Lakshmi Devy: హాలీవుడ్‌ మెచ్చిన డాక్టరమ్మ!

‘ఒకడు అత్యాచారానికి తెగబెడితే.. అవమాన పడాల్సింది స్త్రీకాదు. ఆ మగాడే!’ ఇలాంటి మాటలు మనకు మింగుడుపడకపోవచ్చు.. అంగీకరించడానికి మనస్కరించకపోవచ్చు. కానీ ఇదే నేపథ్యంతో ‘వెన్‌ ది మ్యూజిక్‌ ఛేంజెస్‌’ అనే చిత్రాన్ని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా సినీవిమర్శకుల ప్రశంసలు అందుకుంది లక్ష్మీదేవి.

Updated : 15 May 2021 07:15 IST

‘ఒకడు అత్యాచారానికి తెగబెడితే.. అవమాన పడాల్సింది స్త్రీకాదు. ఆ మగాడే!’ ఇలాంటి మాటలు మనకు మింగుడుపడకపోవచ్చు.. అంగీకరించడానికి మనస్కరించకపోవచ్చు. కానీ ఇదే నేపథ్యంతో ‘వెన్‌ ది మ్యూజిక్‌ ఛేంజెస్‌’ అనే చిత్రాన్ని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా సినీవిమర్శకుల ప్రశంసలు అందుకుంది లక్ష్మీదేవి. ఈ ముద్దుగుమ్మ నటి, నిర్మాత, రచయిత, దర్శకురాలు మాత్రమే కాదు వైద్యురాలు కూడా!

‘ఒకమ్మాయి పొగరణచాలంటే ఆమెని రేప్‌ చేయాలి..’ తరాలుగా నాటుకున్న భావజాలం ఇది. లక్ష్మీదేవి మాత్రం ‘అలా చేస్తే పోయేది మగాడి పరువే..’ అంటారు. అనడమే కాదు ఆ నేపథ్యంతోనే ‘వెన్‌ ది మ్యూజిక్‌ ఛేంజెస్‌’ అనే అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. అందులో ఆమె ఓ ముఖ్య పాత్రలో నటించి మెప్పించారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలన్నింట్లోనూ ఈ సినిమా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘54వ వరల్డ్‌ ఫెస్ట్‌ - హోస్టన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఈ చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా గోల్డ్‌ రెమీ అవార్డుని గెలుచుకుంది ఇండియన్‌- అమెరికన్‌ నటి అయిన లక్ష్మీదేవి. ఆమె చదివింది వైద్యవిద్య అయినా మనసుకు నచ్చిన చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టి మహిళా సమస్యలను తెరపైకెక్కిస్తున్న ఆమెది కేరళ.

లక్ష్మీదేవి పుట్టింది న్యూయార్క్‌లో. తల్లి నెఫ్రాలజిస్టు. తండ్రి రచయిత. కేరళలోని తిరువనంతపురంలో వైద్యవిద్య చదువుకుంటున్న సమయంలో ఓ కొరియోగ్రాఫర్‌ దృష్టిలో పడింది. ఓవైపు చదువుకుంటూనే, మోడలింగ్‌, నృత్యంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. థియేటర్‌ రంగంలో ఓనమాలు నేర్చుకుంది. ఎంబీబీఎస్‌ పూర్తయ్యేలోపు చలనచిత్ర పరిశ్రమలోనూ తన సత్తా పరీక్షించుకుంది. పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. 

35 లక్షల మంది చూశారు...

