ఇలా తక్కువ బడ్జెట్ లోనే ఇంటిని లగ్జరీగా మార్చేసుకోవచ్చు!

తమ కలల ఇంటిని విలాసవంతంగా మార్చుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి?! అయితే అందుకు బోలెడంత ఖర్చవుతుందనుకుంటారు చాలామంది. అది మా వల్ల కాదని ఎలాగోలా రాజీపడి మనసును తృప్తి పరచుకుంటుంటారు.

Published : 03 Oct 2021 13:46 IST

తమ కలల ఇంటిని విలాసవంతంగా మార్చుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి?! అయితే అందుకు బోలెడంత ఖర్చవుతుందనుకుంటారు చాలామంది. అది మా వల్ల కాదని ఎలాగోలా రాజీపడి మనసును తృప్తి పరచుకుంటుంటారు. కానీ ఆ అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇంటిని లగ్జరీగా మార్చుకోవాలంటే లక్షల కొద్దీ ఖర్చు పెట్టకుండా.. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు.

కర్టెన్స్‌తో కనికట్టు!

ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో కర్టెన్స్ పాత్ర కీలకం అని చెప్పుకోవాలి. అందుకే వీటి కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడం. అయితే మనకున్న బడ్జెట్‌లోనే కర్టెన్స్ని ఎంచుకొని ఇంటిని విలాసవంతంగా మార్చేయచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని ఆప్షన్లున్నాయంటున్నారు. ఈ క్రమంలో పారదర్శకంగా ఉండే రంగురంగుల ప్లెయిన్‌ క్లాత్‌ని తీసుకొని కర్టెన్‌గా కుట్టించుకోవచ్చు. దానికి పైభాగంలో ఆర్చ్‌ లుక్‌ వచ్చేలా దీనికి వ్యతిరేక రంగుల్లో లేదంటే మ్యాచింగ్‌ కలర్‌ క్లాత్‌ తీసుకొని అందంగా డిజైన్‌ చేయించుకోవచ్చు. ఇదీ కాదంటే షీర్‌ తరహా కర్టెన్లు సైతం మార్కెట్లో దొరుకుతున్నాయి. లేదంటే ప్రింటెడ్‌ తరహావీ ఎంచుకోవచ్చు. ఇక హాల్‌ కోసమైతే తక్కువ ధరల్లోనే బీడెడ్ కర్టెన్లు లభ్యమవుతున్నాయి. కాస్త సమయం వెచ్చించి వీటి గురించి శోధిస్తే.. ఇంపైన కర్టెన్లతోనే ఇంటిని లగ్జరీగా మార్చేసుకోవచ్చు.

పూలతో ఇంపుగా!

అందాన్ని కోరుకొనో లేదంటే ఆరోగ్యం కోసమో.. ఇలా కారణమేదైనా ప్రస్తుతం చాలామంది తమ ఇంటికి పచ్చదనాన్ని జోడించడం కామనైపోయింది. ఈ క్రమంలో ఇంట్లోని గాలిని శుద్ధి చేసే మొక్కలతో పాటు తీగ మొక్కలు, బోన్సాయ్‌ మొక్కలకూ చోటిస్తున్నారు. ఇంట్లో పూల మొక్కల్ని పెంచుకునే వారూ పెరిగిపోతున్నారు. అయితే వీటితో పాటు రంగురంగుల పూలను ఒక్కచోట చేర్చిన ఫ్లవర్‌ వేజ్‌లనూ గదిలో అక్కడక్కడా అమర్చడం వల్ల ఇంటికి కొత్త కళ తీసుకురావచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఇంటి ఆరుబయట పూచే రంగురంగుల పూలను కూర్చి రోజూ వేజ్‌లో పెట్టడం.. లేదంటే బయటదొరికే ఆర్టిఫిషియల్‌ ఫ్లవర్‌ వేజ్‌లను గది మూలల్లో, కిటికీలపై అమర్చుకోవడం ఒక పద్ధతి! అంతేకాదు.. ప్రస్తుతం హ్యాంగింగ్‌ ఫ్లవర్‌ వేజ్‌లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని గోడకు, గది పార్టిషన్స్‌, బాల్కనీ, ఇంటి ముందు వేలాడదీస్తే ఇంటి అందం రెట్టింపవుతుందనడంలో సందేహమే లేదు.

