తన భయం.. నాకు సమస్యవుతోంది

నా సహోద్యోగి ఇటీవలే ప్రసూతి సెలవుల నుంచి వచ్చింది. ఆమె తన కొడుకును చూసుకోవడానికి ఓ కేర్‌టేకర్‌ని నియమించుకుంది. మొదటిసారి తల్లి కావడం, పరాయివాళ్ల చేతిలో బిడ్డను ఉంచడంతో చాలా భయపడుతోంది. దీంతో ఆమె తన ఇంట్లో

Updated : 26 Nov 2021 05:41 IST

నా సహోద్యోగి ఇటీవలే ప్రసూతి సెలవుల నుంచి వచ్చింది. ఆమె తన కొడుకును చూసుకోవడానికి ఓ కేర్‌టేకర్‌ని నియమించుకుంది. మొదటిసారి తల్లి కావడం, పరాయివాళ్ల చేతిలో బిడ్డను ఉంచడంతో చాలా భయపడుతోంది. దీంతో ఆమె తన ఇంట్లో సీసీటీవీని ఇన్‌స్టాల్‌ చేసి, ఫోన్‌లో పర్యవేక్షిస్తుంటుంది. మా ఇద్దరివీ పక్కపక్క సీట్లు. దాంతో అది నాకు ఇబ్బందిగా ఉంది. తన కొడుకు ఆడుకోవడాన్ని చూస్తూ ఎప్పుడూ పరధ్యానంగా ఉంటోంది. ఉద్యోగంపై ఆమెకు అంతగా శ్రద్ధ లేదేమో అనిపిస్తోంది. పైగా ఆమె పని భారాన్నీ నేనే మోయాల్సి వస్తోంది. మేమిద్దరం ఒకే అధికారి కింద పనిచేస్తాం. ఆయనకు ఫిర్యాదు చేయాలా? తనతోనే నేరుగా మాట్లాడాలా? సలహా ఇవ్వండి.

- శ్రేయ, ఖమ్మం

ఆఫీసులో ఉండి, పిల్లాడి బాగోగులను గమనించుకునే అవకాశం ఉండటం మంచిదే. అయితే మీ సహోద్యోగి అతి శ్రద్ధ మాత్రం పని వాతావరణానికి అంత మంచిది కాదు. ఇది ఆమె దృష్టిని మర్చలడం, తన పనిని ప్రభావితం చేయడమే కాక మీ పనికీ ఇబ్బందిగా మారింది. మీ పరిస్థితిని విన్న వారెవరైనా వదిలేయమనీ, ఇది నీకు సంబంధించింది కాదనే సలహాలిస్తారు. ఆమె కొత్తగా తల్లి అయ్యింది. కాబట్టి వర్కింగ్‌ మదర్‌గా ఆమె పాటించాల్సినవి తెలియక పోయుండొచ్చు. మీరు మీపై అధికారితో మాట్లాడటానికి ఎందుకు సంకోచిస్తున్నారు? వారే ఆమెతో మాట్లాడటానికి సరైన వ్యక్తి. చాలా సందర్భాల్లో ఎవరితో సమస్య ఉందో వాళ్లతోనే వెళ్లి మాట్లాడటం అర్థవంతమైన చర్యే. అయితే ఈ సందర్భంలో మీ సహోద్యోగి చేస్తున్న దాన్ని ఆపమని కచ్చితంగా చెప్పలేరు. కాబట్టి పైవాళ్ల జోక్యమే మంచిది. అలాగని కంప్లైంట్‌లానూ ఉండాల్సిన పనిలేదు. ‘నేను ఇలా గమనించాను. మీ దృష్టికి తీసుకురావడం మంచిదేమో అనిపించింది’ అని చెబితే చాలు. మీ బాస్‌కు అందులో తప్పేమీ కనిపించకపోతే అదే చెబుతారు. సమస్యగా భావిస్తే పరిష్కారాన్ని వాళ్లే సూచిస్తారు. సహోద్యోగిపట్ల దయగా ఉండటం మంచిదే. అయితే అది సరిహద్దుల్ని దాటకూడదు. ఆ విషయంలో దృఢంగా ఉండాల్సిన బాధ్యత మీదే. ఎదుటివారిని అర్థం చేసుకోవడమంటే వారి క్రమశిక్షణా రాహిత్యాన్ని, దాని పరిణామాలనూ మిమ్మల్ని భరించమని కాదు. ఇక నుంచి ఈ తేడాలను గమనించుకుంటూ సాగండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని