తెలివైందే కానీ మాట వినదు..
మా అమ్మాయికి పదిహేనేళ్లు. చాలా తెలివైంది, బాగా చదువుతుంది. కానీ అందరి మీదా చిరాకుపడుతుంది. ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటుంది. వేళకు తినదు. ఎవరైనా మంచి చెప్పాలని చూస్తే.. వయసుకైనా పెద్దరికం ఇవ్వకుండా అరుస్తుంది. చదువు ధ్యాసలో నిద్రనూ నిర్లక్ష్యం చేస్తుంది.
మా అమ్మాయికి పదిహేనేళ్లు. చాలా తెలివైంది, బాగా చదువుతుంది. కానీ అందరి మీదా చిరాకుపడుతుంది. ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటుంది. వేళకు తినదు. ఎవరైనా మంచి చెప్పాలని చూస్తే.. వయసుకైనా పెద్దరికం ఇవ్వకుండా అరుస్తుంది. చదువు ధ్యాసలో నిద్రనూ నిర్లక్ష్యం చేస్తుంది. తన ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది. దయచేసి సలహా ఇవ్వండి!
- ఒక సోదరి
హార్మోన్ల కారణంగా టీనేజ్‌లో శారీరక, మానసిక మార్పులొస్తాయి. ఈ వయసులో స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. తమ ఈడువాళ్లతోనే తప్ప మిగతావాళ్లతో కలిసేందుకు పెద్దగా ఉత్సాహం చూపరు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎవరైనా మంచి చెప్పినా తమకు అన్నీ తెలుసు, దేన్నయినా సమర్థించుకోగలమన్న అహంభావంతో వినడానికి సిద్ధంగా ఉండరు. స్నేహితులతో పోటీ పెట్టుకుని వారి కంటే అన్నివిధాలా మెరుగ్గా ఉండాలని తపిస్తారు. ఉన్నతి సాధించే దిశగా ప్రయత్నిస్తూ మిగతా విషయాలను అశ్రద్ధ చేస్తుంటారు. కెరియర్ గురించి ఆశలూ ఆశయాలే తప్ప వేళకు తినాలి, నిద్రపోవాలి లాంటి మిగతా విషయాల మీద ఆసక్తి ఉండదు. మీ అమ్మాయి కూడా ఆ ధోరణిలోనే చిరాకుపడుతోంది. మనసులో ఉన్న అశాంతి, ఆందోళనలను అరవడం, చెప్పిన మాట వినకపోవడం ద్వారా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఆమె మనస్థితిని మీరు అర్థం చేసుకోండి. బలవంత పెట్టినట్లు కాకుండా మీ కుటుంబంలో విద్యావంతులు, లేదా తన టీచర్లలో ఆమెకి ఎవరి మాట మీద గురి ఉంటుందో వాళ్లతో మాట్లాడించండి. మానసిక, శారీరక ఆరోగ్యాల ప్రాధాన్యం చెప్పించండి. మీరు ఫిర్యాదు చేసినట్లు కాకుండా యథాలాపంగా వారే మాట్లాడుతున్నట్టు చెప్పిస్తే తప్పక వింటుంది. అయితే ఒక్కసారిగా మార్పు అసాధ్యం. ఓపికగా ప్రయత్నించండి. అంతేకానీ ఎందుకు చిరాకుపడుతున్నావని మీరూ నిందించడం, ఎత్తిచూపడం చేస్తే సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి, మీరూ నెమ్మదిగా మాట్లాడుతుండండి. పరిస్థితి చక్కబడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.