రెండో సంతానం కావాలని హింసిస్తున్నాడు!
మా చెల్లికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. మొదట బాబు. ఇప్పుడు ఆమె భర్త మరో సంతానం కావాలంటున్నాడు. అయితే, ఆమె గర్భం దాల్చకపోవడంతో శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. ఈ విషయాన్ని పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టాం.
మా చెల్లికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. మొదట బాబు. ఇప్పుడు ఆమె భర్త మరో సంతానం కావాలంటున్నాడు. అయితే, ఆమె గర్భం దాల్చకపోవడంతో శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. ఈ విషయాన్ని పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టాం. సర్ది చెప్పి కాపురానికి పంపించారు. రెండు రోజులకే కొట్టి పంపించేశాడు. ఇప్పటి వరకూ కనీసం ఫోను కూడా చేయలేదు. దీంతో మా చెల్లి అతడితో కలిసి బతకలేనంటోంది. ఆమె భవిష్యత్తు కోసం మేమేం చేయాలి?
- ఓ సోదరి
* మీ చెల్లి భర్త... తనని వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లనిపిస్తోంది. పెద్ద మనుషులు సర్ది చెప్పినప్పుడు మళ్లీ కొట్టనని అతడితో కాగితం రాయించుకున్నారా? ఇక, అలాంటి మధ్యవర్తిత్వం కంటే, మీడియేటింగ్ సెంటర్ ద్వారా పరిష్కరించుకోవడం మేలు. కోర్టు ద్వారా తేల్చుకున్నా మంచిదే. మీ చెల్లితో భర్త, అత్తింటి వారిపై గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేయించండి. ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర కౌన్సెలింగ్‌కి పిలిపించి మాట్లాడండి. ఒకవేళ ఆమె వెళ్తానంటే ఇంకెప్పుడూ కొట్టను అని అతడితో హామీ రాయించుకున్నాకే పంపండి. అతడు మాట వినకపోతే కేసుని కోర్టుకి పంపిస్తారు. అక్కడ రక్షణ(సెక్షన్18), రెసిడెన్స్ ఆర్డర్(సెక్షన్19), ఆ అమ్మాయికి అవసరమైన మందుల ఖర్చులు, జీవన భృతి (సెక్షన్ 20), కొడుకుని తనతో ఉంచుకోవడానికి కస్టడీ ఆర్డర్ (సెక్షన్ 21), ఏక మొత్తంలో పరిహారం (సెక్షన్ 22) కోరవచ్చు. అతను కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోతే శిక్షార్హుడవుతాడు. కోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ ద్వారా మీ చెల్లిపై గృహ హింస జరగకుండా రక్షణ అధికారిని నియమిస్తారు. ఇక అతడితో వద్దనుకుంటే హిందూ వివాహ చట్టం సెక్షన్ 13(1) కింద విడాకులు కోరవచ్చు. సెక్షన్ 25 కింద తన జీవితం సాఫీగా సాగడానికి శాశ్వత భత్యం కూడా పొందవచ్చు. అలానే, గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద కూడా పిల్లల కస్టడీని తీసుకోవచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.