2015లో విడుదలైన ‘మసాలా పదమ్‌’ అనే తమిళచిత్రంలో ప్రధానపాత్రలో నటించడంతోపాటు, ఆ చిత్రానికి  స్క్రీన్‌ప్లే అందించింది. ఓవైపు నటిస్తూనే, మరోవైపు సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని ‘డరో మత్‌’ అనే లఘుచిత్రాన్ని నిర్మించింది. దీనికి కథ, దర్శకత్వంతోపాటు ప్రధానపాత్రలో నటించింది. చదువుకు వివాహం అడ్డుకాకూడదనే సందేశాన్ని చక్కగా చూపించింది. ఈ లఘుచిత్రాన్ని ఆన్‌లైన్‌లో 35 లక్షలమంది వీక్షించడమే కాదు. 30కి పైగా అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో ప్రదర్శించడానికి అర్హతను దక్కించుకుంది. ప్రముఖుల ప్రశంసలతోపాటు ప్రతిష్ఠాత్మకమైన అవార్డులనూ సొంతం చేసుకుంది. ‘తిరువనంతపురంలోని మా పూర్వీకుల ఇంటిని షూటింగులకోసం అద్దెకిచ్చేవాళ్లం. అక్కడ జరిగే చిత్రీకరణలు చూసినప్పుడే నాకు నటనపై ఆసక్తి ఏర్పడింది. ఓ వయసైన హీరో  పక్కన... హీరోయిన్‌గా రొమాంటిక్‌ సీన్‌లో నటించడానికి అవకాశం వచ్చినప్పుడు మా ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాతతర్వాత నాకు నటనే కరెక్ట్‌ అనిపించింది’ అంటుంది లక్ష్మీదేవి.

స్వీయ అనుభవమే...

న్యూయార్క్‌లో నాలుగేళ్లక్రితం ‘ఫిడీ టాకీస్‌’ పేరుతో ప్రొడక్షన్‌ సంస్థను ప్రారంభించిన లక్ష్మీదేవి తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలకే అక్షరరూపాన్ని ఇచ్చానని చెబుతుంది. ‘మనసుకు నచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తామో, అదే వ్యక్తి మనల్ని మోసం చేశాడని తెలిస్తే అంతగా వేదన అనుభవిస్తాం. ఆడపిల్లగా నాకా అనుభవముంది. దీన్ని కథగా మార్చి తెరపైకెక్కించాలనుకున్నా. ఇందుకోసం చాలామంది మహిళలతో మాట్లాడా. మగవారి చేతిలో మోసపోయిన ఎందరో మహిళల మనోభావాలను తెలుసుకునేదాన్ని. వారిలో గూడు కట్టుకున్న వేదన పంచుకునేదాన్ని. ఈ కథ] రాయడానికి ఏడాది  సమయం పట్టింది. అలా ‘వెన్‌ ది మ్యూజిక్‌ ఛేంజెస్‌’ కథ పూర్తిచేశా. మన దేశంలో ప్రతి 16 నిమిషాలకు ఓ అమ్మాయి అత్యాచారానికి గురవుతోంది. పేపర్లలో అత్యాచార వార్తలని చూసినప్పుడు... ఇది చాలా సహజం అన్నట్టుగా పేజీలు తిరగేస్తాం. నాకూ ఇద్దరు మేనకోడళ్లు ఉన్నారు. వాళ్లనీ ప్రపంచంలో భయపడుతూ పెంచాలనుకోవడం లేదు. నాకీ పరిస్థితిని మార్చాలనిపించింది. అందుకే దర్శకురాలిగా, నిర్మాతగానే కాకుండా ప్రధానపాత్రలోనూ నటించా. ఉత్తమ దర్శకురాలిగానూ ఈ చిత్రం నన్ను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది.  ఓ భారతీయురాలిగా మన దేశమహిళల సమస్యలను ప్రపంచవేదికపైకి తీసుకురావాలనేదే నాలక్ష్యం’ అని చెబుతోంది డాక్టర్‌ లక్ష్మీదేవి.

లక్ష్మీదేవి గురించి ఇంకొంత..

* లక్ష్మీదేవి న్యూయార్క్‌లో పుట్టింది. ప్రాథమిక విద్య అక్కడే అభ్యసించి, ఇండియాలో వైద్య విద్య పూర్తి చేసింది. మెడికోగా ఉన్నపుడే నటిగా అవకాశం వచ్చింది.

* లక్ష్మీకి ఒక అన్న, చెల్లి ఉన్నారు. చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌ నేర్చుకున్న ఆమె పలు వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చింది.

