Dear Vasundhara: వీడియోకాల్ చేసి ఇల్లంతా చూపించమంటాడు!
మా పెళ్లై పదకొండేళ్లు. ఇద్దరు పిల్లలున్నారు. వివాహమైన కొద్ది రోజులకే మావారి ప్రవర్తన తెలిసింది. ఏ చిన్న గొడవైనా సరే... రాత్రంతా నిద్రపోనివ్వకుండా రోజుల తరబడి సతాయిస్తుంటాడు.
మా పెళ్లై పదకొండేళ్లు. ఇద్దరు పిల్లలున్నారు. వివాహమైన కొద్ది రోజులకే మావారి ప్రవర్తన తెలిసింది. ఏ చిన్న గొడవైనా సరే... రాత్రంతా నిద్రపోనివ్వకుండా రోజుల తరబడి సతాయిస్తుంటాడు. మా అమ్మానాన్నలతో మాట్లాడినా సరే! నా గురించేనా ఏం చెడుగా చెప్పావంటాడు. నా ఫోన్ కాల్ లిస్ట్, టైమ్ వంటివన్నీ చెక్ చేస్తాడు. కాల్ మాట్లాడేవరకూ ఫోన్ చేయడమే కాదు, అనుమానంతో తరచూ వీడియో కాల్ చేసి ఇల్లంతా చూపించమంటాడు. అమ్మానాన్నలకు చెబితే సర్దుకుపొమ్మంటున్నారు. ఇతనికి హిస్టీరియా ఉందని వాళ్లింట్లోవాళ్లు ఎవరితోనో చెబితే విన్నాను. అతడితో కలిసి ఉండటం రోజూ నరకంగా ఉంది. విడాకులు ఇస్తే చస్తాననీ బెదిరిస్తున్నాడు. అతడి ప్రమేయం లేకుండా విడాకులు తీసుకోవచ్చా? ఇదంతా కోర్టులో ఎలా నిరూపించాలి?
- ఓ సోదరి
పదకొండేళ్లుగా డాక్టరుకి చూపించకుండా ఎందుకు ఆలస్యం చేశారు. పెళ్లయిన కొత్తలోనే పరిష్కారం కోసం ప్రయత్నించాల్సింది. ఎప్పుడో ఒకసారి చేశారంటే వదిలేయొచ్చు. కానీ, ప్రతి విషయాన్నీ అనుమానంతో చూస్తున్నారంటే అది కచ్చితంగా క్రూరత్వం కిందకి వస్తుంది. ఇలా రోజూ నరకంలో ఉండమని ఎవరూ చెప్పరు. హిందూ వివాహచట్టంలోని సెక్షన్-13 క్రూరత్వాన్ని విడాకులకు ఓ కారణంగా చూపించొచ్చని చెబుతోంది. అతడు మిమ్మల్ని ఎమోషనల్‌గా బాధిస్తున్నాడు. విడాకులు ఇస్తే చస్తానని బెదిరించడం సూసైడల్ టెండెన్సీ కిందకు వస్తుంది. 2011లో సుప్రీంకోర్టు మానసిక వ్యధ కలిగించడాన్ని కారణంగా చూపించి విడాకులు కోరవచ్చని తీర్పు ఇచ్చింది. మీ ఇంట్లోవాళ్లు సర్దుకుపోమని చెబుతున్నారు. అయితే, ఇది మీ జీవితం. నిర్ణయం తీసుకునే హక్కు మీకు మాత్రమే ఉంది. అతడి ప్రమేయం లేకుండా మీరు విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పిల్లల భవిష్యత్తు, తదనంతరం మీ జీవితం కోసం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్-25 ప్రకారం శాశ్వత భృతి కోరవచ్చు. గృహహింస చట్టం కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇందులోని సెక్షన్-20 మీకూ, మీ పిల్లలకు పోషణ ఖర్చులు, సెక్షన్-22 ఇన్నాళ్లూ మీరు పడ్డ మానసిక క్షోభకు పరిహారం అడగవచ్చని చెబుతున్నాయి. ఇక, మీరు అతడికి మానసిక వ్యాధి అనీ, సూసైడల్ టెండెన్సీతో ఇబ్బంది పెడుతున్నాడనీ కారణాలుగా చూపించి విడాకులకు దరఖాస్తు చేయండి. కోర్టు నిజ నిరూపణకు మీ భర్తను డాక్టరు దగ్గరకు పరీక్షకు పంపుతారు. ముందు మీరు త్వరగా నిర్ణయం తీసుకుని ధైర్యంగా అడుగేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.