మనోధైర్యం.. ఆమె మంత్రం

ఆమె ఓ ఫిల్మ్‌మేకర్‌. బోధిస్తున్నదేమో ఫిట్‌నెస్‌ పాఠాలు. ఎందుకంటే.. ఈ సమయంలో మానసిక సమస్యలు పెరగడమే కారణమంటోంది. శరీరంతోపాటు మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాలంటోంది. ముఖ్యంగా

Published : 23 May 2021 01:02 IST

ఆమె ఓ ఫిల్మ్‌మేకర్‌. బోధిస్తున్నదేమో ఫిట్‌నెస్‌ పాఠాలు. ఎందుకంటే.. ఈ సమయంలో మానసిక సమస్యలు పెరగడమే కారణమంటోంది. శరీరంతోపాటు మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాలంటోంది. ముఖ్యంగా 10 నుంచి 22 ఏళ్ల వయసు వారే లక్ష్యంగా పనిచేస్తోంది. ఆమే బీనూ రాజ్‌పూత్‌.
బీనూ రాజ్‌పూత్‌ తీసే సినిమాలన్నీ భారతీయ కళలు, సంస్కృతి ఆధారంగా సమాజానికి సందేశాన్నిచ్చేలా ఉంటాయి. అన్నీ తక్కువ నిడివి సినిమాలే. తన బీఆర్‌ ఫిల్మ్స్‌ అండ్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా డాక్యుమెంటరీ, ఆర్ట్‌, రిసెర్చ్‌ ప్రాజెక్టులు, కార్పొరేట్‌ ఫిల్మ్స్‌ను చిత్రీకరిస్తోంది.
ఈ ఏడాది కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి జూమ్‌, గూగుల్‌ మీట్‌ ద్వారా ఫిట్‌నెస్‌ సెషన్లను నడుపుతోంది. తనుండేది దిల్లీలోని పతపర్‌గంజ్‌. ప్రస్తుతం దిల్లీ, చండీగఢ్‌, హైదరాబాద్‌, వైజాగ్‌ వారికోసం నిర్వహిస్తోంది. 10 నుంచి 50 ఏళ్ల వారి వరకూ వీటిలో పాల్గొనవచ్చు. ‘కొవిడ్‌, లాక్‌డౌన్‌.. యువత, పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపాయి. తమ సమయాన్ని ఎక్కువ బయటే గడిపే వీరు ఒక్కసారిగా ఇంటికే పరిమితమయ్యారు. యువతకు కెరియర్‌ విషయంలో, పిల్లలకు స్నేహితులతో ఆడుకునే, గడిపే వీలులేక మానసిక ఒత్తిడి. అందుకే యోగా, మెడిటేషన్‌ తరగతులు నిర్వహిస్తున్నా. ఇవి శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా చేస్తాయి’ అంటోంది 40 ఏళ్ల బీనూ.
10-22 ఏళ్లవారు ఈ ప్రతికూల ప్రభావానికి ఎక్కువగా గురవుతుండటంతో వారిపై ఎక్కువ దృష్టిపెడుతోంది. వారిలో సానుకూల ఆలోచనలను కలిగించేలా మోటివేషనల్‌ స్పీచ్‌లు ఇస్తుంది. వారితో మాట్లాడి ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. బీనూ ‘రన్‌ ఫర్‌ లైవ్స్‌’ పేరిట వెబ్‌సైట్‌నూ ఏర్పాటు చేసింది. పరుగు, సైకిల్‌ తొక్కడం శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో దీనిలో తెలియజేస్తోంది. తన కృషిని గుర్తించి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ‘ఫిట్‌ ఇండియా ఛాంపియన్‌’గా ఎంపిక చేసింది.

అంధుల కోసం..
చూపులేని వారికోసమూ ప్రత్యేకంగా తరగతులు తీసుకుంటోంది. ఇందుకుగానూ దిల్లీకి చెందిన సిల్వర్‌ లైన్స్‌ అనే ఎన్‌జీఓతో కలిసి పనిచేస్తోంది. ‘సామాజిక దూరం మామూలు వారికే కష్టమవుతోంది. ఒత్తిడిని పెంచుతోంది. ఇక అంధుల పరిస్థితేంటో అర్థం చేసుకోండి. వాళ్లు ఏ పనినైనా ముట్టుకోవడం ద్వారానో, ఇతరుల ద్వారానో మాత్రమే చేయగలుగుతారు. ఇప్పుడు వారి సాయానికీ ఎవరూ ముందుకు రావడం లేదు. చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోవడమూ మానసికంగా దెబ్బ తీస్తుంది. ఒత్తిడిని పెంచుతుంది. వారి కోసం ప్రాణాయామం వంటి శ్వాస సంబంధ వ్యాయామాలు, ధ్యానం నేర్పిస్తున్నా’నంటోంది.
నేర్చుకుంటూనే ఉంది
బీనూ పదిహేనేళ్లుగా ఫిట్‌నెస్‌ మీద కృషి చేస్తోంది. అయిదేళ్ల నుంచి యోగా సాధన చేస్తోంది. మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా నుంచి ఇన్‌స్ట్రక్టర్‌గా సర్టిఫికేషన్‌నూ సాధించింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి యోగాలో మాస్టర్స్‌ చేస్తోంది. ఒక డాక్యుమెంటరీ కోసం కథక్‌నూ నేర్చుకుంది. కైవల్యధామ యోగా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఆయుర్వేద నియమాలను నేర్చుకుంటోంది. రోగనిరోధక శక్తిని పెంచే అంశాలను సాధన చేస్తోంది. ‘ఆరోగ్యమే మహాభాగ్యం.. దీని అర్థం చాలామందికి తెలియదు. తెలుసుకునే సరికే ఆలస్యమైతే? ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరం, మనసు రెండూ ప్రభావానికి గురవుతున్నాయి. జాగ్రత్త పడాల్సిన సమయమిది. అందుకే అందరిలో అవగాహన కల్పించాలనే ఈ ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించాను. ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను’ అంటోంది బీనూ రాజ్‌పూత్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్