చల్లని వేళా.. పోషకాలు!
చల్లని వర్షానికి వేడివేడిగా మిరపకాయ బజ్జీ, పునుగులు, పకోడి తింటోంటే ఆ మజానే వేరు కదూ! బరువు, డైట్ అంటూ లెక్కలేసుకొని తినే మనం నోరు కట్టేసుకోవాల్సిందేనా? అవసరం లేదు.. వీటిని ప్రయత్నిస్తే సరిపోతుంది.
చల్లని వర్షానికి వేడివేడిగా మిరపకాయ బజ్జీ, పునుగులు, పకోడి తింటోంటే ఆ మజానే వేరు కదూ! బరువు, డైట్ అంటూ లెక్కలేసుకొని తినే మనం నోరు కట్టేసుకోవాల్సిందేనా? అవసరం లేదు.. వీటిని ప్రయత్నిస్తే సరిపోతుంది.
♥ ఈకాలం మొక్కజొన్న కంకులు బాగా దొరుకుతాయి. వాటిని తెచ్చేసుకోండి. చక్కగా కాల్చి కాస్త నిమ్మరసం, ఉప్పు, కారం చేర్చి తింటే సరి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి, మెగ్నీషియం వంటి న్యూట్రియంట్లూ అందుతాయి.
♥ వేడి వేడి సమోసా, కప్పు అల్లం టీ.. ఇంతకంటే సాయంకాల వేళ ఇంకేం కావాలి చెప్పండి. నూనెలో బాగా వేగిన సమోసాతో కెలొరీల సమస్య కదా! అచ్చంగా బంగాళదుంపతో కాకుండా క్యారెట్, బఠాణీ, బీట్‌రూట్‌లను చిన్న ముక్కలుగా కోసి ఉడికించండి. వాటికి సన్నగా తరిగిన ఉల్లి, టొమాటో ముక్కలు, ఉప్పు కారం చేర్చి సమోసాలా వత్తుకోండి. పైన పలుచని పొరలా నూనెరాసి, అవెన్‌లో పెట్టేస్తే సరి. లేదా ఎయిర్ ఫ్రయర్‌లో ప్రయత్నించినా మంచిదే. కెలొరీలు తగ్గుతూనే పోషకాలూ అందుతాయి.
♥ ఉడికించిన స్వీట్‌కార్న్ గింజలకు సన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో, కీర ముక్కలను చేర్చాలి. కాస్త ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి కలిపి తినండి. విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన తక్కువ కెలొరీ స్నాక్ ఇది.
♥ శనగలు, పెసలు, బీన్స్.. నచ్చిన వాటిని నానబెట్టి మొలకెత్తించాలి. లేదూ రెండు మూడు రకాలను ఉడికించుకోవాలి. వీటిలో ఉడికించిన పల్లీలు, టొమాటో, కీర ముక్కలు ఉప్పు, మిరియాలపొడి చేర్చి తింటే సరి. జీర్ణప్రక్రియను సులభతరం చేస్తూనే శరీరాన్నీ ఉల్లాసంగా మారుస్తాయి.
♥ అటుకులను దోరగా వేయించి.. ఉప్పు, కారం, పల్లీలు చేర్చి తినండి. దీని ద్వారా ఫైబర్‌తోపాటు కార్బోహైడ్రేట్లు మెండుగా శరీరానికి అందుతాయి. పసుపు, కరివేపాకునూ చేర్చుకుంటే రుచితోపాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో శరీరానికీ ఆరోగ్యం.
♥ గుప్పెడు పల్లీలకు కొద్ది మొత్తంలో బాదం, జీడిపప్పు కలిపి వేయించాలి. జీలకర్ర, పసుపు, దాల్చినచెక్క పొడులతోపాటు కాస్త ఉప్పు కలిపి తింటే సరి. రుచికి రుచి.. ఇంకా ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు ప్రొటీన్, మినరల్స్ అందుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.