అప్పు చేసి... తీర్చమంటున్నాడు!

నేను, మా వారు ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేశాం. వచ్చే పెన్షన్‌ మీదే కాలం వెళ్లదీస్తున్నాం. మాకు ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. వారి పెళ్లిళ్లకు ముందే ఎవరివాటా వారికి రాసిచ్చేశాం.

Updated : 30 Jan 2024 15:51 IST

నేను, మా వారు ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేశాం. వచ్చే పెన్షన్‌ మీదే కాలం వెళ్లదీస్తున్నాం. మాకు ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. వారి పెళ్లిళ్లకు ముందే ఎవరివాటా వారికి రాసిచ్చేశాం. మా భవిష్యత్తు దృష్ట్యా ఇల్లూ, ఎకరం పొలం నా పేరున ఉంచుకున్నాం. ఇప్పుడు సమస్య ఏంటంటే... చిన్నోడు వీటిని అమ్మి అప్పులు తీర్చుకుంటానంటున్నాడు. మిగిలిన ఇద్దరూ... వాడికి ఇస్తే మాకూ ఇవ్వాలంటున్నారు. ఎవరెవరో మీ అబ్బాయికి అప్పిచ్చాం  మీరే తీర్చాలంటూ ఇంటిమీదకు వస్తున్నారు. ఆయన మంచాన పడ్డారు. ఈ వయసులో ఇదంతా నాకు ఆందోళనగా ఉంది. పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తే... కొడుకు మీదే కేసు పెట్టిన చెడ్డ తల్లిగా మిగిలిపోతానేమో అనిపిస్తోంది. చట్టం నాకేమైనా సాయం చేస్తుందా?

 ఓ సోదరి

మీ పరిస్థితి బాధాకరం. చాలామంది వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్య ఇదే. మీరు పిల్లల కోసం ఉన్న గూడు పోగొట్టుకోకండి. మీరు ఇప్పటికే ఆస్తి పంచి ఇచ్చేశారు కాబట్టి మీ భాగంలో వారికి ఎలాంటి హక్కూ లేదు. సీనియర్‌ సిటిజన్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ మీకు రక్షణ కల్పిస్తుంది. దీని కింద నియమితులైన అధికారులకు మీరు ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు వాళ్లని పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తారు. లేదంటే సీనియర్‌ సిటిజన్‌ ట్రిబ్యునల్‌లో కంప్లయింట్‌ ఇవ్వండి. ఎందుకంటే, వృద్ధుల రక్షణ చట్టంలోని సెక్షన్‌ 22 బాధితుల జీవితానికీ, ఆస్తులకూ రక్షణ కల్పించాలని చెబుతోంది. ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు నమోదయ్యాక మీ పిల్లలకు నోటీసు ఇచ్చి పిలిపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఒకవేళ వారు కోర్టు ఆర్డరు ఖాతరు చేయకపోతే క్రిమినల్‌ యాక్షన్‌ కింద పోలీసుల సాయంతో అరెస్టు చేయవచ్చు. మీరు పరువు కోసం చూసుకుంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి రావొచ్చు. వీలైనంత త్వరగా ఒక లాయర్‌ని కలిస్తే ప్రొసీజర్‌ చెబుతారు. లేదా మీ దగ్గర్లోని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి వెళ్లి ఫిర్యాదు ఇవ్వండి. వాళ్లు దాన్ని సంబంధిత జిల్లా జడ్జి/లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఇన్‌ఛార్జ్‌ ముందు పెడతారు. వారు సమస్యను పరిష్కరిస్తారు. భయపడాల్సిన పనిలేదు. వీలైనంత వేగంగా నిర్ణయం తీసుకుని ముందడుగు వేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్