నా కూతురు వందమంది కొడుకులతో సమానం!

ఒక్క అవకాశం జీవితాన్ని మార్చినట్లు.. ఒక్క గోల్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తుంటుంది. అలాంటి విలువైన గోల్స్‌తో ‘మహిళల హాకీ జూనియర్ ప్రపంచకప్‌’లో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది లక్నో క్రీడాకారిణి ముంతాజ్‌ ఖాన్‌. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో....

Published : 11 Apr 2022 16:28 IST

(Photos: Twitter)

ఒక్క అవకాశం జీవితాన్ని మార్చినట్లు.. ఒక్క గోల్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తుంటుంది. అలాంటి విలువైన గోల్స్‌తో ‘మహిళల హాకీ జూనియర్ ప్రపంచకప్‌’లో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది లక్నో క్రీడాకారిణి ముంతాజ్‌ ఖాన్‌. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఆమె.. ఆసక్తితో, అభిలాషతో ఆటలో రాణిస్తోంది. తన ప్రతిభతో భారత మహిళల జట్టు భవిష్యత్‌ ప్లేయర్‌గా పేరు తెచ్చుకుంటోంది. అందుకే ‘నాకు కొడుకులు లేకపోతేనేం.. ముంతాజే నాకు వంద మంది కొడుకులతో సమానం’ అంటూ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతోంది ఆమె తల్లి ఖైజర్‌. ఒకానొక దశలో హాకీ స్టిక్‌ కూడా కొనలేని స్థితిలో ఉన్న ముంతాజ్‌.. ఇప్పుడు జాతీయ జట్టులో తిరుగులేని క్రీడాకారిణిగా సత్తా చాటుతూ ఎంతోమంది యువ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తన ప్రతిభతో పేదరికాన్ని, వివక్షను ఓడించిన ఆమె క్రీడా ప్రయాణం గురించి తెలుసుకుందాం..!

ప్రస్తుతం జరుగుతోన్న ‘మహిళల హాకీ జూనియర్‌ ప్రపంచకప్‌’లో భాగంగా మొత్తం ఆరు గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది లక్నో ప్లేయర్‌ ముంతాజ్‌ ఖాన్‌. ఈ టోర్నీలో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆమెది నిరుపేద కుటుంబం. ఆమె తల్లిదండ్రులిద్దరూ కాయగూరలమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వారి ఆరుగురు కూతుళ్లలో ముంతాజ్ ఒకరు.

‘మళ్లీ అమ్మాయేనా?’ అన్నారు!

ఆడపిల్లల్ని చిన్నచూపు చూసే సమాజంలో పుట్టి పెరిగింది ముంతాజ్‌. ఆరో కూతురిగా పుట్టిన ఆమెను చూసి అందరూ.. ‘మళ్లీ ఆడపిల్లేనా..? కుటుంబంలో ఒక్క మగబిడ్డైనా లేరే?!’ అంటూ జాలిగా చూశారంతా! అయితే వాళ్ల మాటలు పట్టించుకొని బాధపడలేదు ముంతాజ్‌ తల్లిదండ్రులు. తమ కూతుళ్లకు ఆసక్తి ఉన్న అంశాల్లోనే వాళ్లను ప్రోత్సహించారు. ఈ క్రమంలో ముంతాజ్‌కు ఆటలపై ఉన్న మక్కువను గ్రహించి ప్రోత్సహించారు. అయితే క్రీడలంటే ఇష్టమున్నా.. తాను హాకీలోకి రావడం మాత్రం అనుకోకుండా జరిగిపోయిందంటోందీ యంగ్‌ ప్లేయర్.

