Hula Hoop: అందుకే దీంతో వ్యాయామం ఎంతో మంచిది!

హూలాహూప్ వల్ల నడుము భాగంలో పేరుకుపోయిన కొవ్వులు కరిగిపోయి నాజూకైన నడుము సొంతమవుతుంది. అయితే ఈ రింగ్ వల్ల ఇదొక్కటే ప్రయోజనం అనుకుంటే పొరపాటే. దానివల్ల ఫిట్‌నెస్, ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.

Updated : 22 Jul 2023 20:05 IST

హూలాహూప్.. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ఫిట్‌నెస్‌ను పెంచుకోవడానికి కూడా చాలామంది దీనిని వాడుతుంటారు. సాధారణంగా హూలాహూప్‌ని ఎక్కువగా నడుము భాగం ఉపయోగించి గుండ్రంగా తిప్పుతూ ఉంటారు. దీనివల్ల ఆ భాగంలో పేరుకుపోయిన కొవ్వులు కరిగిపోయి నాజూకైన నడుము సొంతమవుతుంది. అయితే ఈ రింగ్ వల్ల ఇదొక్కటే ప్రయోజనం అనుకుంటే పొరపాటే. దానివల్ల ఫిట్‌నెస్, ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.

అన్ని శరీర భాగాలకు..

హూలాహూప్‌ని ఉపయోగించి ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా శరీరం అంతటికీ చక్కని వ్యాయామం అందుతుంది. ఆ రింగ్‌ని బ్యాలన్స్ చేసే క్రమంలో కాళ్లు, నడుము భాగాలకు ఎక్కువగా వ్యాయామం అందితే, రింగ్‌ని పట్టుకుని తిప్పడం, అలాగే బ్యాలన్సింగ్ కోసం చేతులను అటూఇటూ కదపడం ద్వారా శరీర పైభాగాలకు కూడా ఎంతో కొంత వ్యాయామం అందుతుంది. ఇలా శరీరం మొత్తంగా జరిగే కదలికల ద్వారా చక్కని వ్యాయామం లభిస్తుంది.

క్యాలరీలు కరిగిస్తూ..

ఒక గంట పాటు హూలాహూప్‌ని తిప్పడం ద్వారా దాదాపు 400 క్యాలరీలు సునాయాసంగా ఖర్చు చేయచ్చట! అయితే ఈ రింగ్‌ని ఉపయోగించి కరిగించే క్యాలరీల మొత్తం మనం దాన్ని తిప్పే వేగం మీద కూడా ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వేగంతో ఈ రింగ్‌ని తిప్పితే ఎక్కువ క్యాలరీలు, తక్కువ వేగంతో తిప్పితే తక్కువ క్యాలరీలు ఖర్చవుతాయట! ఇలా హూలాహూప్‌ని ఉపయోగించి 8 నిమిషాల పాటు మనం చేసే వర్కవుట్ ఒక కార్డియో ఎక్సర్‌సైజ్‌కి సమానమట.

కండరాలకు మంచిది..

హూలాహూప్‌ని ఉపయోగించి వ్యాయామం చేయడం ద్వారా కండరాల సామర్థ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా గుండె కండరాలకు ఈ వ్యాయామం చాలా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇది వెన్నుపాముకు సైతం బలాన్ని అందించి దాని కదలికలను మరింత మెరుగయ్యేలా చేస్తుందట.

మానసిక ప్రశాంతత కలిగిస్తూ..

మంచి మ్యూజిక్ వింటూ మన శరీర బరువును బ్యాలన్స్ చేస్తూ హూలాహూప్‌ని ఉపయోగించి వ్యాయామం చేస్తాం. కాబట్టి హృద్యమైన సంగీతం ద్వారా ఒత్తిడి తగ్గి, మనసుకు కూడా ఎంతో కొంత ప్రశాంతత చేకూరుతుంది. అలాగే కళ్లకు, చేతులకు మధ్య ఉండే సమన్వయం కూడా మరింత మెరుగవుతుంది. ఫలితంగా మనం మరింత ఉత్సాహంగా ఉండటానికి అవకాశం ఉంటుంది.

ఎండార్ఫిన్లు విడుదల చేసి..

హూలాహూప్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మనం సంతోషంగా ఉండటానికి ప్రేరేపిస్తాయి. కాబట్టి ఈ వర్కవుట్ ద్వారా సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను కూడా సొంతం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్