ముఖానికి కళ తెచ్చే రహస్యం!

‘ఏంటోయ్‌.. ముఖం కళ తప్పుతోంది..’ అని మీతో ఎవరైనా అంటే మీరు ఆలోచించాల్సింది ముఖానికి ఏ క్రీం రాయాలని కాదు... మీలో ఒత్తిడి పెరుగుతుందేమోని. చర్మం కళతో మెరిసిపోవడానికీ, ఒత్తిడికీ ఏంటి సంబంధం అంటారా? అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

Published : 15 May 2021 00:53 IST


‘ఏంటోయ్‌.. ముఖం కళ తప్పుతోంది..’ అని మీతో ఎవరైనా అంటే మీరు ఆలోచించాల్సింది ముఖానికి ఏ క్రీం రాయాలని కాదు... మీలో ఒత్తిడి పెరుగుతుందేమోని. చర్మం కళతో మెరిసిపోవడానికీ, ఒత్తిడికీ ఏంటి సంబంధం అంటారా? అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
చర్మం నిర్జీవంగా ఉన్నా, అందంగా మెరిసిపోతున్నా దానికి కారణం మనలోని ఒత్తిడి, అందుకు కారణమయ్యే హార్మోన్లే అంటున్నాయి తాజా అధ్యయనాలు. ముఖ్యంగా మనం భావోద్వేగాలకు గురైనప్పుడు కార్టిసాల్‌ అనే హార్మోన్‌ విడుదలై ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. శరీరంలో చాలా సహజంగా జరిగే ప్రక్రియ ఇది. ‘ఎప్పుడో ఒకసారి విడుదలవ్వాల్సిన ఈ హార్మోను ఒత్తిడితో కూడిన మన జీవనశైలి వల్ల తరచూ విడుదలవుతోంది. వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ఈ హార్మోను విడుదలైతే శరీరంలో అంతర్గత వాపులు మొదలవుతాయి. దాని కారణంగానే ఎగ్జిమా, మొటిమలు, యాక్నె, సొరియాసిస్‌ వంటి సమస్యలు వస్తాయి. పైగా కార్టిసాల్‌ ఎక్కువ విడుదల అయ్యే వారిలో నీటి నిల్వలు పడిపోతుంటాయి. దాంతో చర్మం పొడిబారి, కళ తప్పుతుంది. త్వరగా ముడతలు పడిపోతుంది. చర్మకణాలు తిరిగి పునరుత్తేజం అవ్వడమూ కష్టమవుతుంద’ని అంటున్నారు న్యూయార్క్‌కి చెందిన వైద్య నిపుణురాలు డాక్టర్‌ వెస్లర్‌.


ఇలా మన చర్మం కళ తప్పిపోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

 

హాయినిద్రతో: అవును మనం హాయిగా ఆదమరచి నిద్రపోయినప్పుడు మనలో కార్టిసాల్‌ని అదుపులో ఉంచే ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్లతో పాటు మరికొన్ని ఆరోగ్యానికి సహకరించే హార్మోన్లూ విడుదల అవుతాయి. కనీసం ఏడు గంటలైనా హాయిగా నిద్రపోతే ఆ సమయంలో దిగాలుపడిన చర్మం తిరిగి కళపుంజుకుంటుందని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి.


చిలకాగోరింకల్లా ఉంటే: ముఖంలో కళకీ, చక్కని దాంపత్య జీవితానికీ కూడా సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనండోయ్‌! ప్రేమ నిండిన దాంపత్య జీవితాన్ని అనుభవించేవారిలో చర్మానికి కళపెంచే బెటా ఎండార్ఫిన్లు సమృద్ధిగా విడుదల అవుతాయి. ఫలితంగా మోము నిగనిగలాడుతుంది.


వ్యాయామంతో: రోజులో ఎంతో కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించడం వల్ల కార్టిసాల్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే ఇలా వ్యాయామాలు చేసేటప్పుడు సన్‌స్క్రీన్‌లోషన్‌ రాసుకోవడం మరిచిపోవద్దని అంటున్నారు వైద్యులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్