ఎక్కువగా ఇష్టపడే అలెజాండ్రా.. ఆయా లొకేషన్లలో దిగిన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ మురిసిపోతుంటుంది. ఇక పిల్లులంటే ఈ బ్యూటీకి ఎంతిష్టమంటే.. తన వద్ద ఉన్న వివిధ రకాల క్యాట్స్‌తో దిగిన ఫొటోల్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఫుడ్‌ లవర్, అడ్వెంచరిస్ట్‌ కూడా!


ఆ కల నెరవేదనుకున్నా!

గతేడాది మిస్‌ యూనివర్స్‌ సంస్థ అందాల పోటీల నిబంధనల్ని సడలించడంతో.. ఈ పోటీల్లో పాల్గొనాలన్న చాలామంది మహిళల కోరిక నెరవేరుతోంది. అందులో తానూ ఒకరని చెబుతోంది 47 ఏళ్ల హైదీ క్రూజ్‌. ఇద్దరు పిల్లల తల్లైన ఆమె.. ఇటీవలే ‘మిస్‌ యూనివర్స్‌ డొమినికన్‌ రిపబ్లిక్‌’ అందాల కిరీటం గెలుచుకుంది. తద్వారా ఈ ఏడాది జరగబోయే ‘విశ్వసుందరి’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొననుంది.

‘అందాల పోటీల్లో పాల్గొనాలనేది నా చిన్ననాటి కల. కానీ చిన్న వయసులోనే తల్లినవడంతో ఆ కల నెరవేరలేదు. దీంతో చాలా బాధపడ్డా. అయితే మిస్‌ యూనివర్స్‌ అందాల పోటీల నియమాలు సడలించడంతో నా కల నెరవేరింది. విశ్వసుందరి పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..’ అంటోన్న క్రూజ్‌ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ నిపుణురాలిగా, హెల్త్‌ కోచ్‌గా పనిచేస్తోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, స్వీయ ప్రేమ.. వంటి అంశాల్లో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది.





Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్