‘నాకు చిన్నతనం నుంచీ ఆటలంటే ఇష్టం. స్కూల్లో ఏ పోటీలు జరిగినా చురుగ్గా పాల్గొనేదాన్ని. అలా ఓసారి స్కూల్‌ అథ్లెటిక్స్‌ జట్టు తరఫున ఆగ్రాలో జరిగిన పోటీల్లో పాల్గొన్నా. స్ప్రింట్స్‌లో మొదటి స్థానంలో నిలిచా. అయితే నా ఆటతీరును గ్రహించిన అక్కడి స్థానిక కోచ్‌ ఒకరు ‘నువ్వు హాకీ ఎందుకు ఆడకూడదు?!’ అంటూ నాలో ఒక ఆలోచనను రేకెత్తించారు. ఇలా ఆయన చొరవతోనే కొన్నాళ్ల తర్వాత హాకీ సెలక్షన్‌ ట్రయల్స్‌కి హాజరయ్యా. అందులో ప్రతిభ కనబరిచి స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యా. స్పోర్ట్స్‌ హాస్టల్‌లో సీటు కూడా సంపాదించా. నిజానికి ఆ సమయంలో హాకీ స్టిక్‌ కూడా కొనలేని పరిస్థితి మా కుటుంబానిది! అప్పుడు కోచ్‌లే నాకు అండగా నిలిచారు..’ అంటూ చెప్పుకొచ్చింది ముంతాజ్.

ప్రతిభకు సానపెడుతూ..!

2017లో జూనియర్‌ జాతీయ హాకీ జట్టులోకి ప్రవేశించింది ముంతాజ్‌. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా.. మ్యాచ్‌ మ్యాచ్‌కీ తనలోని ప్రతిభకు సానపెడుతూ ముందుకు సాగుతోంది. ఇందుకు ప్రతిగానే 2018లో జరిగిన ‘యూత్‌ ఒలింపిక్స్‌’లో పది గోల్స్‌ సాధించి జట్టు రజత పతకం గెలవడంలో కీలక పాత్ర పోషించింది. తద్వారా దేశ ప్రధాని మోదీజీ మన్ననలూ అందుకుంది. ఇలా ఓవైపు వ్యక్తిగతంగా, మరోవైపు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ లక్నో ప్లేయర్‌.. ప్రస్తుతం జరుగుతోన్న ‘మహిళల హాకీ జూనియర్‌ ప్రపంచకప్‌’లోనూ సత్తా చాటుతోంది. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణ కొరియాను ఓడించడంలో ముంతాజ్‌ చేసిన డ్రాగ్‌-ఫ్లిక్‌ గోలే కీలకం! ఈ గేమ్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచిన ఈ యువ ప్లేయర్‌.. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆరు గోల్స్‌ సాధించింది. తద్వారా జట్టులో టాప్‌ గోల్‌ స్కోరర్‌గా.. టోర్నీలో మూడో అత్యధిక గోల్‌ స్కోరర్‌గా నిలిచి మరోసారి తన సత్తా చాటుకుంది. అయితే తాజాగా సెమీస్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిన భారత జట్టు.. మూడోస్థానం (కాంస్య పతకం) కోసం ఇంగ్లండ్‌తో తలపడనుంది.

తను వందమంది కొడుకులతో సమానం!

ఇలా ప్రపంచకప్‌లో రాణిస్తోన్న తమ కూతురిని చూసి పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు ముంతాజ్ తల్లిదండ్రులు. ‘కూతుళ్లున్న తల్లిదండ్రుల్ని ఈ సమాజంలో చాలా చిన్న చూపు చూస్తుంటారు.. వారిపై జాలి పడుతుంటారు. ఈ విషయంలో నేనూ ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు భరించా. కానీ ముంతాజ్‌ తన ఆటతీరుతో వారి మాటలకు చెక్‌ పెట్టింది. ఆడపిల్లలపై ఉన్న వివక్షను తరిమికొట్టింది. మమ్మల్ని గర్వపడేలా చేసింది. దేశం కోసం ఆడుతోన్న నా కూతురు వంద మంది కొడుకులతో సమానం. ఒకప్పుడు మమ్మల్ని చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు ముంతాజ్‌ ప్రతిభను ప్రశంసిస్తుంటే అంత కంటే సంతోషం ఇంకేం కావాలి..’ అంటున్నారు ముంతాజ్‌ తల్లి ఖైజర్‌ జహాన్‌. మరోవైపు ముంతాజ్‌ సోదరీమణులు కూడా ఆమె క్రీడాస్ఫూర్తిని చూసి గర్వపడుతున్నారు.

గుడ్‌ లక్‌ ముంతాజ్!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్