* నటి అవుదామని లక్ష్మీదేవి అస్సలు అనుకోలేదట. ఎందుకంటే ఆమె కుటుంబంలోని వారంతా డాక్టర్లు.. ఇంజినీర్లు. ఆమె తల్లి ఓ వైద్యురాలు. దీంతో ఆమె కూడా మెడిసిన్‌ చదివారు.

* భారత్‌లో మెడికల్‌ కాలేజ్‌లో చదువుతున్న సమయంలోనూ ఇండియన్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌ను వదల్లేదు. అందులోని మెళకువలు నేర్చుకున్నారు. అయితే, నటనవైపు వద్దామని అప్పుడు కూడా అనుకోలేదట.

* ఒకరోజు షాపింగ్‌కు వెళ్తే ఓ ఫ్యాషన్‌ కొరియోగ్రాఫర్‌ లక్ష్మీదేవిని చూసి, ప్రింట్‌ మీడియాలో ప్రకటన కోసం మోడలింగ్‌ చేయమని అడిగారట. అలా తొలిసారి మోడల్‌గా మారాల్సి వచ్చింది.

* ఆ యాడ్‌ షూటింగ్‌ తన జీవితాన్నే మార్చేసిందని చెబుతారు లక్ష్మీదేవి. అప్పటి నుంచి కెమెరాతో ప్రేమలో పడిపోయానని, నటిగా కొనసాగుదామన్న ఆలోచనే అప్పుడే పుట్టిందని అంటారు.

* ఆ తర్వాత నటనకు సంబంధించి చెన్నైలోని ‘ది మెండ్‌స్క్రీన్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌’లో శిక్షణ తీసుకున్నారు. ముంబయిలోని యాక్టింగ్‌ స్కూల్లో చేరి నటనలో మెళకువలు తెలుసుకున్నారు. మరోవైపు ప్రకటనలకు మోడలింగ్‌ చేస్తూ వచ్చారు.

* 2010లో ఆనంద్‌ చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన  ‘నిల్ గవతి సెల్లతే’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన ‘మసాల పదమ్‌’ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు స్క్రీన్ రైటర్ తనే.

* లక్ష్మీదేవి తండ్రి రచయిత కూడా. ఆయన ట్రావెల్‌వోగ్‌ రాస్తూ ఉండేవారట. ఆ ప్రభావంతోనే తాను రచయితగా మారి ‘మసాల పదమ్‌’ చిత్రానికి స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశానని అంటారు లక్ష్మి.

* కొత్త కొత్త ప్రదేశాలను చూడటమంటే లక్ష్మీదేవికి మహాఇష్టం. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పర్యటించిందట. ఈజిప్ట్‌ పర్యటనను తాను ఎప్పటికీ మార్చిపోనని ముఖ్యంగా గాజా పిరమిడ్‌, ఒంటెపై రైడింగ్‌ తనకెంతో ఇష్టమని చెబుతారు.

* కేవలం ట్రావెలింగ్‌ మాత్రమే కాదు, సాహసాలు చేయడం కూడా లక్ష్మీదేవికి ఇష్టమే. అందుకే మాల్దీవులు, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్కూబా డైవింగ్‌ కోసం లైసెన్స్‌ కూడా తీసుకున్నారు. ఏడాదిలో ఒక్కసారైన స్కూబా డైవింగ్‌ చేస్తారు.

* సోషల్‌ మీడియాలోనూ లక్ష్మీదేవి యాక్టివ్‌గా ఉంటారు. 2016 జ‌న‌వ‌రి 4న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. ప్రస్తుతం లక్ష్మీదేవిని అనుస‌రిస్తోన్న వారి సంఖ్య‌: 83,415 పైగానే. ఇక 2012లో ట్విట‌ర్‌లో అడుగుపెట్టారు. ట్విట‌ర్‌లో 3,332 మంది ఈమెను అనుస‌రిస్తున్నారు.



పెద్దపెద్ద ఘటనలకు నేనేమీ చలించను, నిశ్శబ్దంగానే ఉంటాను. అల్పమైన అంశాలే చిరాకుపెడతాయి.
- విక్టోరియా రాణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్