హెయిర్ బ్రష్/ దువ్వెన శుభ్రం చేద్దామిలా!

నచ్చిన హెయిర్‌స్త్టెల్ వేసుకుని అందంగా కనిపించాలని ఎవరికుండదు చెప్పండి? కానీ అందంగా రడీ అవ్వాలనే హడావిడిలో హెయిర్‌స్త్టెల్ పూర్తవగానే హెయిర్ బ్రష్ లేదా దువ్వెనను అలానే పక్కన పడేస్తారు. మళ్లీ తల దువ్వుకోవాలనుకున్నప్పుడు తప్ప అవి మనకు గుర్తురావు.

Published : 28 Oct 2021 20:44 IST

నచ్చిన హెయిర్‌స్త్టెల్ వేసుకుని అందంగా కనిపించాలని ఎవరికుండదు చెప్పండి? కానీ అందంగా రడీ అవ్వాలనే హడావిడిలో హెయిర్‌స్త్టెల్ పూర్తవగానే హెయిర్ బ్రష్ లేదా దువ్వెనను అలానే పక్కన పడేస్తారు. మళ్లీ తల దువ్వుకోవాలనుకున్నప్పుడు తప్ప అవి మనకు గుర్తురావు. ఫలితంగా తెగిపోయిన వెంట్రుకలు, పేరుకుపోయిన దుమ్ము, ధూళి.. అన్నీ కలిసి అవి చాలా మురికిగా కనిపించేలా చేస్తాయి. మరి వాటిని శుభ్రం చేయడమంటే అంత సులభమైన పని కాదు. అందుకే హెయిర్‌బ్రష్/ దువ్వెన శుభ్రం చేసుకోవడానికి ఉపకరించే కొన్ని చిట్కాలు మీకోసం..

మురికిగా ఉన్న దువ్వెనతో తల దువ్వుకుంటే చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే తరచుగా ఉపయోగించే హెయిర్‌బ్రష్/ దువ్వెనలను వారం లేదా పది రోజులకోసారైనా శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.

శుభ్రం చేద్దామిలా..!

ముందుగా దువ్వెనలో ఉన్న తెగిపోయిన లేదా వూడిపోయిన జుట్టుని టూత్‌పిక్ సాయంతో బయటకు తీసేయాలి. ఒకవేళ హెయిర్‌బ్రష్ అయితే టూత్‌పిక్‌తో తీయడం కష్టమనిపిస్తే పెన్ లేదా పెన్సిల్‌తో జుట్టుని వదులు చేయాలి. తర్వాత కత్తెర సాయంతో వాటిని ఎక్కడికక్కడ కట్ చేసి టూత్‌పిక్‌తో బయటకు తీసేయచ్చు. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లలో బేబీ షాంపూ వేసి అందులో హెయిర్‌బ్రష్ లేదా దువ్వెనను నానబెట్టాలి. మెత్తని బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌ను తీసుకుని దాని మీద కొద్దిగా బేబీ షాంపూ వేసి దువ్వెనపై బాగా రుద్దాలి. అలాగని మరీ గట్టిగా రుద్దితే దువ్వెన /హెయిర్‌బ్రష్‌కు ఉండే బ్రిజిల్స్ విరిగిపోవచ్చు. ఇలా బాగా రుద్దిన తర్వాత మళ్లీ గోరువెచ్చని నీటిలో బాగా కడిగి, పొడి టవల్ తీసుకుని దాంతో తుడిచి వాటిని బాగా ఆరబెట్టాలి.

ఇలా కూడా..

* మీరు జుట్టుకి జెల్స్, క్రీమ్స్ వంటివేమైనా అప్త్లె చేస్తారా? అయితే మీరు తల దువ్వుకున్న వెంటనే హెయిర్‌బ్రష్ లేదా దువ్వెనను షాంపూతో ఓసారి కడిగేసుకోవాలి. లేదంటే దువ్వెనకు అంటుకున్న జెల్ లేదా క్రీమ్‌కు దుమ్ము, ధూళి ఆకర్షితమవుతాయి. ఫలితంగా జుట్టు పాడై రాలిపోతుంది.

* గోరువెచ్చని నీరు, వెనిగర్ అరకప్పు చొప్పున తీసుకుని దువ్వెన లేదా హెయిర్‌బ్రష్‌ను నానబెట్టాలి. అలా 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టిన తర్వాత బయటకు తీసి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

* అలాగే వెనిగర్‌కు బదులుగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. అయితే కొన్ని హెయిర్‌బ్రష్‌లు బేకింగ్ సోడాలో ముంచకూడదు. అది ముందుగా సరిచూసుకుని తర్వాత వాటిని శుభ్రం చేయడానికి ఈ పద్ధతి అనుసరిస్తే మంచిది. లేదంటే మొత్తం వస్తువే పాడైపోయే అవకాశం ఉంటుంది.

* ఇవన్నీ కాకుండా దువ్వెనను నీళ్లలో నానబెట్టి ఒక పాత బ్రష్ తీసుకుని దాని మీద టూత్‌పేస్ట్, షాంపూ, సబ్బు.. ఇలా ఏదైనా తీసుకుని దాంతో దువ్వెన/ హెయిర్‌బ్రష్‌ని బాగా శుభ్రం చేయాలి. తర్వాత కడిగేసి ఆరబెట్టుకుంటే సరి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అన్నిటికంటే ఉత్తమమైన పని- తల దువ్వుకున్న వెంటనే అందులో ఉన్న వెంట్రుకలు తీసేసి దువ్వెనను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. తెలుసుకున్నారుగా..! దువ్వెనలు లేదా హెయిర్‌బ్రష్‌లను శుభ్రం చేయడానికి ఉపకరించే చిట్కాలు. మీరు కూడా వీటిని ప్రయత్నించి చూడండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్