అతికించేయండి!

ఇంటిని అలంకరించుకోవడంలో భాగంగా ప్రస్తుతం చాలామంది ఇంటీరియర్‌ డిజైనింగ్‌కే ఓటేస్తున్నారు. కానీ అందుకు మన బడ్జెట్‌ సరిపోవచ్చు.. సరిపోకపోవచ్చు..! ఇలాంటప్పుడు అవే కావాలని పట్టుబట్టకుండా వాటికి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తే ఇంటికి అదిరిపోయే లుక్‌ని తీసుకురావచ్చంటున్నారు డిజైనర్లు. ఉదాహరణకు.. మీరు అనుకున్నట్లుగా వాల్‌ పెయింటింగ్‌ చేయించుకోవాలంటే అందుకు బోలెడంత డబ్బు ఖర్చవుతుంది. అదే తక్కువ ధరలో ఆకర్షణీయంగా ఉండే, మీ సోఫా/మంచం రంగుకు నప్పే ఓ వాల్‌పేపర్‌ని కొని అతికించేస్తే ఖర్చూ తగ్గుతుంది.. ఇంటి అందమూ ఇనుమడిస్తుంది. ఇలా ఆలోచిస్తే ప్రతిదాంట్లోనూ ప్రత్యామ్నాయాలు దొరుకుతాయి. లేదంటే ఈ విషయంలో ఇంటీరియర్‌ డిజైనర్ల సలహాలూ తీసుకోవచ్చు.

ఫ్యాబ్రిక్స్‌తో మంత్రమేద్దాం!

ఇంటికి సొబగులద్దే విషయంలో ఫ్యాబ్రిక్స్‌నీ వదలట్లేదు మోడ్రన్‌ మగువలు. అయితే ఇందులోనూ ఫర్‌, వెల్వెట్‌, లినెన్‌, లెదర్‌.. వంటి మెటీరియల్స్‌ విలాసవంతమైన లుక్‌ని అందిస్తాయి. కాబట్టి వాటిలోనే మీ బడ్జెట్‌కు సరిపోయే ఫ్యాబ్రిక్స్‌, ప్రింటెడ్‌ తరహా బెడ్‌షీట్స్‌, కుషన్‌ కవర్స్‌, కార్పెట్స్‌, సోఫా కవర్స్‌, టేబుల్‌ షీట్స్‌.. ఇలా మీకు ఎలా కావాలంటే అలా ఎంచుకొని.. ఆయా వస్తువులపై పరచుకోవచ్చు. తద్వారా తక్కువ బడ్జెట్‌లోనే ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దుకోవచ్చు.

ఇవి కూడా!

* ఇంట్లో ఎన్ని అలంకరణ వస్తువులున్నా.. చీకటిగా ఉంటే కళ తప్పినట్లుగా కనిపిస్తుంటుంది. అందుకే ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా జాగ్రత్తపడమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కిటికీలు మూసి ఉన్నా వెలుతురు వచ్చేలా షీర్‌, ట్రాన్స్‌పరెంట్ తరహా కర్టెన్స్ ఎంపిక చేసుకోవచ్చు.

* పరిమళాలు వెదజల్లేలా సెంటెడ్‌ క్యాండిల్స్‌, వినసొంపైన సంగీతం.. వంటివీ పరోక్షంగా ఇంటిని లగ్జరీగా మార్చడంలో సహకరిస్తాయంటున్నారు నిపుణులు.

* ఇంటి అందాన్ని పెంచేలా ప్రస్తుతం తక్కువ ధరలోనే కర్టెన్‌ లైట్లు, షాండ్లియర్స్, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ సీలింగ్‌ ల్యాంపులు.. వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి.

ఇలా ఆలోచిస్తే ఇంటిని లగ్జరీగా మార్చుకోవడానికి ఇంకా బోలెడన్ని ఐడియాలొస్తాయి. మరి, మీరు మీ ఇంటిని లగ్జరీగా మార్చుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు. మాతో పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్